T20 World Cup 2022 : బ్యాట్‌తో వీళ్లు.. బంతితో వాళ్లు దుమ్మురేపేశారు..!

ప్రతీ మ్యాచ్‌ ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ టోర్నీలో అటు బ్యాట్‌, ఇటు బంతితో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు పలువురు ఆటగాళ్లు.

Updated : 14 Nov 2022 12:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  పొట్టి ప్రపంచకప్‌ ముగిసింది. ఫైనల్‌ పోరులో.. చిన్న లక్ష్యాన్ని కాపాడుకోవడానికి పాక్‌ చేసిన ప్రయత్నం.. అంతకుమించి ఇంగ్లాండ్‌ అద్వితీయమైన ప్రదర్శన అభిమానులకు అసలు సిసలైన క్రికెట్‌ మజాను అందించింది. ప్రతీ మ్యాచ్‌ ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ టోర్నీలో పలువురు ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన టాప్‌ 5 ఆటగాళ్ల వివరాలు తెలుసుకుందామా..

బ్యాటింగ్‌ వీరులు వీరే..

విరాట్‌ కోహ్లీ : ఈ పరుగుల యంత్రం బ్యాటింగ్‌ చేస్తుంటే ప్రత్యర్థి ఆటగాళ్లైనా అలా చూస్తూ ఉండాల్సిందే. సెమీస్‌లో టీమ్‌ఇండియా టోర్నీ నుంచి నిష్క్రమించినా.. తనదైన ఆటతో కోహ్లీ ఆకట్టుకుని ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. 296 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు అర్థ శతకాలు ఉండగా.. సగటు 98.66గా ఉంది. ఇక  తొలి మ్యాచ్‌లో పాక్‌పై విరాట్‌ గొప్ప ఇన్నింగ్స్‌.. ఎప్పటికీ ప్రత్యేకమే.

 మ్యాక్స్‌ ఓడౌడ్ : క్వాలిఫయర్‌ మ్యాచ్‌లతో కలిపి ఈ నెదర్లాండ్స్‌ బ్యాట్స్‌మన్‌ బాదిన పరుగులు 242. మొత్తం 8 మ్యాచ్‌ల్లో వీటిని సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.

 సూర్యకుమార్‌ యాదవ్‌ : బౌలర్‌ ఎంతటి వాడైనా.. పరిస్థితులు ఎలా ఉన్నా.. బంతిని బౌండరీకి పంపిచడం ఒకటే ఈ ఆటగాడికి తెలుసు. ముద్దుగా మిస్టర్‌ 360 అని పిలుచుకునే సూర్యకుమార్‌ యాదవ్‌.. ఈ టోర్నీకే హైలైట్‌ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన సూర్య 239 పరుగులు సాధించాడు. 189.6 స్ట్రైక్‌ రేట్‌తో వీరవిహారం చేశాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.

 జోస్‌ బట్లర్‌ : సెమీస్‌లో భారత్‌పై అదరగొట్టిన ఈ ఇంగ్లాండ్‌ కెప్టెన్‌.. రెండు అర్ధ శతకాలతో మొత్తం 225 పరుగులు సాధించాడు.

 కుశాల్‌ మెండిస్‌ : ఈ శ్రీలంక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 8 మ్యాచ్‌ల్లో మొత్తం 223 పరుగులు సాధించాడు.

వికెట్ల ధీరులు వీరే..

 హసరంగా : శ్రీలంక లెగ్‌ స్పిన్నర్‌ హసరంగా ఈ టోర్నీలో అత్యధికంగా 15 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 8 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

 సామ్‌ కరన్‌ : ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన ఈ ఇంగ్లాండ్‌ హీరో.. మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. పాక్‌పై ఫైనల్లో మూడు వికెట్లు తీసి.. ఇంగ్లాండ్‌ విజేతగా నిలవడంతో కీలకంగా వ్యవహరించాడు.

 బాస్ డి లీడె : నెదర్లాండ్స్‌ గ్రూప్‌ స్టేజ్‌కు చేరడానికి ఇతడి ప్రదర్శనే కారణం. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు.

 బ్లెస్సింగ్‌ ముజర్బానీ : ఈ జింబాబ్వే పేసర్‌ మొత్తం 8 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.

 నోకియా : ఐదు మ్యాచ్‌ల్లో ఈ దక్షిణాఫ్రికా పేసర్‌.. మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని