MK Stalin: శెభాష్‌ గుకేశ్‌.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్‌

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో నెగ్గి సంచలనం సృష్టించిన తెలుగు కుర్రాడు గుకేశ్‌ను తమిళనాడు సీఎం స్టాలిన్‌ భారీ నగదు ప్రోత్సాహకంతో సన్మానించారు.

Updated : 28 Apr 2024 19:41 IST

చెన్నై: ఇటీవల కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టైటిల్‌ నెగ్గి సంచలనం సృష్టించిన దొమ్మరాజు గుకేశ్ (Gukesh)ను తమిళనాడు సీఎం స్టాలిన్‌ (MK Stalin) అభినందించారు. 17 ఏళ్ల ఈ యువ గ్రాండ్‌ మాస్టర్‌కు రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేశారు. ఆదివారం గుకేశ్‌ తన తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా అతడి అద్భుత ప్రదర్శనను సీఎం కొనియాడారు. జ్ఞాపికను అందజేసి శాలువాతో సన్మానించారు. తమిళనాడు క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్‌కు కారణమిదే!

అంతకముందు క్యాండిడేట్స్‌ టోర్న్‌మెంట్‌లో శిక్షణ పొందేందుకు తమిళనాడు ప్రభుత్వం తెలుగు మూలాలు ఉన్న ఈ కుర్రాడికి రూ.15 లక్షలు మంజూరు చేసింది. తనను ప్రోత్సహించి మద్దతు తెలిపిన ప్రభుత్వానికి గుకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. యువత తమకు నచ్చిన క్రీడను అభ్యసించడం దినచర్యగా మార్చుకోవాలని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ కోరారు. ఈ అలవాటు తమను తాము ఫిట్‌గా ఉంచుకొనేందుకు ఎంతగానో సహాయపడుతుందని పేర్కొన్నారు.

టోరంటోలో ఇటీవల జరిగిన క్యాండిడేట్స్‌ టోర్నీలో డి.గుకేశ్‌ విజేతగా నిలిచి పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 14వ రౌండ్‌లో అమెరికాకు చెందిన హికరు నకమురతో గేమ్‌ను డ్రాగా ముగించి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ప్రపంచ టైటిల్‌ కోసం చైనాకు చెందిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డింగ్ లిరెన్‌తో తలపడనున్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన రెండో భారతీయుడు గుకేశే కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని