కాంగ్రెస్‌లో మూడు కమాండ్‌ల పాలన

వందేళ్లకు పైగా చరిత్ర అని చెప్పుకొనే కాంగ్రెస్‌కే వారంటీ అయిపోయిందని, అది ఇచ్చే హామీలకు గ్యారంటీ ఎక్కడుంటుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Updated : 01 Oct 2023 07:00 IST

హైదరాబాద్‌లో ఒకటి, బెంగళూరులో ఇంకొకటి, దిల్లీలో మరొకటి
వీరిలో ఒకరిమాట మరొకరు వినరు... ఒకరి హామీలు వేరొకరు నెరవేర్చరు
ఓట్ల కొనుగోలుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు కర్ణాటక నుంచి రూ.వందల కోట్లు
ప్రపంచానికి తెలుగువారి సత్తా చాటిన ఎన్టీఆర్‌, కేసీఆర్‌
ఖమ్మం, సత్తుపల్లి సభల్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

ఈటీవీ ఖమ్మం: వందేళ్లకు పైగా చరిత్ర అని చెప్పుకొనే కాంగ్రెస్‌కే వారంటీ అయిపోయిందని, అది ఇచ్చే హామీలకు గ్యారంటీ ఎక్కడుంటుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. హస్తం పార్టీ పీనుగుతో సమానమని విమర్శించారు. శనివారం ఖమ్మం కార్పొరేషన్‌లో రూ.1,390 కోట్లు, సత్తుపల్లిలో రూ.142 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద నెలకొల్పిన దివంగత నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం, సత్తుపల్లిలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.

‘‘కాంగ్రెస్‌లో మూడుచోట్ల కమాండింగ్‌ వ్యవస్థలున్నాయి. అవి.. హైదరాబాద్‌లో లోకల్‌ కమాండ్‌, బెంగళూరులో న్యూ కమాండ్‌, దిల్లీలో హై కమాండ్‌. వీరిలో ఒకరిమాట మరొకరు వినరు. ఒకరు ఇచ్చిన హామీలు వేరొకరు నెరవేర్చరు. పార్టీని చూస్తే కప్పల తక్కెడ. ఎవరైనా పైకి ఎదుగుదామనుకుంటే మరో నలుగురు కిందకు లాగేస్తారు. అలాంటి పార్టీ ఉమ్మడి ఏపీని ఆరు దశాబ్దాలు పాలించింది. నాడు చేసిన దగా, మోసాలను ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. ఎన్నికల వేళ ఆరు వారంటీలంటూ కొత్త వేషాలతో ఆ నేతలు ముందుకొస్తున్నారు. ఆ హామీలను దేశంలోని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అనేది తెలంగాణవాసులకు చెప్పాలి. గ్యారంటీలపై ఊదరగొట్టే నేతలకు సీటు దక్కుతుందన్న నమ్మకమే లేదు’’ అని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా జరగడం లేదని ఆ పార్టీ ఎంపీ ఒకరు ఆరోపిస్తున్నారని, అది నిజమని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనే లక్ష్యంతో కర్ణాటక నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు రూ.వందల కోట్లు పంపుతున్నారని మంత్రి ఆరోపించారు. ఎన్ని కోట్లు వెదజల్లినా అమ్ముడు పోయేందుకు రాష్ట్రం అంగడి సరకు కాదన్నారు. ఈ నిజం తెలిసేలా బెంగళూరు, దిల్లీ కమాండ్‌లకు ప్రజలు గట్టి సమాధానం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పంచే దొంగ సొమ్ము తీసుకుని భారాసకు ఓటేయాలని అన్నారు.

ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టం

ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ఎన్టీఆర్‌ ఆరాధ్య దైవమని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘ఆయన స్థాయికి సీఎం పదవి చాలా చిన్నదన్నారు. తెలుగుజాతి ఖ్యాతిని ఎన్టీఆర్‌, తెలంగాణ అస్తిత్వాన్ని ఆయన శిష్యుడు సీఎం కేసీఆర్‌ ప్రపంచానికి చాటి చెప్పారు. భారాస అధినేత హ్యాట్రిక్‌ సీఎం కావడం ఖాయం’ అన్నారు. సత్తుపల్లిలో జరిగిన ‘ప్రగతి నివేదన’ సభా వేదికగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులపై పరోక్ష విమర్శలు గుప్పించారు. భారాసకు చెందిన మాజీ నేతలిద్దరూ తమ బాధలే జిల్లా ప్రజల బాధలుగా చిత్రీకరిస్తున్నారన్నారు. వైరా సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాములు నాయక్‌ తనకు టికెట్‌ రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారన్నారు. కానీ ఇదే కారణంతో ఆ నేతలు మాత్రం కేసీఆర్‌ని విమర్శించి పార్టీ మారారన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా మంత్రిని చేశామని, నిన్నటి వరకు దేవుడిగా కొలిచిన సీఎం ఇప్పుడు దయ్యం ఎలా అయ్యారని తుమ్మలను ప్రశ్నించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వినతితో సత్తుపల్లి నియోజకవర్గానికి సీఎం ‘దళితబంధు’ ప్రకటించారన్నారు. హుజూరాబాద్‌ తరహాలో పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షం కారణంగా మంత్రి భద్రాచలం పర్యటన రద్దయింది. కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, మేయర్‌ నీరజ తదితరులు పాల్గొన్నారు.


రాముడైనా.. కృష్ణుడైనా మనకు ఎన్టీఆరే

ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల వేళ ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా  అదృష్టం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ఆయన  ఆరాధ్య దైవం. మనకు రాముడైనా.. కృష్ణుడైనా ఎన్టీఆరే.

కేటీఆర్‌


తెలంగాణలో ఎన్నికల కోసం కర్ణాటకలో బిల్డర్లపై పన్ను

‘స్కాంగ్రెస్‌’కు తిరస్కరణ తప్పదు
ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పుడే అవినీతికి తెరలేపిందని, తెలంగాణలో జరిగే ఎన్నికల్లో నిధుల సమీకరణ కోసం బెంగళూరు బిల్డర్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం పన్ను విధిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ప్రతి చదరపు అడుగుకు రూ.500 చొప్పున రాజకీయ ఎన్నికల పన్ను విధిస్తోందని ఆయన శనివారం ఎక్స్‌(ట్విటర్‌) ద్వారా ఆరోపించారు. గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌ స్కామ్‌ల వారసత్వంతో ‘స్కాంగ్రెస్‌’గా మారిందని, కర్ణాటక రాష్ట్ర నిధులను తీసుకొచ్చి తెలంగాణలో ఎంత వెదజల్లినా ఇక్కడి ప్రజలు స్కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని