FIFA: ఎప్పుడు ముందుండి నడిపించాలో తెలిసిన కెప్టెన్‌..!

1998 ప్రపంచకప్‌ను కెప్టెన్‌ జిదానే కేవలం తన హెడర్‌ షాట్లతోనే ఫ్రాన్స్‌కు అందించాడు. ఫైనల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు ఊపిరాడనీయలేదు.

Updated : 30 Nov 2022 11:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెప్టెన్‌గా ఎప్పుడు ముందుండి జట్టును నడిపించాలో ప్రపంచానికి చూపించాడు ఫ్రాన్స్‌ ఆటగాడు జినెడిన్‌ జిదానే. 1998 ప్రపంచకప్‌ టోర్నీకి ఫ్రాన్స్‌ ఆతిథ్యం ఇచ్చింది. అప్పటికే ఈ టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన ఉరుగ్వే, ఇటలీ, ఇంగ్లాండ్‌, వెస్ట్‌ జర్మనీ, అర్జెంటీనా జట్లు సొంతగడ్డపై ఛాంపియన్లుగా అవతరించాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా కప్‌ను ఒడిసిపట్టాలని ఫ్రాన్స్‌ ఆటగాళ్లు నిర్ణయించుకొన్నారు. లీగ్ దశ నుంచి ఫైనల్స్‌ వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి అనేదే లేకుండా ముందుకు సాగారు. కెప్టెన్‌ జిదానే జట్టును సమన్వయం చేసుకొంటూ విజయపథంలో నడిపించాడు. అయితే.. టోర్నీలో అతడు అప్పటి వరకు ఒక్కగోల్‌ కూడా ( క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఇటలీపై పెనాల్టీ షూట్‌లో మినహా) చేయకపోవడం గమనార్హం.

ఇక మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బ్రెజిల్‌ కూడా ఫైనల్స్‌ చేరుకొంది. బెబెటో, రొనాల్డో, రివాల్డో, కాఫు, కార్లోస్‌, లియోనార్డో వంటి స్టార్‌ ఆటగాళ్లతో ఆ జట్టు బలంగా ఉంది. 1994 ప్రపంచ విజేత కూడా. రొనాల్డో అప్పటికే టోర్నీలో 4 గోల్స్‌ చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఫ్రాన్స్‌ తరఫున లిలియాన్‌ మాత్రమే ఆ టోర్నీలో అప్పటి వరకు జట్టులో అత్యధికంగా రెండు గోల్స్‌ చేశాడు. కాకపోతే జట్టులో దాదాపు  ఏడుగురు ఆటగాళ్లు కనీసం ఒక్క గోలైనా చేశారు. అంటే సమష్టిగా రాణిస్తున్నారని అర్థం.

ఇక ఫైనల్‌లో దిగ్గజ బ్రెజిల్‌ను ఢీకొనేందుకు ఫ్రాన్స్‌ జట్టును జిదానే ముందుండి నడిపించాడు. తమ గోల్‌పోస్ట్‌ను ఫ్రాన్స్‌ ఆటగాళ్లు డిఫెన్స్‌తో దుర్బేధ్యంగా మార్చేశారు. బ్రెజిల్‌ స్ట్రైకర్లు చేసిన దాడులను తిప్పికొట్టారు. మ్యాచ్‌ 27వ నిమిషంలో ఫ్రాన్స్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. అద్భుతమైన హెడర్‌ షాట్‌తో దానిని జిదానే గోల్‌గా మలిచాడు. మ్యాచ్‌ తొలి అర్ధభాగం ముగియడానికి నిమిషం ముందు ఫ్రాన్స్‌కు మరో పెనాల్టీ కార్నర్‌ లభించింది. ఫ్రాన్స్‌ ఆటగాడు యారీ రఫీ జోర్కేఫ్‌ కొట్టిన షాట్‌ను మళ్లీ జిదానే తన హెడర్‌తో గోల్‌గా మలిచాడు. ఈ మ్యాచ్‌లో జిదానే చేసిన రెండు గోల్స్‌ హెడర్‌ షాట్లతో రావడం విశేషం. ఆ తర్వాత బ్రెజిల్‌ ఏ దశలోనూ ఫ్రాన్స్‌ రక్షణ వలయాన్ని ఛేదించలేకపోయింది. మ్యాచ్‌ చివరి నిమిషంలో లిలియాన్‌ మరో గోల్‌ చేయడంతో ఫ్రాన్స్ విజయం సంపూర్ణమైంది. స్టార్లతో నిండిన బ్రెజిల్‌ ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని