WWC 2025 Final: కలల కప్పు..చిక్కేనా మూడోసారైనా?

Eenadu icon
By Sports News Team Published : 02 Nov 2025 00:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

పురుషుల క్రికెట్‌లోనైనా, మహిళల విభాగంలోనైనా వన్డే వరల్డ్ కప్‌నకు ఉండే క్రేజే వేరు. ఎన్ని సిరీస్‌ల్లో అద్భుత విజయాలు సాధించినా.. మరెన్నో ట్రోఫీలు సాధించినా నాలుగేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో ఒక్కసారైనా విశ్వవిజేతగా నిలిచి సగర్వంగా కాలర్ ఎగరేయాలని జట్లన్నీ తహతహలాడుతుంటాయి. కానీ, చివరకు ఒక్క టీమ్‌కే ఆ భాగ్యం దక్కుతుంది. ఇప్పుడు టీమ్ఇండియాకు ఆ అద్భుతమైన అవకాశం వచ్చింది.

నెలరోజులపాటు సాగిన మహిళల వన్డే ప్రపంచ కప్ (ICC Womens World Cup 2025) తుది అంకానికి చేరింది. ఆదివారం (నవంబర్ 2) ముంబయి వేదికగా టైటిల్ పోరులో భారత్, సౌతాఫ్రికా (INDw vs SAw) తలపడనున్నాయి. ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచ కప్ 12 సార్లు జరగ్గా.. ఆస్ట్రేలియా ఏడుసార్లు, ఇంగ్లాండ్ నాలుగుసార్లు, న్యూజిలాండ్ ఒకసారి విజేతగా నిలిచాయి. ఈ సారి ఆ జట్లేవీ ఫైనల్‌కు రాలేదు. కొత్త ఛాంపియన్‌గా నిలవడానికి భారత్, సౌతాఫ్రికా సై అంటే సై అంటున్నాయి. 2005, 2017లో విశ్వవిజేతగా నిలిచే అవకాశాన్ని మిస్ చేసుకున్న భారత్ (Team India).. మూడోసారి ఎలాగైనా టైటిల్‌ను ఎగరేసుపోవాలనే పట్టుదలతో ఉంది. సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చి ఫైనల్‌ చేరిన హర్మన్‌ప్రీత్‌ సేన.. అదే జోరును సఫారీలపై కొనసాగిస్తే కప్పు కల నెరవేరినట్లే.

ఆ వీక్‌నెస్‌ను సద్వినియోగం చేసుకుంటారా? 

లీగ్ దశలో ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి సెమీస్‌కు వచ్చిన సఫారీలు.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొకోకపోవడమే. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 69 పరుగులకు, ఆస్ట్రేలియాపై 97 రన్స్‌కే దక్షిణాఫ్రికా కుప్పకూలింది. సఫారీల స్పిన్‌ బలహీనతను ఫైనల్‌లో భారత్ సొమ్ము చేసుకోవాలి. భారత్‌కు దీప్తి శర్మ రూపంలో మంచి స్పిన్నర్ ఉంది. ఆమె ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టింది. ఫైనల్‌లోనూ దీప్తి మెరిస్తే భారత్‌కు గెలుపు ద్వారాలు తెరుచుకున్నట్లే. ఆస్ట్రేలియాతో సెమీస్‌లో భారీగా పరుగులు ఇచ్చిన రాధా యాదవ్‌పై వేటు వేసి మరో స్పిన్నర్ స్నేహ్ రాణాను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీలో ఆమె మెరుగైన ప్రదర్శనే చేసింది.

అప్పుడేమైంది? 

2005లో మిథాలి రాజ్‌ నేతృత్వంలో ఫైనల్‌కు వెళ్లిన భారత్.. కంగారూల జోరు ముందు నిలవలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ను 215/4కి కట్టడి చేసిన టీమ్ఇండియా.. లక్ష్యఛేదనలో తేలిపోయింది. అంజు జైన్ (29) టాప్‌స్కోరర్. ఆమెతో మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిథాలి రాజ్ (6) సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమైంది. దీంతో భారత్ 46 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. ఇక 2017లో మాత్రం భారత అమ్మాయిలు త్రుటిలో కప్పును మిస్ చేసుకున్నారు. సెమీస్‌లో బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి టైటిల్ సాధించేలా కనిపించిన భారత్.. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై పోరాడి ఓడింది. నాట్ సీవర్ (51), సారా టైలర్ (45) రాణించడంతో తొలుత ఇంగ్లిష్‌ జట్టు 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. జులన్ గోస్వామి (3/23), పూనమ్ యాదవ్ (2/36) మెరిశారు. 229 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 219 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పూనమ్ యాదవ్ (86), హర్మన్‌ప్రీత్ (51), వేద కృష్ణమూర్తి (35) పోరాటం వృథా అయింది. స్మృతి మంధాన డకౌటవడం, మిథాలి రాజ్ (17) నిరాశపర్చడం భారత్‌ విజయావకాశాలను దెబ్బతీసింది. ఇంగ్లాండ్ పేసర్ అన్య ష్రబ్సోల్ (6/46) భారత బ్యాటర్లను బుట్టలో వేసుకుంది. ఈ సారైనా భారత అమ్మాయిలు ఛాంపియన్‌గా నిలవాలని ఆశిద్దాం! 

- ఇంటర్నెట్ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు