Arattai: అరట్టై.. అదరహో!

Eenadu icon
By Technology News Desk Published : 08 Oct 2025 03:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌ అరట్టై అదరగొడుతోంది. యాప్‌ స్టోర్, గూగుల్‌ ప్లే రెండింటిలోనూ దీనికి బాగా ఆదరణ లభిస్తోంది. మెసేజింగ్‌ యాప్‌ అనగానే గుర్తొచ్చే వాట్సాప్‌కే గట్టిపోటీ ఇస్తోంది. జోహో సంస్థ రూపొందించిన ఇది మెసేజ్‌లు, వాయిస్‌ నోట్స్‌ పంపటానికి.. వాయిస్, వీడియో కాల్స్‌ చేసుకోవటానికి.. మీటింగుల్లో పాల్గొనటానికి.. స్టోరీస్, ఫొటోస్, డాక్యుమెంట్స్‌ షేర్‌ చేసుకోవటానికి ఉపయోగపడుతోంది. క్లీన్‌ ఇంటర్ఫేస్, పలు ఫీచర్లు, గోప్యత మీద దృష్టి పెట్టటం వంటి వాటితో మంచి ప్రత్యామ్నాయ వేదికగా పేరు తెచ్చుకుంటోంది. 

అరట్టై అంటే తమిళంలో పిచ్చాపాటీ సంభాషణ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇది సరళమైన ఇష్టాగోష్ఠులకు వీలు కల్పిస్తుంది. మెసేజింగ్‌ అనుభూతిని మెరుగు పరచటానికి ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉండటం గమనార్హం.

పాకెట్‌: ఇది పర్సనల్‌ క్లౌడ్‌ స్టోరేజీ. మెసేజ్‌లు, మీడియా, నోట్స్‌ వంటి వాటిని మున్ముందు ఉటంకించటానికి.. వేర్వేరు పరికరాల మీద యాక్సెస్‌ చేసుకోవటానికిది వీలు కల్పిస్తుంది. వాట్సప్‌లో ముఖ్యమైన మెసేజ్‌లను స్టోర్‌ చేసుకోవటానికి పర్సనల్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అరట్టైలోని పాకెట్‌ ఈ ప్రక్రియను చాలా సులభం చేసేసింది. కంటెంట్‌ను ఒక క్రమ పద్ధతిలో స్టోర్‌ చేస్తుంది. 
మీటింగ్స్‌: అరట్టై యాప్‌లోంచి నేరుగా మీటింగులను క్రియేట్‌ చేయొచ్చు, అవసరమైనవారిని జాయిన్‌ చేయొచ్చు. మీటింగ్‌ సమయాన్నీ నిర్దేశించుకోవచ్చు. జూమ్, గూగుల్‌ మీట్‌ వంటి ఇతర వేదికలేవీ అవసరం లేదు. తెర అడుగున ఉండే మీటింగ్‌ ఆప్షన్‌ను తేలికగా వాడుకోవచ్చు.

మెన్షన్స్‌ ప్రత్యేకం:  చాట్స్‌లో ఎవరినైనా ప్రత్యేకంగా ఉద్దేశించి మెసేజ్‌లు పెడితే అవన్నీ మెన్షన్స్‌లో చేరిపోతాయి కూడా. వీటిని ఎప్పుడంటే అప్పుడు తేలికగా చూసుకోవచ్చు. ఇతర మెసేజ్‌ల మధ్య కనిపించకుండా దాక్కునే ముఖ్యమైన మెసేజ్‌లను మరవకుండా ఉండటానికిది తోడ్పడుతుంది. 

గ్రూప్స్‌: వాట్సప్‌లో మాదిరిగానే అరట్టైలోనూ గ్రూప్స్‌ సృష్టించుకోవచ్చు. ఒక్కో గ్రూపులో వెయ్యి మంది వరకూ ఉండొచ్చు. 

లో బ్యాండ్‌విడ్త్‌ ఆప్టిమైజేషన్‌: ఇంటర్‌నెట్‌ వేగం నెమ్మదిగా ఉన్నా పనిచేయటం అరట్టై ప్రత్యేకత. అలాగే లో-ఎండ్‌ స్మార్ట్‌ఫోన్లకూ అనువుగా రూపొందించారు. అంటే వేగవంతమైన ఇంటర్నెట్‌ సదుపాయం లేని మారుమూల ప్రాంతాలు, పాత ఫోన్ల మీదా బాగా పనిచేస్తుందన్నమాట. తేలికైన డిజైన్‌ కారణంగా తక్కువ డేటాను వాడుకుంటుంది. ప్రధాన ఫీచర్ల వాడకానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 

ఆండ్రాయిడ్‌ టీవీ వర్షన్‌: అరట్టై యూజర్లకు ఆండ్రాయిడ్‌ టీవీ వర్షన్‌నూ అందిస్తోంది. వాట్సప్‌లో ఇప్పటివరకూ ఈ సౌలభ్యం లేదు. 

ఏఐ సమ్మిళితం కాదు: ఇటీవల వాట్సప్‌లో మెటా ఏఐ సమ్మిళితమైన విషయం తెలిసిందే. అయితే చాలామంది దీన్ని దృష్టిని మళ్లిస్తున్నట్టు, అనుచితంగా చొరబడినట్టు భావిస్తున్నారు. అరట్టైలో ఇలాంటిదేమీ లేదు. యూజర్ల మీద ఏఐ నిర్వహణను రుద్దకుండా స్వచ్ఛమైన అనుభూతిని కలిగిస్తోంది.

ప్రకటనలు ఉండవు: యాడ్‌ ఫ్రీ ఇంటర్ఫేస్‌ మరో ఆకర్షణ. యూజర్‌ డేటా మొత్తాన్ని మనదేశానికి చెందిన డేటా సెంటర్లలోనే నిల్వ చేస్తుంది. థర్డ్‌ పార్టీలతో షేర్‌ చేయదు. అందువల్ల వాణిజ్యపరంగా అనుచితంగా వాడుకోవటానికి వీలుండదు. అయితే వాయిస్, వీడియో కాల్స్‌ రెండూ ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయినప్పటికీ టెక్స్ట్‌ మెసేజ్‌లు ఇంకా పూర్తిగా ఎన్‌క్రిప్ట్‌ కాలేదు. అదే వాట్సప్‌లోనైతే పూర్తిగా ఎన్‌క్రిప్షన్‌ మోడల్‌ ఉంటుంది. 

సురక్షిత డౌన్‌లోడ్‌ ఇలా

ఆండ్రాయిడ్‌లో: గూగుల్‌ ప్లేలో అరట్టై మెసెంజర్‌ (జోహో కార్పొరేషన్‌) అని సెర్చ్‌ చేస్తే యాప్‌ కనిపిస్తుంది. అరట్టై అధికార వెబ్‌సైట్‌ నుంచైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. థర్డ్‌ పార్టీ ఏపీకేల జోలికి మాత్రం వెళ్లొద్దు.
ఐఫోన్‌లో: యాప్‌ స్టోర్‌లో అరట్టై మెసెంజర్‌ను సెర్చ్‌ చేయాలి. డవలపర్‌ జోహో అవునో కాదో ధ్రువీకరించుకోవాలి. గెట్‌ బటన్‌ మీద తాకితే డౌన్‌లోడ్‌ అవుతుంది. అధికార వెబ్‌సైట్‌ నుంచి సురక్షిత డౌన్‌లోడ్‌ లింక్‌నూ పొందొచ్చు.
యాప్‌ ఇన్‌స్టాల్‌ అయ్యాక దేశాన్ని ఎంచుకొని, ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. వనటైమ్‌ పాస్‌వర్డ్‌తో ధ్రువీకరించుకోవాలి. కాంటాక్ట్స్, మైక్రోఫోన్, కెమెరా, నోటిఫికేషన్స్‌ అనుమతులు ఇచ్చి.. తేలికగా గుర్తించటానికి ప్రొఫైల్‌ పేరు, ఫొటో సెట్‌ చేసుకోవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని