Team India: పేస్‌ అంటే ఎందుకో ఈ బెంబేలు!

గతంలో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్లన్నిటికీ ఇలాంటి అనుభవాలే ఉన్నాయి. కానీ ఎంతో రాటుదేలి..ఒకప్పటి కంటే ఎంతో మెరుగైన వసతులు, శిక్షణ ఉన్న ఈ రోజుల్లో కూడా టీమ్‌ఇండియా ఆట ఏమాత్రం మారలేదనడానికి సెంచూరియన్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ కుప్పకూలిన విధానమే ఉదాహరణ.

Updated : 29 Dec 2023 23:05 IST

1996లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది భారత్‌.. అలెన్‌ డొనాల్డ్‌ సారథ్యంలో సఫారీ పేస్‌ బౌలింగ్‌ను తట్టుకోలేక విలవిల్లాడిపోయింది. ఒక మ్యాచ్‌లో అయితే 66 పరుగులకే ఆలౌటైపోయింది. ఈ సిరీస్‌ జరిగి పాతికేళ్లు పైనే అవుతోంది. ఆ తర్వాత భారత్‌ ఎంతో మారిపోయింది. అప్పటి ఆటగాళ్లూ లేరు.. పరిస్థితులు కూడా లేవు. కానీ సెంచూరియన్‌ తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఆట చూస్తే కాలం ఉన్నట్టుండి పాతికేళ్లు వెనక్కి వెళ్లిందా అనిపించింది. అదే ఆట.. అదే వ్యథ! పేస్‌ అంటే బెంబేలు! బౌన్స్‌ అంటే కంగారూ! ఎందుకంటే అది దక్షిణాఫ్రికా గడ్డ కాబట్టి!

ఆ తపనే లేదు

గతంలో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్లన్నిటికీ ఇలాంటి అనుభవాలే ఉన్నాయి. కానీ ఎంతో రాటుదేలి..ఒకప్పటి కంటే ఎంతో మెరుగైన వసతులు, శిక్షణ ఉన్న ఈ రోజుల్లో కూడా టీమ్‌ఇండియా ఆట ఏమాత్రం మారలేదనడానికి సెంచూరియన్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ కుప్పకూలిన విధానమే ఉదాహరణ. బంతి సర్రున లేస్తుంది.. స్వింగ్‌ అవుతోంది.. అస్థిర బౌన్స్‌తో ఇబ్బంది పెడతోంది! అయితేనేం శ్రీలంక లాంటి ఉపఖండ జట్లు చూపించిన తెగువను కూడా మన స్టార్లు చూపించకపోతే ఎలా! విపరీతమైన టీ20 ప్రభావం వల్ల క్రీజులో నిలవాలన్న తపన తగ్గిపోయింది. దూకుడుగా ఆడి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాలన్న ఆటిట్యూడ్‌ పెరిగింది. ఈ తత్వమే రాగానే షాట్లకు పురిగొల్పుతోంది. బౌలర్లకు అవకాశం కల్పిస్తోంది. పుజారా, అజింక్య రహానె లాంటి బ్యాటర్లకు మిగిలిన బ్యాటర్లకు తేడా ఇక్కడే కనబడుతుంది. గొప్ప టెక్నిక్‌తో పేస్‌కు నిలిచి.. బంతి పాతబడ్డాక నెమ్మదిగా షాట్లు ఆడి స్కోరు పెంచేవాళ్లు వాళ్లిద్దరు. కానీ బంతి తళతళలాడుతుండగానే దూకుడు ప్రదర్శిస్తే అసలుకే మోసం వస్తుందని శ్రేయస్‌ అయ్యర్, యశస్వి జైస్వాల్‌ లాంటి కుర్రాళ్లు తెలుసుకునేదెప్పుడో. ఈ సూత్రాన్నే పాటించి విరాట్‌ కోహ్లి తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో నిలవగలిగాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడగలిగాడు. బర్గర్, జాన్సన్, రబాడ విజృంభిస్తున్నా బ్యాక్‌ఫుట్‌పై నిలిచి కట్, డ్రైవ్‌ షాట్లతో పరుగులు రాబట్టాడు. బంతి ఎక్కువ ఎత్తులో వెళ్తుండడంతో పుల్‌  షాట్లను ఆడలేదు.

ఇలా అయితే కష్టమే

దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ విజయం! సుదీర్ఘ కాలంగా భారత్‌ కల ఇది. ఎనిమిదిసార్లు ఇక్కడ పర్యటించినా సిరీస్‌ విజయం మాత్రం అందని ద్రాక్షగానే మారింది. గత సిరీస్‌ల అనుభవాలు, యువ రక్తం దూకుడుతో ఈసారి ఫలితం మారుతుందని అనుకున్నా.. తొలి టెస్టులోనే పాతికేళ్లు వెనక్కి పోయింది భారత్‌. అప్పటి ఆటను గుర్తుకు తెస్తూ పేస్‌కు దాసోహం అంది. నిజానికి దక్షిణాఫ్రికా లాంటి కీలక పర్యటనకు టీమ్‌ఇండియా పెద్దగా హోమ్‌ వర్క్‌ చేయలేదు. ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడేసి సఫారీ గడ్డపై అడుగుపెట్టేసింది. కానీ కుర్రాళ్లకు రెడ్‌ బాల్‌ ఫార్మాట్‌లో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండాపోయింది. ముఖ్యంగా పెద్దగా అనుభవం లేని శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, యశస్వి జైస్వాల్‌లకు సఫారీ పేస్‌ కొరుకుడు పడట్లేదు. పిచ్‌పై పడి సర్రున లేచే బంతిని ఆడాలంటే ఉండాల్సిన ఆ ఏకాగ్రత, తెగువ, సంయమనం కుర్రాళ్లలో కనబడట్లేదు. తొలి టెస్టులో ఘోర ఓటమి నేపథ్యంలో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ గెలవదని తేలిపోయింది. ఇక మిగిలింది కేప్‌టౌన్‌లో రెండో టెస్టు. భారత్‌ పరువు నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రాణించక తప్పదు. కానీ అంత ఈజీ కాదు. పేస్‌కు సలాం కొట్టే కేప్‌టౌన్‌లో మన ముద్ర వేయాలంటే సెంచూరియన్‌లో లోపాలను సరిదిద్దుకోవాలి. ముందు క్రీజులో నిలుచునే ప్రయత్నం చేయాలి. టీ20 మోడ్‌ని వదిలి టెస్టు ఫార్మాట్లోకి వచ్చేయాలి. అప్పుడే కనీసం డ్రా చేసుకునే అవకాశాలు ఉంటాయి. లేదంటే మరో ఓటమి తప్పదు.
                 -ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని