ODI WC 2023: సెలెక్టర్ల దృష్టిలో తిలక్‌ తప్పక ఉంటాడు: రాబిన్ ఉతప్ప

అరంగేట్రం చేసిన తొలి సిరీస్‌లోనే అదరగొట్టేసిన తిలక్‌ వర్మ (Tilak Varma) పేరు ఇప్పుడందరి నోటా మారుమోగుతోంది. భారత జట్టులో నాలుగో స్థానంలో అతడు సరిగ్గా సరిపోతాడనే వాదనా తెరమీదకొచ్చింది.

Published : 14 Aug 2023 14:44 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌ పర్యటనలో (WI vs IND) అరంగేట్రం చేసి అదరగొట్టేసిన భారత యువ బ్యాటర్ తిలక్‌ వర్మ ఆటతీరుపై అందరిలోనూ చర్చ మొదలైంది. భవిష్యత్తులో కీలక ప్లేయర్‌గా ఎదుగుతాడని ప్రశంసలు కురిపించారు. తాజాగా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా అభినందిస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే వన్డే ప్రపంచకప్‌ కోసం నాలుగో స్థానంలో ఆడే ఆటగాడి కోసం సెలెక్టర్ల దృష్టి తప్పకుండా తిలక్‌ వర్మపై ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాడు. 

నాలుగులో నిలబడేదెవరు ... యువీ వారసుడి కోసం కొనసాగుతున్న వేట

‘‘సుదీర్ఘకాలం జట్టు కోసం ఆడించాలనే భావన సెలెక్టర్లకు ఉంటే యువ క్రికెటర్లపై దృష్టిసారించాలి. పరిస్థితులకు తగ్గట్టుగా జట్టు కోసం ఆడేవారిని పరిగణనలోకి తీసుకోవాలి. అందులో తొలుత తిలక్‌ వర్మ గురించి తప్పకుండా చర్చిస్తారని భావిస్తున్నా. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ వైవిధ్యం చూపిస్తున్నాడు. విండీస్‌తో చివరి టీ20 మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి ఒక వికెట్‌ కూడా తీశాడు. అంతేకాకుండా ఎడమచేతివాటం బ్యాటర్‌ కావడం కూడా కలిసి రావచ్చు’’ అని ఉతప్ప వ్యాఖ్యానించాడు. 


హార్దిక్‌.. ఇదేం ఆట?: జాఫర్

కీలకమైన ఐదో టీ20 మ్యాచ్‌లో దారుణ ప్రదర్శనతో కెప్టెన్ హార్దిక్‌ పాండ్య బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన సంగతి తెలిసిందే. హార్దిక్‌ ఆడిన తీరే ఆందోళన కలిగించేలా ఉందని మాజీ క్రికెటర్ వసీమ్‌ జాఫర్‌ వ్యాఖ్యానించాడు. ‘‘ హార్దిక్‌ పాండ్య అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తోంది. క్రీజ్‌లోనూ స్వేచ్ఛగా ఉండలేకపోయాడు. సిక్స్‌లు కొట్టాల్సిన అవసరం లేదు కానీ కనీసం స్ట్రైక్‌ను రొటేట్‌ చేస్తే బాగుండేది. విండీస్‌తో మూడో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడి తర్వాత భారీ షాట్లతో చెలరేగాడు. కీలకమైన ఐదో టీ20లోనూ ఇదే ఆటతీరును ప్రదర్శించాల్సింది. ఆసియా, వన్డే ప్రపంచకప్‌లో మిడిలార్డర్‌లో పరుగులు చేయాల్సిన బాధ్యత హార్దిక్‌పై ఉంటుంది’’ అని జాఫర్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని