అద్దె రోగులు.. అతిథి అధ్యాపకులు

రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో నిబంధనలను పూర్తిగా గాలికొదిలేస్తున్నారు. ముఖ్యంగా ఆచార్యులు కాగితాలపై మాత్రమే కనిపిస్తున్నారు. కళాశాలకు ఏరోజూ రాకపోయినా.. ఆచార్యుల జాబితాలో మాత్రం కొందరి పేర్లుంటున్నాయి.

Updated : 17 Jun 2022 06:47 IST

అరకొరగా పరీక్షలు... శస్త్రచికిత్సలు
వైద్య విద్యార్థులకు దక్కని అనుభవపూర్వక శిక్షణ
కొన్ని కళాశాలల్లో గాడి తప్పిన బోధన
వైద్య కమిషన్‌ ధోరణీ ప్రశ్నార్థకం
ముందు అనుమతులు.. తర్వాత తనిఖీలతో రోడ్డున పడుతున్న విద్యార్థులు
అయితరాజు రంగారావు
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో నిబంధనలను పూర్తిగా గాలికొదిలేస్తున్నారు. ముఖ్యంగా ఆచార్యులు కాగితాలపై మాత్రమే కనిపిస్తున్నారు. కళాశాలకు ఏరోజూ రాకపోయినా.. ఆచార్యుల జాబితాలో మాత్రం కొందరి పేర్లుంటున్నాయి. కళాశాలలు వారి సర్టిఫికెట్లను మాత్రం వాడుకుంటున్నాయి. పైగా కొందరు విభాగాధిపతులుగా కూడా కొనసాగుతున్నారు. ప్రైవేటు కళాశాలలో బోధన చేయాల్సిన సమయంలో కార్పొరేట్‌ ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు. ఎప్పుడైనా జాతీయ వైద్య కమిషన్‌ తనిఖీ బృందం వస్తే మాత్రం.. అప్పుడు హాజరవుతుంటారు. ఫలితంగా ఆచార్యులు చేయాల్సిన బోధనను కింది స్థాయి బోధకులతో చెప్పిస్తున్నారు. ఇలా పేరును మాత్రం అద్దెకిచ్చే వైద్యులూ.. ఇలాంటి వారిని అడ్డంపెట్టుకొని పబ్బం గడుపుకుంటున్న ప్రైవేటు వైద్యకళాశాలలూ ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలూ అవసరాలకు తగ్గట్లుగా ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలల నుంచి వైద్యులను తరలిస్తూ  గట్టెక్కుతున్నాయనే ఆరోపణలున్నాయి.

కళాశాలల్లో లోపాలు విద్యార్థులకు శాపంగా పరిణమిస్తున్నాయి. దీంతో ఆయా కళాశాలల్లో వైద్య సీట్లకు అనుమతులు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయ ప్రభావం అభం శుభం తెలియని విద్యార్థులపై పడింది. ఇప్పుడు ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. తమకు న్యాయం చేయాలంటూ వారు ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అసలు అనుమతులు ఇవ్వడానికి ముందే సరిగ్గా తనిఖీలు నిర్వహించి, లోపాలున్న కళాశాలలకు నిరాకరిస్తే.. విద్యార్థులు రోడ్డు మీద పడే పరిస్థితులుండేవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


* మరో ప్రైవేటు వైద్య కళాశాలలోనూ ఇదే దుస్థితి. ఇక్కడ అధ్యాపకుల కొరత 50.47 శాతం. రెసిడెంట్‌ వైద్యుల లోటు 66.31 శాతం. ఓపీలో నమోదైన రోగుల సంఖ్య 849. బోధనాసుపత్రిలో పడకలు కనీసం 650 ఉండాలి.  కేవలం 542 పడకలతోనే నెట్టుకొస్తున్నారు. ఆసుపత్రి మొత్తం పడకల్లో కేవలం 9.38 శాతం మంది రోగులు సేవలు పొందుతున్నారు. రేడియాలజీ, బయోకెమిస్ట్రీ, సీరాలజీ, హెమటాలజీ, క్లినికల్‌ పాథాలజీ విభాగాల్లో స్వల్ప సంఖ్యంలో మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. వైద్య కళాశాలల్లో ఇన్ని లోటుపాట్లు కనిపిస్తుంటే.. ఇక విద్యార్థులు ఏం నేర్చుకుంటారు?

* కొత్తగా స్థాపించనున్న ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య అధ్యాపకుల కొరత 88.88 శాతంగా, రెసిడెంట్‌ వైద్యుల కొరత 69.76 శాతంగా ఉంది. కళాశాల భవన నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. ఇతరత్రా సదుపాయాలు అంతంతే. అవసరమైన వైద్య పరికరాలు, ఆడియో విజువల్‌ పరికరాలు కూడా ఏర్పాటు చేయలేదు. వైద్య కళాశాలకు అనుబంధ ఆసుపత్రిలో కనీసం 330 పడకలు ఉండాల్సి ఉండగా.. కేవలం 233 ఉన్నాయి. ఆసుపత్రి పడకల్లో కనీసం 60 శాతం రోగులు చికిత్స పొందాల్సి ఉండగా.. 45.49 శాతం రోగులు మాత్రమే వైద్యం చేయించుకుంటున్నారు. ... ఇటీవల జాతీయ వైద్య కమిషన్‌ తనిఖీ బృందం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో పరిశీలనకు వచ్చినప్పుడు కొన్ని కళాశాలల్లో వెల్లడైన విస్తుపోయే వాస్తవాలివి.

ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో 150 మంది వైద్య విద్యార్థులు తొలి ఏడాది చదువుతున్నారు. ఇక్కడ అధ్యాపకుల కొరత 59.3 శాతం. రెసిడెంట్‌ వైద్యులు, ట్యూటర్ల కొరత 23.45 శాతం. పడకల్లో చికిత్స పొందుతున్న రోగుల శాతం 11.97 శాతమే. కనీసం 1,200 మందిని చూడాల్సిన చోట కేవలం 600 మందికే ఓపీ సేవలు అందుతున్నాయి. అత్యవసర వైద్యసేవ విభాగంలోనూ కేవలం ముగ్గురంటే ముగ్గురే రోగులు చికిత్స పొందుతున్నారు. ఇక రేడియాలజీ నిర్ధారణ పరీక్షలైతే నామమాత్రమే. ఇన్ని లోపాలతో వైద్య విద్యార్థులకు సరైన బోధన ఎలా లభిస్తుంది?


తనిఖీ బృందాలకూ ఆమ్యామ్యాలు

వైద్య కళాశాలలు నిబంధనల మేరకు పనిచేస్తున్నాయా? లేవా? అని పరిశీలించేందుకు తనిఖీ బృందాలను జాతీయ వైద్య కమిషన్‌ ఎప్పటికప్పుడు పంపిస్తుంటుంది. కొందరు తనిఖీ అధికారులను కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు బుట్టలో వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పై స్థాయిలోనే సంబంధాలు పెట్టుకొని, ఏ రోజు పరిశీలనకు వస్తున్నారో ముందే తెలుసుకుంటున్నారు. పరిశీలన రోజున అద్దె రోగులను తాత్కాలిక ప్రాతిపదికన బస్సుల్లో తెచ్చుకొని పడకల్లో నింపుతున్నారు. తనిఖీ బృందాలకు భారీగా ముడుపులు ముట్టజెపుతున్నట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి.


తల్లిదండ్రులే జాగ్రత్తపడాలి

వైద్యవిద్యలో నాణ్యత ఉందా? లేదా? అనేది చూడడం ముఖ్యం. పిల్లల్ని కళాశాలలో చేర్పించడానికి ముందే.. తల్లిదండ్రులు ఎంపిక చేసుకున్న కళాశాలను పరిశీలించడం మంచిది. పారాక్లినికల్‌, బేసిక్‌ సైన్స్‌ విభాగాల్లో బోధనా సిబ్బంది తగినంతగా ఉన్నారా? అసలు వైద్యులు అనుబంధ బోధనాసుపత్రికి వస్తున్నారా? రోజూ ఎంతమంది రోగులను ఓపీలో చూస్తున్నారు? ఎందరు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు? ఇవన్నీ కచ్చితంగా పరిశీలించాల్సిన అంశాలే. ఇవేవీ చూడకుండా కేవలం ఎంబీబీఎస్‌లో సీటు వచ్చింది కదాని చేర్పిస్తే విద్యార్థులు నష్టపోతారు. మంచి భవిష్యత్తును నాశనం చేసిన వారవుతారు. అందుబాటులో బోధనా సిబ్బంది తగినంత లేనప్పుడు.. ఎన్ని కొత్త కళాశాలలు పెట్టినా ఉపయోగం లేదు. సీట్లు పెరిగిన నిష్పత్తిలో ఆచార్యులను తయారు చేయలేమనేది గ్రహించాలి.

-డాక్టర్‌ ఎల్‌.నరేంద్రనాథ్‌, నిమ్స్‌ మాజీ సంచాలకులు

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts