Virat: విరాట్‌కు మళ్లీ టెస్టు కెప్టెన్సీ? మాజీ చీఫ్ సెలక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టు జట్టు కెప్టెన్‌గా విఫలమవుతుండటంతో అతడిని తొలగించాలనే డిమాండ్లూ వస్తున్నాయి. అతడి స్థానంలో మరొకరిని నియమించాలనే వాదనా ఉంది.

Updated : 11 Jul 2023 12:08 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా (Team India) టెస్టు జట్టు సారథ్య బాధ్యతలపై మళ్లీ చర్చ ఊపందుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final 2023) ఫైనల్‌లో వ్యక్తిగతంగానూ, జట్టును నడిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమయ్యాడనే విమర్శలు వచ్చాయి. అతడిని తప్పించి మరొకరిని కెప్టెన్‌గా నియమించాలనే డిమాండ్లూ వస్తున్న నేపథ్యంలో.. భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్కే ప్రసాద్ కీలక సూచనలు చేశాడు. రోహిత్ శర్మను తప్పిస్తే.. అతడి స్థానంలో మళ్లీ విరాట్ కోహ్లీకే (Virat Kohli) అవకాశం ఇవ్వాలని సూచించాడు. అలా చెప్పడానికి అజింక్య రహానెను ఉదాహరణగా చూపిస్తూ ఎంఎస్కే వివరించాడు. 

ఇదీ చదవండి.. విండీస్‌తో మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

‘‘విరాట్ కోహ్లీకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? అజింక్య రహానె జట్టులోకి తిరిగి వచ్చి వైస్ కెప్టెన్‌ అయ్యాడు. కాబట్టి విరాట్ కెప్టెన్సీ ఎందుకు చేపట్టకూడదు? అయితే, సారథ్యంపై విరాట్ కోహ్లీ ఏమన్నాకుంటున్నాడో తెలియదు. రోహిత్‌ను కాదని వేరేవారిని నియమించాలని సెలక్టర్లు భావిస్తే మాత్రం విరాట్ వైపు మొగ్గుచూపాలి. ఇక రిషభ్‌ పంత్ కూడా మంచి ఆప్షనే. కానీ, అతడు ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. వచ్చి కుదురుకోవాల్సిన అవసరం ఉంది.  ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ దేశాల్లో మరే ఇతర భారత వికెట్‌ కీపర్లు చేయని విధంగా పరుగులు సాధించాడు. అతడు మళ్లీ జట్టులోకి వచ్చాక పరిశీలించాలి’’ అని ప్రసాద్ తెలిపాడు. 

ప్రస్తుతం భారత్ విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరీస్‌లో రోహిత్ వ్యక్తిగతంగా రాణించకపోతే మాత్రం విమర్శలు మరింత తీవ్రమవుతాయి. టెస్టు కెప్టెన్సీ పోవడమే కాకుండా జట్టులో స్థానం కూడా గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని