Published : 26 May 2022 06:29 IST

రాష్ట్రానికి ‘స్టాడ్లర్‌’ రైల్వేకోచ్‌ల తయారీ పరిశ్రమ

రూ.1000 కోట్లతో ఏర్పాటు
రూ.500 కోట్లతో ఫెర్రింగ్‌ ఫార్మా కొత్త యూనిట్‌
ష్నైడర్‌ విద్యుత్‌ వాహనాల పరిశ్రమ విస్తరణ
కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందాలు

ఈనాడు, హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్‌ రైల్‌ సంస్థ తెలంగాణలో అంతర్జాతీయ రైల్వేకోచ్‌ల కర్మాగారం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ఈ పరిశ్రమలో 2500 మందికి ఉపాధి కల్పించనుంది. దీంతోపాటు ఇప్పటికే రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుతున్న ఫెర్రింగ్‌ ఫార్మా, విద్యుత్‌ వాహనాల సంస్థ ష్నైడర్‌లు తమ కొత్త యూనిట్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందా(ఎంవోయూ)లు చేసుకున్నాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బుధవారం దావోస్‌లో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆయా కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌లు ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్టాడ్లర్‌ రైల్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్‌గర్‌ బ్రోక్‌మెయెర్‌ మాట్లాడుతూ, ‘తెలంగాణలో ఉన్న మేధ సర్వో సంస్థతో కలిసి రెండేళ్లలో రైల్వే కోచ్‌ల కర్మాగారం నిర్మిస్తాం. వాటిని భారత్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం’ అని తెలిపారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ, ‘అయిదు దశాబ్దాలుగా ప్రభుత్వరంగంలో రైల్వేకోచ్‌ల కర్మాగారం కోసం ప్రయత్నిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయకపోవడం వల్ల నిరాశతో ఉన్నాం. ఈ తరుణంలో స్టాడ్లర్‌ గొప్ప శుభవార్త చెప్పింది’ అని తెలిపారు.

ఫెర్రింగ్‌ ఫార్మా

జీనోమ్‌వ్యాలీలోని ప్రసిద్ధ ఔషధసంస్థ ఫెర్రింగ్‌ ఫార్మా రూ. 500 కోట్లతో మరో భారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఉదర సంబంధ దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే తమ ట్రేడ్‌మార్కు పెంటసాను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేస్తామని వెల్లడించింది. ఫెర్రింగ్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అల్లేసండ్రో గిలియో మంత్రి కేటీఆర్‌కు తమ విస్తరణ ప్రణాళికను వివరించారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ, ‘నెల రోజుల క్రితమే ఫెర్రింగ్‌ భారీ పరిశ్రమను ప్రారంభించాను. ఇంత త్వరగా కంపెనీ మరో రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టడం తెలంగాణపై అపార నమ్మకానికి నిదర్శనం’ అన్నారు.

ష్నైడర్‌ విద్యుత్‌ వాహనాల పరిశ్రమ

రాష్ట్రంలో ఇప్పటికే ఒక పరిశ్రమను నిర్వహిస్తున్న ఫ్రాన్స్‌కు చెందిన విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ష్నైడర్‌.. రూ. 300 కోట్లతో మరో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిద్వారా వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తామని సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు లుక్‌ రిమాంట్‌ తెలిపారు.
 

ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీలు  

ప్రముఖ బయోటెక్‌ ఔషధ సంస్థ ‘రోచ్‌’ ఛైర్మన్‌ క్రిస్టోఫ్‌ ఫ్రాంజ్‌ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయోటెక్‌ పార్కు, వైద్యపరికరాల పార్కుతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రపంచస్థాయి ఔషధనగరిని ప్రశంసించారు. హిటాచి భారత్‌ విభాగం ఎండీ భరత్‌కౌశల్‌తో భేటీ సందర్భంగా సంస్థ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ కోరారు. ప్రముఖ విద్యా సాంకేతిక సంస్థ బైజుస్‌ సహ వ్యవస్థాపకులు రవీంద్రన్‌, గోకుల్‌నాథ్‌ దివ్యలు తెలంగాణలో తమ కేంద్రాలను స్థాపిస్తామని కేటీఆర్‌కు చెప్పారు.

కేటీఆర్‌తో అదర్‌ పూనావాలా భేటీ
ప్రసిద్ధ టీకాల తయారీ సంస్థ, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీదారైన సీరమ్‌ ఇండియా కంపెనీ సీఈవో అదర్‌ పూనావాలా దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. టీకాల ఆధారిత పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, పరిశ్రమల ఏర్పాటుపై ఈ సందర్భంగా చర్చించారు.

మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం మోకాలడ్డు

రహదారులు, వంతెనలు, విద్యుత్‌, నీటి ప్రాజెక్టుల వంటి మౌలిక వసతులే దేశానికి కీలకమని, వీటికి విరివిగా రుణసాయం అందాలని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, అడ్డుకునే ప్రయత్నం దేశానికి మంచిది కాదని ఆయన అన్నారు. రాష్ట్రాలకు రుణసాయం అందించడంలో బ్యాంకులతో పాటు బీమా కంపెనీలకూ భాగస్వామ్యం కల్పించాలన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో బుధవారం జరిగిన సీఈవోల సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారత్‌లో మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపడుతున్న రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించకుండా నిరోధించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్రాలు రుణసాయం పొందుతుంటే ఆంక్షలు విధించడం బాధాకరమని పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని