Hardik on 3rd T20: ఓడినా.. గెలిచినా దీర్ఘకాలిక ప్రణాళికల్లో మార్పులుండవు: పాండ్య

ఎట్టకేలకు విండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ (WI vs IND) విజయం సాధించి సిరీస్‌ రేసులో నిలిచింది. సూర్య, తిలక్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్‌ పాండ్య మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated : 09 Aug 2023 13:45 IST

ఇంటర్నెట్ డెస్క్: చాలా రోజుల తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ (83) కీలక ఇన్నింగ్స్‌తోపాటు తిలక్‌ వర్మ (49*), హార్దిక్ పాండ్య (20) సమయోచిత ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో మూడో టీ20 మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ (WI vs IND) ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగతా రెండు మ్యాచుల్లో జట్టు గెలిచినా.. ఓడినా.. భవిష్యత్తు కోసం తీసుకునే దీర్ఘకాలిక నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పాడు.

IND vs WI - Suryakumar Yadav: కుమ్మేసిన సూర్య

‘‘మూడో టీ20లో విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఇది చాలా ముఖ్యమైన గెలుపు. ఇప్పటి వరకు మూడు టీ20లు ముగిశాయి. అయితే, ఒకటీ రెండు మ్యాచుల్లో గెలిచినా, ఓడినా పెద్దగా పట్టించుకోం. భవిష్యత్తులో దీర్ఘకాలిక ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే, తప్పనిసరిగా విజయం సాధించాల్సిన మ్యాచుల్లో మా సత్తా చూపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. విండీస్ డేంజరస్ బ్యాటర్ నికోలస్‌ పూరన్ ఎక్కువ సమయం క్రీజ్‌లో లేడు. దీంతో పేసర్లను మళ్లీ తీసుకొచ్చా. అలాగే అక్షర్‌తో నాలుగు ఓవర్ల కోటా వేయించగలిగా. ఒకవేళ పూరన్ దూకుడుగా ఆడుతూ ఉంటే నేను బౌలింగ్‌ చేయాలని భావించా. అలాంటి పోటీ నాకు చాలా ఇష్టం. ఇక నాలుగో టీ20లోనూ మాకు తీవ్ర పోటీ ఉంటుందని తెలుసు. మేం ఏడుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాలని అనుకున్నాం. ప్రతి ఒక్క బ్యాటర్ బాధ్యత తీసుకోవాలని ఇంతకుముందు మ్యాచ్‌ సందర్భంగా నిర్ణయించుకున్నాం. ఇప్పుడు అమలు చేయగలిగాం. సూర్య, తిలక్‌ వర్మ అద్భుతంగా ఆడారు. తిలక్‌ నిలకడగా ఆడుతున్నాడు. ఇక సూర్యకుమార్‌ కూడా ఫామ్‌లోకి రావడం.. బాధ్యతగా పరుగులు చేయడంతో సహచరులకు ఆదర్శంగా నిలిచాడు’’ అని పాండ్య తెలిపాడు. 

వ్యక్తిగతంగా నాకూ కీలకమే: సూర్య

‘‘ఈ మ్యాచ్‌లో రాణించడం జట్టుతోపాటు నాకూ వ్యక్తిగతంగా చాలా కీలకం. పవర్‌ప్లేలో బ్యాటింగ్‌కు వెళ్లడం వల్ల పరుగులు చేయడం మరింత సులువైంది. జట్టు మేనేజ్‌మెంట్ కూడా ఇదే కోరుకుంది. స్కూప్‌, ర్యాంప్ షాట్లను ప్రాక్టీస్‌ చేసేవాడిని. చాలా కాలంగా తిలక్‌వర్మతో కలిసి ఐపీఎల్‌లో బ్యాటింగ్‌ చేశా. దాంతో నాకూ ఆత్మవిశ్వాసం పెరిగింది. వరుసగా మూడు టీ20లను భారత్‌ ఓడిపోకూడదని ఇన్నింగ్స్‌ ఆసాంతం అనుకుంటూనే ఉన్నా. జట్టు సమావేశాల్లోనూ కెప్టెన్ పాండ్య కూడా మ్యాచ్‌ను గెలిపించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించాడు’’ అని సూర్య తెలిపాడు. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సూర్య ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. 


మ్యాచ్‌కు సంబంధించి మరికొన్ని విశేషాలు

  • తొలి మూడు టీ20 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా తిలక్‌ వర్మ నిలిచాడు. విండీస్‌తో పొట్టి సిరీస్‌లో అరంగేట్రం చేసిన తిలక్‌ ఇప్పటి వరకు 139 పరుగులు చేశాడు. సూర్య కూడా తన తొలి మూడు మ్యాచుల్లో 139 పరుగులే చేశాడు. దీపక్‌ హుడా మాత్రం 172 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. 
  • విండీస్‌పై మూడో టీ20లో 83 పరుగులు చేసిన సూర్యకుమార్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు సాధించాడు. ఇది అతడి 51 టీ20ల కెరీర్‌లో 12వది కావడం విశేషం. దీంతో రోహిత్ శర్మను సమం చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డులతో ముందున్నాడు. అలాగే టీ20ల్లో వంద సిక్స్‌ల మార్క్‌ను సూర్య తాకాడు. రోహిత్ (188), విరాట్ కోహ్లీ (107) సిక్స్‌లతో ముందు వరుసలో ఉన్నారు.
  • మూడో టీ20లో కీలకమైన మూడు వికెట్లు తీసిన కుల్‌దీప్‌ యాదవ్.. తక్కువ మ్యాచుల్లోనే 50 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా మారాడు. భారత్‌ తరఫున తొలి బౌలర్‌గా కావడం విశేషం. అజంతా మెండిస్ (26 మ్యాచ్‌లు), మార్క్‌ ఐదెర్ (28 మ్యాచ్‌లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కుల్‌దీప్‌ తన 30వ టీ20 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. చాహల్‌ 34 టీ20ల్లో 50 వికెట్లు తీశాడు. 
  • టీ20ల్లో నికోలస్‌ పూరన్ అత్యధిక పరుగులు చేసిన రెండో విండీస్‌ బ్యాటర్‌గా అవతరించాడు. క్రిస్‌ గేల్‌ 1899 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. పూరన్ 1,614 పరుగులు సాధించాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని