కొత్త వైద్యకళాశాలల్లో కన్వీనర్‌ కోటా పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే

రాష్ట్రంలో 2014 జూన్‌ 2వ తేదీ తర్వాత ప్రారంభించిన అన్ని వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలోని మొత్తం పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.

Updated : 29 Jul 2023 04:02 IST

వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2014 జూన్‌ 2వ తేదీ తర్వాత ప్రారంభించిన అన్ని వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలోని మొత్తం పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్ర విద్యార్థులకు 117 సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఇదీ భర్తీ విధానం: మెడికల్‌ పీజీలో తెలంగాణ ప్రభుత్వ కళాశాలల్లో 50 శాతం సీట్లు ఆలిండియా కోటా కింద జాతీయస్థాయి కౌన్సెలింగ్‌లో భర్తీ కానుండగా.. మిగిలిన 50 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద కేటాయిస్తారు. వీటితో పాటు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని పీజీ సీట్లలో 50 శాతం కూడా కన్వీనర్‌ కోటా కింద భర్తీ అవుతాయి. ఈ రెండింటికీ కాళోజీ విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ నిర్వహించి భర్తీ చేస్తుంది. గత ఏడాది వరకు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద భర్తీ అయ్యే పీజీ సీట్లలో 15 శాతం సీట్లకు తెలంగాణ, ఏపీ విద్యార్థులు పోటీపడేవారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో 2014 జూన్‌ 2కు ముందు ఏర్పాటైన మెడికల్‌ కాలేజీల్లో మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఆ తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించనున్నారు.

నిబంధనల్లో మార్పులు: ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. విభజన అనంతరం పదేళ్లపాటు ఎంబీబీఎస్‌, మెడికల్‌ పీజీ కన్వీనర్‌ కోటా సీట్లలో 15 శాతం సీట్ల కోసం తెలంగాణ, ఏపీ విద్యార్థులు పోటీపడేలా నిబంధనలున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ నిబంధనను రాష్ట్రం ఏర్పాటు కాకమునుపు ఉన్న మెడికల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్‌ సీట్లకు మాత్రమే వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కూడా ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేసింది. తాజాగా పీజీ మెడికల్‌ సీట్ల భర్తీ నిబంధనల్లో తెలంగాణ మార్పులు చేసింది.

2014 జూన్‌ రెండో తేదీ నాటికి తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో పీజీ సీట్లు 515. ప్రైవేటు కాలేజీల్లో సీట్లు 668.

2014 జూన్‌ రెండో తేదీ తర్వాత నెలకొల్పిన ప్రభుత్వ వైద్యకళాశాలల్లో అదనంగా వచ్చిన పీజీ సీట్లు 755. ప్రైవేటు కాలేజీల్లో అందుబాటులోకి వచ్చినవి 808. మొత్తం 1563 సీట్లలో కన్వీనర్‌ కోటా కింద భర్తీ అయ్యేవి 781. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇందులో 15 శాతం కోటా కింద తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అదనంగా దక్కే సీట్లు 117.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని