‘తుమ్మిడిహెట్టి-సుందిళ్ల’ అనుసంధానమే మేలు

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 04:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

తగ్గనున్న నిర్మాణ వ్యయం: మంత్రి ఉత్తమ్‌

అధికారులు, ఇంజినీర్లతో సమీక్షిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తుమ్మిడిహెట్టి-సుందిళ్ల అనుసంధానం ద్వారా ప్రతిపాదిత ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని 10 నుంచి 12 శాతం తగ్గించే అవకాశం ఉందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. నీటిపారుదలశాఖపై సోమవారం ఆయన రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘పాత ఎలైన్‌మెంట్‌తో పోలిస్తే సుందిళ్ల అనుసంధానంలో భూసేకరణ సగం వరకు తగ్గుతుంది. నిర్మాణవ్యయం రూ.1,600 కోట్ల మేర ఆదా చేయగలుగుతాం. బొగ్గు బ్లాకుల గుండా సొరంగం, కాలువల తవ్వకాలను నివారించేందుకు అవకాశం ఉంది. పాత ప్రాజెక్టు కింద ఉన్న నీటిపారుదల సామర్థ్యాన్ని ఏమాత్రం తగ్గించకుండా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కొత్త ఎలైన్‌మెంట్‌ అనుకూలంగా ఉంటుంది. పాత ప్రాజెక్టులో 30 కి.మీ. ఉన్న కాలువ పొడవు 13 కి.మీ.కి, 14 కి.మీ. ఉన్న సొరంగం పొడవు 10 కిలోమీటర్లకి తగ్గుతుంది. పంపింగ్‌ కేంద్రాల సంఖ్య, విద్యుత్‌ భారం కూడా తగ్గుతాయి. హైడ్రాలిక్, పర్యావరణం, ఖర్చు, చేకూరే ప్రయోజనం తదితర అంచనాలు రూపొందించాల్సి ఉంది. పాత ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలు రూపొందించిన అనంతరం ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్‌)ను ఇంజినీర్లు రూపొందించాలి. నివేదికపై మంత్రిమండలి ఎదుట చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం’’ అని పేర్కొన్నారు. సమీక్షలో శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఈఎన్సీలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క సాగర్‌ బ్యారేజీ కింద నీటి వినియోగం.. ఎస్సెల్బీసీ హెలిబోర్న్‌ సర్వే.. ప్రాజెక్టుల్లో పూడికతీత.. సీతారామ-సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్‌లకు కేంద్రం నుంచి నిధుల సాధన.. కాళేశ్వరం డిస్ట్రిబ్యూటరీలు, మూడు బ్యారేజీల పునరుద్ధరణ అంశాలపై కూడా మంత్రి ఇంజినీర్లతో చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు