CM KCR: భారాస కార్యవర్గంపై కసరత్తు

కొత్త జాతీయ పార్టీ భారత్‌ రాజ్య/రాష్ట్రీయ సమితి(భారాస) ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టిన సీఎం కేసీఆర్‌ దీనికి సంబంధించిన జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి సారించారని తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతో పాటు

Updated : 13 Jun 2022 08:36 IST

నేతలు... మేధావులతో కూర్పునకు ప్రయత్నాలు

ముఖ్య నాయకులు, పీకేతో కేసీఆర్‌ చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త జాతీయ పార్టీ భారత్‌ రాజ్య/రాష్ట్రీయ సమితి(భారాస) ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టిన సీఎం కేసీఆర్‌ దీనికి సంబంధించిన జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి సారించారని తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతో పాటు రాష్ట్రాల ప్రతినిధులను ముందుగా నియమించాలనే అంశంపై ఆయన పార్టీ ముఖ్యనేతలతో ఆదివారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ హాజరైనట్లు తెలుస్తోంది. ఈ నెల మూడో వారంలో కొత్త పార్టీ ప్రకటనపై ఇప్పటికే సీఎం కసరత్తు చేపట్టారు. దీనిపై తెరాస రాష్ట్ర కార్యవర్గంలో ఈ నెల 19న ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జాతీయ పార్టీ ఆవిర్భావం అనంతరం దిల్లీలో పార్టీ తరఫున ముగ్గురు లేదా నలుగురు అధికార ప్రతినిధులను నియమించాలని సీఎం భావిస్తున్నారు. తెరాసకు చెందిన ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు కేంద్ర సర్వీసు అధికారులు, కొంతమంది నేతల పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. కేసీఆర్‌ కొత్త పార్టీకి సంబంధించిన సమాచారం తెలుసుకొని పలు రాష్ట్రాల నుంచి నేతలు ఆయనను ఫోన్‌లో సంప్రదించినట్లు తెలిసింది. వారి జాబితానూ రూపొందించి, వారి గురించి పీకే ద్వారా కేసీఆర్‌ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

మమత భేటీకి వెళ్లాలా? వద్దా?

రాష్ట్రపతి ఎన్నికలపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దిల్లీలో ఈ నెల 15న నిర్వహించనున్న సమావేశానికి వెళ్లాలా వద్దా అనే అంశంపైనా సీఎం ముఖ్యనేతలు, పీకేతో చర్చించారు. దీనికి కాంగ్రెస్‌ను కూడా పిలిచినందున... వెళ్తే తప్పుడు సంకేతాలు వస్తాయని కొందరు నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. మమత నుంచి స్పష్టత తీసుకున్నాకే నిర్ణయించుకోవాలని వారు సూచించినట్లు తెలిసింది. ఆ సమావేశానికి హాజరు కాకపోతే భాజపాకు అనుకూలమనే ప్రచారం జరుగుతుందని మరికొందరు పేర్కొన్నట్లు తెలిసింది. వీటన్నింటినీ విన్న కేసీఆర్‌ ఆలోచించి నిర్ణయిద్దామని చెప్పినట్లు సమాచారం. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జాతీయ పార్టీ ఏర్పాటు అంశంపై జరిగిన చర్చలో ఉండవల్లి తన అభిప్రాయాన్ని సీఎంకు వెల్లడించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని