జోరున కురిసి.. భగ్గున మండి

రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.

Published : 23 Apr 2024 05:13 IST

పిడుగుపాటుకు ఒకరు, వడదెబ్బతో మరొకరి మృతి
మిర్యాలగూడలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం

ఈనాడు, హైదరాబాద్‌- కల్హేర్‌, పలిమెల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలోని 11 మండలాల్లో 44.1 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలు వేడితో అల్లాడాయి. మరోవైపు రాష్ట్రంలోనే అత్యధికంగా సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలంలో 5.4 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్‌ జిల్లా కుభీరు మండలంలో 3.2, కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో 3, ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో 2.6 సెం.మీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్‌ జిల్లాలో తెల్లవారుజామున అకాల వర్షానికి పలువురు రైతుల ధాన్యం తడిసిపోయింది.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), సూర్యాపేట జిల్లా సూర్యాపేట, ఆత్మకూర్‌(ఎస్‌), నల్గొండ జిల్లా కనగల్‌, నార్కట్‌పల్లి మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం మాసాన్‌పల్లిలో సోమవారం సాయంత్రం రేణుక(30) అనేక వివాహిత పిడుగుపాటుకు గురై మృతిచెందారు. అలాగే భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రానికి కుమ్మరి అనిత(45) వడదెబ్బతో మృతిచెందినట్లు పోలీసు కేసు నమోదైంది. అడ్డగూడూరు మండలం కంచనపల్లిలో పిడుగుపాటుకు భాషబోయిన లింగయ్య పాడిగేదె మృతిచెందింది. మంగళ, బుధవారాల్లోనూ కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతోపాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని