GUJARAT vs DELHI : టీ20 మెగా టోర్నీలో గుజరాత్ జోరు.. వరుసగా రెండో విజయం..

టీ20 మెగా టోర్నీలో గుజరాత్ జోరు కొనసాగుతోంది. దిల్లీతో జరిగిన మ్యాచులో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Published : 02 Apr 2022 23:32 IST

 

ఇంటర్నెట్ డెస్క్‌ : టీ20 మెగా టోర్నీలో గుజరాత్ జోరు కొనసాగుతోంది. దిల్లీతో జరిగిన మ్యాచులో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛేదనకు దిగిన దిల్లీ.. గుజరాత్ బౌలర్ల ధాటికి 157/9 స్కోరుకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 171/6 స్కోరు చేసిన విషయం తెలిసిందే. దిల్లీ బ్యాటర్లలో కెప్టెన్‌ రిషభ్‌ పంత్ (43 : 29 బంతుల్లో 7×4), లలిత్ యాదవ్‌ (25), మన్ దీప్‌ సింగ్‌ (18), పృథ్వీ షా (10) పరుగులు చేశారు. టిమ్‌ సీఫర్ట్‌ (3), అక్షర్ పటేల్‌ (8), శార్దూల్ ఠాకూర్‌ (2) నిరాశపర్చారు. ఖలీల్ అహ్మద్‌ (0) డకౌటయ్యాడు. కుల్దీప్ యాదవ్‌ (14), ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ (3) నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్‌ నాలుగు, మహమ్మద్‌ షమి రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ ఖాన్‌, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్‌ పడగొట్టారు.


స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు డౌన్‌..

దిల్లీ బ్యాటర్లు నిలకడగా ఆడుతూ లక్ష్యం దిశగా సాగుతున్నారు. హార్దిక్‌ పాండ్య వేసిన 11వ ఓవర్లో  ఏడే పరుగులు ఇచ్చాడు. విజయ్‌ శంకర్‌ వేసిన ఆ తర్వాత రిషభ్ పంత్‌ రెండు, రోమన్ పావెల్ (13) ఓ ఫోర్‌ బాదాడు. ఈ ఓవర్లోనే నాలుగో బంతికి లలిత్‌ యాదవ్‌ (25) రనౌటయ్యాడు. 13వ ఓవర్లో రషీద్‌ ఖాన్‌ ఐదు పరుగులు ఇచ్చాడు. రాహుల్ తెవాటియా వేసిన 14వ ఓవర్లో తొలి బంతిని రిషభ్‌ పంత్ బౌండరీకి తరలించగా.. మూడో బంతిని రోమన్ పావెల్‌ సిక్స్‌గా మలిచాడు. లాకీ ఫెర్గూసన్‌ వేసిన 15వ ఓవర్లో తొలి బంతికి రిషభ్‌ పంత్‌ (43).. అభినవ్‌ మనోహర్‌కి చిక్కి క్రీజు వీడాడు. మూడో బంతిని అక్షర్‌ పటేల్‌ (4) బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతికే అక్షర్‌ కీపర్‌కి చిక్కాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ ఆరు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. దిల్లీ విజయానికి ఇంకా 46 పరుగుల దూరంలో ఉంది. 


నిలకడగా దిల్లీ బ్యాటింగ్‌..

పవర్‌ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో దిల్లీ బ్యాటర్లు వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడుతున్నారు. లాకీ ఫెర్గూసన్‌ వేసిన ఏడో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన రిషభ్ పంత్‌ (24).. రషీద్‌ ఖాన్‌ వేసిన తర్వాతి ఓవర్లో తొలి బంతిని కూడా బౌండరీకి తరలించాడు. వరుణ్‌ ఆరోన్ వేసిన తొమ్మిదో ఓవర్లో నాలుగో బంతిని పంత్ బౌండరీకి తరలించాడు. రషీద్ ఖాన్ వేసిన పదో ఓవర్లో రెండో బంతిని లలిత్‌ యాదవ్‌ (20) సిక్సర్‌గా మలిచాడు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ 79/3 స్కోరుతో నిలిచింది.


పవర్ ప్లే పూర్తి.. లాకీ ఫెర్గూసన్‌కి ఒకే ఓవర్లో రెండు వికెట్లు..

గుజరాత్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి దిల్లీని దెబ్బ తీశాడు. అతడు వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి పృథ్వీ షా (10).. విజయ్‌ శంకర్‌కి చిక్కగా, ఐదో బంతికి మన్ దీప్‌ (18).. మాథ్యూ వేడ్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. అంతకు ముందు నాలుగో ఓవర్లో హార్దిక్ పాండ్య 12 పరుగులు ఇచ్చాడు. మహమ్మద్‌ షమి వేసిన ఆరో ఓవర్లో లలిత్‌ యాదవ్‌ (8) రెండు ఫోర్లు బాదాడు. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (2) క్రీజులో ఉన్నాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి దిల్లీ మూడు వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది.


దిల్లీకి షాకిచ్చిన హార్దిక్‌ పాండ్య

ఛేదనకు దిగిన దిల్లీకి ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. హార్దిక్‌ పాండ్య వేసిన రెండో ఓవర్లో తొలి బంతికి ఓపెనర్‌ టిమ్‌ సీఫర్ట్‌ (3).. అభినవ్ మనోహర్‌కి చిక్కాడు. మూడో ఓవర్లో మన్‌దీప్‌ సింగ్‌ (10) రెండు ఫోర్లు బాదాడు. అంతకు ముందు మహమ్మద్‌ షమి వేసిన తొలి ఓవర్లో తొలి బంతిని పృథ్వీ షా (7) బౌండరీకి తరలించాడు. దీంతో మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ ఓ వికెట్‌ కోల్పోయి 20 పరుగులు చేసింది.


గుజరాత్‌ బ్యాటింగ్ పూర్తి..

గుజరాత్ బ్యాటింగ్‌ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దిల్లీ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (84 : 46 బంతుల్లో 6×4, 4×6) అర్ధ శతకంతో మెరిశాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (31) పరుగులు చేశాడు. రాహుల్ తెవాటియా (14), విజయ్‌ శంకర్‌ (13) పరుగులు చేయగా.. మాథ్యూ వేడ్‌ (1), అభినవ్‌ మనోహర్‌ (1) నిరాశ పర్చారు. డేవిడ్‌ మిల్లర్ (20), రషీద్‌ ఖాన్‌ (0) నాటౌట్‌గా నిలిచారు. దిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్‌ మూడు, ఖలీల్ అహ్మద్ రెండు, కుల్దీప్ యాదవ్‌ ఒక పడగొట్టారు.  


వేగం పెంచిన గుజరాత్‌ బ్యాటర్లు..

గుజరాత్ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (67) అర్ధ శతకం నమోదు చేశాడు. కుల్దీప్ యాదవ్‌ వేసిన 13వ ఓవర్లో తొలి బంతిని బౌండరీకి తరలించిన గిల్.. నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ మార్క్‌ను అందుకున్నాడు. మెగా టోర్నీలో గిల్‌కిద 11వ అర్ధ శతకం కావడం విశేషం. ఆ తర్వాత ఖలీల్ అహ్మద్‌ వేసిన 14వ ఓవర్లో గిల్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఆఖరు బంతికి కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (31) భారీ షాట్‌కి ప్రయత్నించి రోమన్ పావెల్‌కి చిక్కాడు. కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 15వ ఓవర్లో తొలి బంతిని శుభ్‌మన్‌ గిల్ సిక్స్‌గా మలిచాడు. ఆఖరు బంతిని డేవిడ్‌ మిల్లర్ (4) బౌండరీకి తరలించాడు.  అంతకు ముందు అక్షర్ పటేల్ వేసిన 11వ ఓవర్లో తొమ్మిది పరుగులు ఇవ్వగా.. శార్దూల్ ఠాకూర్ వేసిన 12వ ఓవర్లో పాండ్య, గిల్ చెరో ఫోర్‌ బాదారు. దీంతో 15 ఓవర్లకు గుజరాత్‌ 120/3 స్కోరుతో నిలిచింది.


కట్టుదిట్టంగా దిల్లీ బౌలింగ్‌..

దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. దీంతో గుజరాత్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు కష్టపడుతున్నారు. అక్షర్‌ పటేల్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో రెండు.. ఆ తర్వాతి ఓవర్లో కుల్దీప్‌ యాదవ్‌ ఐదు పరుగులు ఇచ్చారు. పదో ఓవర్లో ఖలీల్ అహ్మద్‌ 8 పరుగులు ఇచ్చాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ 66/2 స్కోరుతో నిలిచింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (14), శుభ్‌మన్ గిల్‌ (34) క్రీజులో ఉన్నారు.  


రెండో వికెట్‌ డౌన్‌..

ఏడు ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మూడో ఓవర్లో ఖలీల్ అహ్మద్‌ ఐదు పరుగులు.. ఆ తర్వాతి ఓవర్లో శార్ధూల్ ఠాకూర్‌ తొమ్మిది పరుగులు ఇచ్చారు. అక్షర్ పటేల్ వేసిన ఐదో ఓవర్లో రెండో బంతిని శుభ్‌మన్‌ గిల్‌ (28) సిక్సర్‌గా మలిచాడు. ఆరో ఓవర్లో ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ ఆరు పరుగులు ఇచ్చారు. ఏడో ఓవర్లో తొలి బంతికి విజయ్‌ శంకర్‌ (13) బౌల్డయ్యాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (5) క్రీజులోకి వచ్చాడు.  


గుజరాత్‌కి షాక్‌..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్‌ మ్యాథ్యూ వేడ్ (1) విఫలమయ్యాడు. ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో స్కూప్‌ షాట్ ఆడబోయి కీపర్‌ పంత్‌ చేతికి చిక్కాడు. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజ్‌లో శుభ్‌మన్‌ గిల్ (6*), విజయ్‌ శంకర్‌ (6*) ఉన్నారు.


టాస్‌ నెగ్గిన దిల్లీ..

డబుల్‌ బొనాంజాలో రెండో మ్యాచ్‌ గుజరాత్‌, దిల్లీ జట్ల మధ్య మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుని గుజరాత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. టీ20 లీగ్‌లో అత్యధిక సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయినే ఈ సారి తొలి మ్యాచ్‌లో దిల్లీ మట్టికరిపించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న దిల్లీని ఢీకొట్టేందుకు గుజరాత్‌ శాయశక్తులా ప్రయత్నించాలి. దిల్లీ బ్యాటింగ్‌లో పృథ్వీషా, రిషభ్‌ పంత్, రోమన్‌ పావెల్, టిమ్‌ సీఫర్ట్ కీలకంగా కాగా.. బౌలింగ్‌లో శార్ధూల్, ఖలీల్ అహ్మద్, అక్షర్‌, కుల్‌దీప్‌, నాగర్‌ కోటి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాగలరు. శార్ధూల్, అక్షర్‌ వంటి ఆల్‌రౌండర్లు ఉండటం దిల్లీకి కలిసొచ్చే అంశమే.

అదేవిధంగా హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని గుజరాత్‌కు గిల్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, వేడ్‌ వేగంగా పరుగులు చేసే బ్యాటర్లు ఉన్నారు. షమీ, లాకీ ఫెర్గూసన్, హార్దిక్‌, రషీద్‌ ఖాన్‌ వంటి టాప్‌ బౌలర్లు గుజరాత్ సొంతం. కెప్టెన్‌ హార్దిక్‌తో పాటు రషీద్‌ ఖాన్‌ బ్యాటింగ్‌ చేయడం గుజరాత్‌కు అదనపు బలం. సమష్టిగా రాణిస్తే దిల్లీపై గుజరాత్‌ పైచేయి సాధించే అవకాశం ఉంది.

జట్ల వివరాలు: 

దిల్లీ: పృథ్వీ షా, టిమ్‌ సీఫర్ట్‌, మన్‌దీప్‌ సింగ్, రిషభ్‌ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోమన్‌ పావెల్, శార్ధూల్ ఠాకూర్‌, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌

గుజరాత్‌: శుభ్‌మన్‌ గిల్‌, మ్యాథ్యూ వేడ్ (కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్‌, రషీద్‌ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్‌ ఆరోన్, షమీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని