Google: ఆన్‌లైన్‌ మోసాలకు గూగుల్‌ తాళాలు

Eenadu icon
By Technology News Team Published : 22 Oct 2025 04:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

న్‌లైన్‌ మోసాలు రోజురోజుకీ పెరుగుతూ పెరుగుతూ వస్తున్నాయి. నిత్య వ్యవహారాలుగా మారాయి. గత సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 60% మంది వీటిని ఎదుర్కొన్నారని అంచనా. ఒకప్పుడు వ్యాకరణ దోషాలు, విచిత్ర అటాచ్‌మెంట్ల ఆధారంగా అవి ఫిషింగ్‌ మెయిళ్లు కావొచ్చని అనుమానించేవాళ్లం. ఇప్పుడు వాయిస్‌ క్లోనింగ్, డీప్‌ఫేక్స్‌ వంటి ఉపాయాలతోనూ మోసగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. అందువల్ల అనుక్షణం భద్రంగా ఉండటం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో మోసాలకు గురికాకుండా చూడటానికి ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం గూగుల్‌ కొత్త భద్రతా ఫీచర్లను తీసుకొచ్చింది. అలాగే గూగుల్‌ ఖాతాలను తిరిగి పొందటానికి తేలికైన మార్గాలను కూడా పరిచయం చేసింది. 

మెసేజెస్‌లో కీ వెరిఫయర్‌

కొత్త కీ వెరిఫయర్‌ టూల్‌ వ్యక్తిగత చర్చలకు మరింత భద్రత కల్పిస్తుంది. ఇది మోసగాళ్లు, అధికారిక వ్యక్తులమని నమ్మించేవారి నుంచి కాపాడుతుంది. పేరకు తగ్గట్టుగానే కాంటాక్టు ఐడెంటిటీని గుర్తించటానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. మోసగాళ్లు తరచూ ఇతర వ్యక్తులమని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. మనకు తెలిసిన వాళ్ల మాదిరిగానూ వ్యవహరించొచ్చు. ఒకవేళ తెలిసినవారి ఫోన్‌ పోయినా, సిమ్‌ స్వాప్‌ అయినా ఆ విషయం మనకు తెలియకపోవచ్చు. ఇలాంటి సమయంలో కీ వెరిఫయర్‌ సదుపాయం రక్షణగా నిలుస్తుంది. ఇది సంబంధిత క్యూఆర్‌ కోడ్స్‌ను స్కాన్‌ చేయటం ద్వారా కీస్‌ను ధ్రువీకరించి, విశ్వసనీయ వ్యక్తులను గుర్తించేలా చేస్తుంది. మీరు కాంటాక్టుల క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, అవతలి వారినీ అలాగే చేయమని కోరొచ్చు. దీంతో అవతలివారు సరైన వ్యక్తులేనని గుర్తించటానికి వీలవుతుంది. మీ కాంటాక్ట్‌లు పరికరాన్ని, సిమ్‌ కార్డ్‌ను మార్చినా.. కీ కాల పరిమితి దాటినా కీస్‌ కూడా మారతాయి. ఆండ్రాయిడ్‌ 10, ఆ పైన పరికరాలన్నింటీ ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది. 


మెసేజెస్‌లో సురక్షిత లింకులు

మోసగాళ్లు తరచూ హానికర లింకులను టెక్స్ట్‌ మెసేజ్‌లను వాడుకుంటుంటారు. గూగుల్‌ మెసేజెస్‌ దీనికి అడ్డుకట్ట వేయటానికి ఇప్పుడు కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మెసేజ్‌లో మోస పూరిత లింక్‌ ఉన్నట్టు అనుమానిస్తే దాన్ని అడ్డుకుంటుంది. ‘లింక్‌ బ్లాక్డ్‌’ అనే పాపప్‌తో హెచ్చరిస్తుంది. ‘దిస్‌ మెసేజ్‌ వాజ్‌ ఫ్లాగ్డ్‌ యాజ్‌ లైక్‌లీ స్పామ్‌’ అని అప్రమత్తం చేస్తుంది. క్లోజ్‌ మీద క్లిక్‌ చేసి భద్రంగా ఉండొచ్చు. ఒకవేళ మెసేజ్‌ను పొరపాటున మోసపూరితమైనదని భావించినట్టు అనిపిస్తే ‘నాట్‌ స్పామ్‌’ తాకితే లింక్‌ ఓపెన్‌ అవుతుంది. గూగుల్‌ మెసేజ్‌స్‌ యూజర్లందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. 


రికవరీ కాంటాక్ట్స్‌

ర్హులైన వ్యక్తిగత గూగుల్‌ ఖాతాదారులకు రికవరీ కాంటాక్ట్స్‌ టూల్‌ అందుబాబులోకి వచ్చింది. దీని ద్వారా విశ్వసనీయమైన స్నేహితులు, కుటుంబసభ్యులను రికవరీ కాంటాక్ట్స్‌గా నిర్ణయించుకోవచ్చు. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం, పాస్‌కీ పరికరం పోవటం, అకౌంట్‌లోకి ఎవరైనా చొరబడటం వంటి సందర్భాల్లో మీ గుర్తింపును ధ్రువీకరించుకోవటానికి ఈ కాంటాక్ట్స్‌ తోడ్పడతాయి. ప్రామాణిక రికవరీ విధానాలు విఫలమైనప్పుడు వీటితో తేలికగా ఖాతాను తిరిగి యాక్సెస్‌ చేయొచ్చు. మీ గూగుల్‌ ఖాతాలో సెక్యూరిటీ విభాగం కింద రికవరీ కాంటాక్ట్స్‌ ఫీచర్‌ ఉంటుంది. 


మొబైల్‌ నంబరుతో రీగెయిన్‌

ఫోన్‌ ఎక్కడో పోవచ్చు, ఎవరో కొట్టేయొచ్చు. లేదా పగిలిపోవచ్చు. ఇలాంటి సమయాల్లో గూగుల్‌ ఖాతాను యాక్సెస్‌ చేయటం పెద్ద తలనొప్పి వ్యవహారంగా తయారవుతుంది. అందుకే కొత్త పరికరంలో ఖాతాను రికవరీ చేయటానికి మొబైల్‌ నంబరుతో గూగుల్‌కు సైన్‌ ఇన్‌ అయ్యే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది ఫోన్‌ నంబరుతో మీ ఖాతాలను ఆటేమేటిగ్గా గుర్తిస్తుంది. ధ్రువీకరణ కోసం పాత పరికరం లాక్‌ స్క్రీన్‌ పాస్‌కోడ్‌ను ఎంటర్‌ చేస్తే చాలు. ఎలాంటి పాస్‌వర్డ్‌లు అవసరం లేదు. ఈ ఫీచర్‌ను విడతల వారీగా అమలు చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు