TS news: అమ్మను అనాథను చేశారు!

నవ మాసాలు మోసి.. కని పెంచిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూడాల్సిన తనయుడు, అతని కుటుంబ సభ్యులు ఆమెను అనాథగా వదిలేశారు. ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించి రోడ్డు పక్కన పడేశారు.

Updated : 23 Dec 2023 06:52 IST

నవ మాసాలు మోసి.. కని పెంచిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూడాల్సిన తనయుడు, అతని కుటుంబ సభ్యులు ఆమెను అనాథగా వదిలేశారు. ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించి రోడ్డు పక్కన పడేశారు. ఈ హృదయ విదారక ఘటన కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌ గ్రామంలో చోటు చేసుకొంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లం లచ్చమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆమె భర్తతోపాటు పెద్ద కుమారుడు, ఓ కుమార్తె మృతి చెందగా.. వృద్ధాప్యంలో ఉన్న లచ్చమ్మను పెద్ద కుమారుడి కుటుంబం, చిన్న కుమారుడు విడతల వారీగా చూసేందుకు ఒప్పందం చేసుకున్నారు. మహారాష్ట్రలో నివాసం ఉంటున్న పెద్ద కుమారుడు రాజయ్య కుటుంబ సభ్యులు తమ వంతుగా లచ్చమ్మను అక్కడికి తీసుకెళ్లి సపర్యలు చేశారు. తమ వంతు ముగియడంతో శుక్రవారం లచ్చమ్మను వాహనంలో తాడికల్‌ గ్రామానికి తీసుకువచ్చి చిన్న కుమారుడి ఇంటి వద్ద దింపారు. అయితే చిన్న కుమారుడి కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లకుండా ఆటోలో పాత ఇంటి సమీపంలో రోడ్డు పక్కన దించేసి వెళ్లిపోయారు. స్థానికులు డయల్‌ 100కు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధురాలి చిన్న కుమారుడితోపాటు అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయితే వారు ఆమెను తీసుకెళ్లడానికి నిరాకరించారు. దీంతో స్థానికులు ఆమెను శిథిలావస్థకు చేరిన పాత ఇంటిలో ఉంచారు. 80 ఏళ్ల వృద్ధురాలికి ఈ పరిస్థితి రావడం బాధాకరమని.. అధికారులు తగు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరారు. రాత్రి చిన్న కుమారుడు తల్లి కోసం భోజనం తీసుకు వచ్చాడని, పాత ఇంట్లోనే ఉంచి భోజనం పెడతానని అతను చెప్పినట్లు స్థానికులు తెలిపారు.

న్యూస్‌టుడే, శంకరపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు