Chat GPT: చాట్‌జీపీటీ చమక్కు

Eenadu icon
By Technology News Desk Published : 01 Oct 2025 01:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

చాట్‌జీపీటీ ఇప్పుడు ఎంతోమందికి తక్షణ సలహాదారుగా మారింది. దీన్ని టీచర్‌గా, స్నేహితుడిగా రకరకాలుగా వాడుకుంటున్నారు. సబ్జెక్టు ప్రశ్నలు, లెక్కల దగ్గరి నుంచి ఆర్థిక చిట్కాల వరకూ ఏదైనా సరే. ప్రశ్నను సంధించటమే తరువాయి. వెంటనే జవాబులిస్తుంది. అయితే దీన్ని చాలామంది పూర్తిస్థాయిలో వాడుకోవటమే లేదు. మరింత బాగా స్పందించేలా చేసే అదృశ్య ఫీచర్లెన్నో ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే పని మరింత సులభమ వుతుంది. ఇందుకోసం సెటింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు.

మెమరీ మోడ్‌

చాట్‌జీపీటీలో అంతగా పేరొందని సెటింగ్స్‌లో ఒకటి మెమరీ మోడ్‌. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే ఇంతకుముందరి అన్ని సెషన్లనూ ఏఐ మరోసారి జ్ఞాపకం తెచ్చుకుంటుంది. మనం రాసే శైలి, ఇష్టమైన అంశాలు, చివరికి ప్రతిస్పందనల్లో వ్యక్తం చేస్తున్న ధ్వనినీ రీకాల్‌ చేసుకుంటుంది. అంటే మనమేంటో, మన అభిరుచులేంటో నిజంగా ‘తెలుసుకొని’ మసలుకుంటుందన్నమాట. ఉదాహరణకు- పండుగకు ఇంటిని ఎలా అలంకరించుకోవాలి? అని అడిగారనుకోండి. గత చర్చల్లో డిజైనింగ్‌ గురించి మీరు పేర్కొన్న అంశాలను గుర్తుకు తెచ్చుకొని, మీ ఇష్టాలకు అనుగుణమైన సూచనలు చేస్తుంది.

అయితే అందరికీ చాట్‌జీపీటీతో చర్చించిన వ్యక్తిగత విషయాలు స్టోర్‌ కావటం ఇష్టముండదనుకోండి. అలాంటివారు మెమరీ మోడ్‌కు దూరంగా ఉండొచ్చు. కానీ మరింత కచ్చితమైన సమాధానాలు కావాలని అనుకుంటే, యాప్‌ను ఓపెన్‌ చేసిన ప్రతిసారీ మన గురించి తెలియజేయటం ఇష్టం లేకపోతే ఈ మోడ్‌ను ఆన్‌ చేసుకోవచ్చు. సెటింగ్స్‌ ద్వారా పర్సనలైజేషన్‌లోకి వెళ్తే మెమరీ ఆప్షన్‌ కనిపిస్తుంది. 

టైపింగ్‌కు బదులు మాట

ప్రాంప్ట్‌ల కోసం ఎప్పుడూ టైపింగ్‌ మీదే ఆధారపడుతున్నారా? అయితే మంచి ఫీచర్లలో ఒకదాన్ని కోల్పోతున్నట్టే. అదే వాయిస్‌ మోడ్‌. దీంతో చాట్‌జీపీటీతో ఎంచక్కా మాట్లాడుతూనే ప్రశ్నలను సంధించొచ్చు. ఇది జవాబులను చదివి వినిపించటమే కాదు, మనుషుల మాదిరిగా గలగలా మాట్లాడగలదు కూడా. అదీ ఒక గొంతుతో కాదు. మనకు ఇష్టమైన ధ్వనిని ఎంచుకోవచ్చు. వాయిస్‌ మోడ్‌తో అన్నింటికన్నా పెద్ద ప్రయోజనం చేతులతో పనిలేకుండా అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవటం.

వంట చేస్తున్నా, తోట పని చేస్తున్నా కూడా చాట్‌జీపీటీని ప్రశ్నలు అడగొచ్చు. ఫోన్‌ను తాకకుండానే జవాబులు పొందొచ్చు. వర్చువల్‌ అసిస్టెంట్‌తో ప్రత్యక్షంగా మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. చాలాసార్లు చాట్‌బాట్‌తో మాట్లాడుతున్నామనే సంగతినీ మరచిపోతుంటాం. మొబైల్‌ ఫోన్‌లో వాయిస్‌ మోడ్‌ను ఎనేబుల్‌ చేసుకోవటానికి- ముందుగా యాప్‌ను ఓపెన్‌ చేసి, హెడ్‌ఫోన్‌ గుర్తు మీద తాకాలి. తర్వాత వాయిస్‌ బటన్‌ను ఆన్‌ చేసుకోవాలి.

సూచనలు ఇష్టమైనట్టుగా

చాట్‌జీపీటీతో ఇంటరాక్ట్‌ అవుతున్నప్పుడు ఎంత స్పష్టంగా ప్రాంప్ట్‌ అందిస్తున్నామన్నది కీలకం. ఉదాహరణకు- ప్రాంప్ట్‌ చివర ‘లైక్‌ ఎ టీచర్‌’ అని జోడించారనుకోండి. జవాబుల ధ్వని మారుతుంది, లోతైన వివరాలు అందిస్తుంది. ఇవి చిన్న మార్పులుగా అనిపించినా మంచి ఫలితాలు పొందొచ్చు. మళ్లీ మళ్లీ ఇలాంటి పదబంధాలను జోడించటం మరచిపోతుంటే చాట్‌జీపీటీ-5లో కస్టమ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఫీచర్‌ సాయం తీసుకోవచ్చు.

చాట్‌జీపీటీ స్పందించే తీరును ఇది డిఫాల్ట్‌గా మార్చేస్తుంది. మాటిమాటికీ పదబంధాలను రాయాల్సిన పనుండదు. సమయమూ ఆదా అవుతుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకోవటానికి- చాట్‌జీపీటీలో సెటింగ్స్‌ ప్యానెల్‌లోకి వెళ్లి, కస్టమ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీ గురించి చాట్‌జీపీటీ ఏం తెలుసుకోవాలో, అదెలా స్పందించాలో అనే వివరాలను రెండు బాక్సుల్లో పొందుపరచాలి. అప్పుడు కొత్త చాట్స్‌ వాటంతటవే ప్రిఫరెన్సులకు అనుగుణంగా మారతాయి.

మీటింగ్‌ సారాంశాలకు రికార్డ్‌ మోడ్‌

వృత్తి నిపుణులు, ఉద్యోగులకు ఉపయోగపడే మరో ఫీచర్‌ రికార్డు మోడ్‌. మీటింగులు, మేధోమథనాలు, వాయిస్‌ నోట్స్‌ను రికార్డు చేసి, అక్షరబద్ధం చేయటం దీని ప్రత్యేకత. ప్రొ, ఎంటర్‌ప్రైజెస్, ఎడ్యుకేషన్‌ యూజర్లకు ఇది అందుబాటులో ఉంది. ఇంది కంటెంట్‌ను సారాంశంగానూ మారుస్తుంది. దానికి అనుగుణంగా ఫాలో అప్స్, టు-డు-లిస్ట్స్‌ వంటి వాటినీ సృష్టిస్తుంది.

తరచూ మీటింగుల్లో పాల్గొనే వారికిది వరమని చెప్పుకోవచ్చు. అదేపనిగా నోట్స్‌ తీసుకోవటం తప్పుతుంది. కీలకమైన వివరాలు తప్పిపోతాయనే బెంగ ఉండదు. చాట్‌జీపీటీ రికార్డు చేసుకుంటూ ఉండటం వల్ల చర్చల మీద మరింత నిశితంగా దృష్టి కేంద్రీకరించొచ్చు. దానంతటదే సారాంశాన్ని గుదిగుచ్చుతుంది కాబట్టి సమయం ఆదా అవుతుంది. 

ఐడియా దృశ్యాలకు కాన్వాస్‌

ఐడియాలను, ఆలోచనలను డయాగ్రామ్స్, పట్టికలు, ఇతర దృశ్య రూపాలుగా మలచుకోవాలనుకునేవారికి కాన్వాస్‌ ఫీచర్‌ మంచి సదుపాయం. టెక్స్ట్‌ ఆధారిత అంశాలను గ్రాఫిక్స్‌గా మార్చటం వల్ల సులభంగా విషయం అవగాహన కావటానికి తోడ్పడుతుంది. 

మేనేజ్‌ యువర్‌ చాట్‌ హిస్టరీ అండ్‌ డేటా

ఇది చాట్‌జీపీటీ హిస్టరీ లేడా డేటా కంట్రోల్స్‌ సెటింగ్స్‌లో ఎక్కడో అడుగున దాగి ఉంటుంది. అందుకే చాలామంది దృష్టిలో పడదు. కానీ దీన్ని వాడుకుంటే ఎంతగానో ఉపయోగపడుతుంది. చాట్‌ హిస్టరీని చూడటానికి, క్లియర్‌ చేయటానికి, ఎక్స్‌పోర్ట్‌ చేయటానికిది వీలు కల్పిస్తుంది. చాట్‌జీపీటీకి మీరు ఏయే విషయాలు చెప్పారోనని అంచనా వేసుకోవటానికి బదులు హిస్టరీని ఎక్స్‌పోర్ట్‌ చేసుకుంటే మీకు పూర్తిస్థాయి బ్యాకప్‌గా ఉపయోగపడుతుంది. మీ ఖాతాతో ముడిపడిన ప్రతి కన్వర్జేషన్‌లోకి తొంగి చూడటానికి వీలు కల్పిస్తుంది. దీన్ని వ్యక్తిగత రికార్డును స్టోర్‌ చేయటానికే కాదు, అవసరమైనప్పుడు దాన్ని తొలగించుకోవటానికీ వాడుకోవచ్చు. అనవసరమైనవి డిలీట్‌ చేసేయొచ్చు.

డేటాను ఎక్స్‌పోర్ట్‌ చేసేటప్పుడు మీ చాట్‌జీపీటీ ప్రొఫైల్‌తో ముడిపడిన మొత్తం హిస్టరీ, వ్యక్తిగత డేటా జిప్‌ ఫైల్‌గా క్రియేట్‌ అవుతుంది. ధ్రువీకరించిన తర్వాత ఇది ఈమెయిల్‌కు చేరుతుంది. అవసరం లేని చాట్స్‌ను డిలీట్‌ చేసుకుంటే హిస్టరీలో ఏమేం ఉండాలో నిర్ణయించుకోవచ్చు కూడా. దీన్ని టర్న్‌ ఆన్‌ చేసుకోవాలంటే- సెటింగ్స్‌ పేజీలోకి వెళ్లి డేటా కంట్రోల్స్‌ మీద తాకాలి. ఇందులో ఎక్స్‌పోర్ట్‌ డేటా ఆప్షన్‌ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్‌ను ఎంచుకొని, కన్‌ఫర్మ్‌ చేసుకోవాలి. ఈమెయిల్‌కు డౌన్‌లోడ్‌ లింక్‌ అందుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని