Suryakumar Yadav: అలా చెప్పేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు: సూర్యకుమార్‌

సూర్యకుమార్‌ యాదవ్‌ (SuryaKumar Yadav) టీ20ల్లో టాప్‌ బ్యాటర్. మరి వన్డేల్లోకి వచ్చేసరికి మాత్రం నిరాశపరుస్తున్నాడు. అయితే, తన గణాంకాలను వెల్లడించడానికి  మొహమాటం ఏదీ లేదని సూర్యకుమార్‌ వ్యాఖ్యానించడం విశేషం.

Updated : 09 Aug 2023 12:25 IST

ఇంటర్నెట్ డెస్క్: ఎట్టకేలకు సూర్యకుమార్‌ యాదవ్ (Suryakumar Yadav) తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడు. వెస్టిండీస్‌తో కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో (WI vs IND) తనదైన షాట్లతో చెలరేగి (44 బంతుల్లో 83) జట్టును గెలిపించడంలో ముఖ్య భూమిక పోషించాడు. మళ్లీ టీ20ల్లో తన మునుపటి ఫామ్‌తోపాటు 360 డిగ్రీల ఆటను ప్రదర్శించడంతో అభిమానులకు కనులవిందుగా మారింది. వచ్చే ప్రపంచ కప్‌లో సూర్య (SKY) ఆడితే బాగుంటుదనేది ఫ్యాన్స్ అభిప్రాయం. కానీ టీ20లతో పోలిస్తే వన్డేల్లో సూర్య గణాంకాలు మెరుగ్గా లేవు. ఇదే విషయంపై తాజాగా సూర్యకుమార్‌ స్పందించాడు. తన గణాంకాలు మెరుగ్గా లేవని తనకూ తెలునని, అలా చెప్పడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. 

‘‘నా వన్డే కెరీర్ గణాంకాల విషయంలో నిజాయతీగా ఉంటా. అందులో ఎలాంటి దాపరికాలు లేవు. బాగా లేవని చెప్పడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. అయితే, అలాంటి పరిస్థితుల నుంచి ఎలా మెరుగు కావాలనేదానిపై శ్రమిస్తా. రోహిత్, ద్రవిడ్‌తో కూడా ఇదే విషయంపై చర్చించా. వారు కూడా ‘ఈ ఫార్మాట్‌లో నువ్వేమి ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. చివరి 10 లేదా 15 ఓవర్లలో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు జట్టు కోసం ఏం చేయగలవో అదే చేయాలని సూచించారు. నాకు ఇచ్చిన బాధ్యతలను ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది నా చేతుల్లోనే ఉంది’’ అని తెలిపాడు. 

ఓడినా.. గెలిచినా దీర్ఘకాలిక ప్రణాళికల్లో మార్పులుండవు: పాండ్య

టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సూర్యకుమార్‌ వన్డే ఫార్మాట్‌లో మాత్రం సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఇప్పటి వరకు 26 వన్డేలు ఆడిన సూర్య కేవలం 511 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. కెరీర్‌లో ఇప్పటి వరకు ఒకే ఒక్క టెస్టు  మాత్రమే ఆడాడు. ఎనిమిది పరుగులతో సరిపెట్టుకున్నాడు. అయితే, 51 టీ20ల్లో మూడు సెంచరీలు, 14 అర్ధశతకాలతో 1,780 పరుగులు చేయడం విశేషం. ఇక ఐపీఎల్‌లోనూ 139 మ్యాచుల్లో 3,249 పరుగులు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని