Multipurpose Health Assistants: 1,200 మంది మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 05:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, దిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీవోఆర్‌టీ నంబరు 1207 కింద నియమితులైన 1,200 మంది మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2002 జులై 20న జారీ చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా నియమితులైన వీరంతా ఆ తర్వాత కోర్టులు జారీ చేసిన ఉత్తర్వుల కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో దాదాపు 11 ఏళ్ల ఉద్యోగ అనుభవం సాధించిన వీరిని రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో 2013లో మళ్లీ కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంది. దీనిపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ అరవింద్‌కుమార్, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఆ నియామకాలను ఖరారు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇదీ నేపథ్యం... 

ఉమ్మడి రాష్ట్రంలో 2,324 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకోసం 2002 జులై 20న అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ నియామకాలను సవాల్‌ చేస్తూ దాఖలైన కేసులను విచారించిన హైకోర్టు వాటన్నింటినీ కొట్టేస్తూ 2003 సెప్టెంబర్‌ 11న ఉత్తర్వులు జారీచేసింది. మళ్లీ మెరిట్‌లిస్ట్‌ తయారుచేసి కొత్తగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టేటస్‌కో విధించి సుప్రీంకోర్టు... తర్వాత 2011 వరకు కేసుపై విచారణ కొనసాగించింది. దాంతో 2002 నోటిఫికేషన్‌ ప్రకారం నియమితులైన వారు 2011 వరకు కొనసాగారు. అయితే వీరి నియామకాలను కొట్టేస్తూ 2003లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2011 ఆగస్టు 9న తీర్పు వెలువరించింది. దీంతో ఈ 1,200 మంది ఉద్యోగాలు కోల్పోయారు. సుదీర్ఘకాలం ఉద్యోగాల్లో పనిచేసిన అనుభవంతోపాటు ఉద్యోగార్హత వయస్సు మీరిన నేపథ్యంలో మానవతా దృక్పథంతో తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతూ వారు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2013 ఆగస్టు 19న జీవోఆర్టీ నంబరు 1207 ప్రకారం మానవతా దృక్పథంతో వీరందరినీ కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకొంది. అయితే 2002 నోటిఫికేషన్‌ ప్రకారం నిర్వహించిన పరీక్షల్లో వీరికంటే ఎక్కువ అర్హత మార్కులు సంపాదించిన అభ్యర్థులు ఈ నియామకాలను సవాల్‌చేస్తూ ఏపీ పరిపాలన ట్రైబ్యునల్, ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు వీరికంటే ఎక్కువ మెరిట్‌ ఉన్నవారిని తీసుకొని, తక్కువ మెరిట్‌ ఉన్నవారిని తొలగించాలని ఆదేశించింది. దాన్ని సవాల్‌చేస్తూ జీవో ఆర్టీ నంబరు 1207 కింద నియమితులైన అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఈ జీవో కింద జరిపిన నియామకాలను ఆమోదించాలని సుప్రీంకోర్టుకు విన్నవిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అలాగే 2002 నోటిఫికేషన్‌ ప్రకారం పరీక్ష రాసినవారు మెరిట్‌ ప్రాతిపదికన మళ్లీ ఉద్యోగాలు క్లెయిమ్‌ చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించింది. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ అరవింద్‌కుమార్, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాలతోకూడిన ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి.. ఈ 1,200 మంది నియామకాలకు రక్షణ కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు