ట్యాపింగ్‌ వెనక ప్రముఖులు!

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం వెనక పలువురు కీలక ప్రముఖులున్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్‌రావు బృందం ఈ వ్యవహారం నడిపినట్లు వెల్లడైంది.

Updated : 25 Mar 2024 07:32 IST

ఉన్నతస్థాయి నుంచే ఆదేశాలు..
పక్కా ఆధారాలు సేకరించాక మరిన్ని అరెస్టులు
చంచల్‌గూడ జైలుకు అదనపు ఎస్పీల తరలింపు
ఈనాడు - హైదరాబాద్‌

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం వెనక పలువురు కీలక ప్రముఖులున్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్‌రావు బృందం ఈ వ్యవహారం నడిపినట్లు వెల్లడైంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు ప్రజాప్రతినిధులూ దీని వెనక ఉన్నట్లు దర్యాప్తు అధికారులకు సమాచారం లభించింది. అయితే సున్నితమైన అంశం కావడంతో మరింత లోతుగా ఆరా తీసి పకడ్బందీ ఆధారాలతో కేసును బలోపేతం చేయాలని నిర్ణయించారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఇప్పటివరకు అతడితోపాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేశారు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే మరికొందరిని అరెస్టు చేయనున్నారు. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నేతలతోపాటు విశ్రాంత, ప్రస్తుత పోలీస్‌ అధికారులు ఉన్నట్లు సమాచారం. ముగ్గురు నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు మంగళవారం న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

ఆక్సిలరేటెడ్‌ పదోన్నతిపై ఆరా

వాస్తవానికి ప్రణీత్‌రావు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేశారు. 2018లో ఎస్‌ఐబీలో ఇన్‌స్పెక్టర్‌గా చేరిన ఆయన 2023లో డీఎస్పీగా ఆక్సిలరేటెడ్‌ పదోన్నతి పొందారు. ఇందుకోసం మావోయిస్టు కార్యకలాపాల సమాచారం అందించినట్లు నివేదిక రూపొందించారు. తొలుత ఈ నివేదికను రివ్యూకమిటీలో ఉన్నతాధికారి ఒకరు తిరస్కరించారు. ఆయన సెలవులో ఉన్న సమయంలో పదోన్నతికి మార్గం సుగమం చేయించుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదమూ ఉండటంతో అది సాధ్యమైంది. తాజాగా అతడి పదోన్నతిపై ఫిర్యాదులు అందడంతో అప్పటి దస్త్రాన్ని బయటికి తీశారు. పదోన్నతి ఇప్పించడంలో ఎవరి పాత్ర ఉంది..? ఒకవేళ అడ్డదారిలో పొందితే సహకరించిందెవరు..? అనే అంశాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు.

ఏప్రిల్‌ 6 వరకు అదనపు ఎస్పీలకు రిమాండ్‌

ఈ వ్యవహారంలో అరెస్టయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. శనివారం రాత్రి వీరిద్దరిని అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ పోలీసులు ఐపీసీ 120ఏ, 409, 427, 201, 34 ఆఫ్‌ సెక్షన్‌ 3 పబ్లిక్‌ ప్రాపర్టీ డ్యామేజ్‌ యాక్ట్‌ సెక్షన్లు నమోదు చేశారు. ఆదివారం ఉదయం కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంట్లో వీరిని ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఏప్రిల్‌ 6 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో జైలుకు తరలించారు. శనివారంతో దుగ్యాల ప్రణీత్‌రావు ఏడు రోజుల కస్టడీ ముగియడంతో ఆయన్నీ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో ప్రణీత్‌రావునూ జైలుకు తరలించారు.


శివార్లలో ఆపరేషన్లు.. సొమ్ము పక్కదారి

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏళ్ల తరబడి ఫోన్‌ట్యాపింగ్‌కు అలవాటు పడిన ప్రణీత్‌ బృందం నిర్వాకాలు గత శాసనసభ ఎన్నికల వేళ పతాకస్థాయికి చేరుకున్నట్లు వెల్లడైంది. ఎన్నికల్లో రాజధాని నుంచి హవాలా సొమ్ము రాష్ట్రంలోని బయటి ప్రాంతాలకు భారీగా తరలిస్తారని ఫోన్‌ ట్యాపింగ్‌ను విస్తృతం చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో హైదరాబాద్‌ కమిషనర్‌గా సందీప్‌ శాండిల్య నియమితులయ్యారు. దీంతో హైదరాబాద్‌ కమిషనరేట్‌లో క్షేత్రస్థాయి ఆపరేషన్లు చేపట్టేందుకు అవకాశం చిక్కదని ప్రణీత్‌ బృందం వ్యూహం మార్చి శివార్లపై దృష్టి సారించింది. ముఖ్యంగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆపరేషన్లు ఎక్కువగా నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ట్యాపింగ్‌లో గుర్తించిన హవాలా లావాదేవీలపై దృష్టిపెట్టి దొరికిన సొమ్మును భారీగా పక్కదారి పట్టించినట్లు దర్యాప్తు బృందం ప్రాథమిక అంచనాకు వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు