లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు

లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది.

Updated : 28 Apr 2024 05:43 IST

ఆర్‌అండ్‌బీ ఏఈ అప్పీలు కొట్టివేత

ఈనాడు, హైదరాబాద్‌: లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. ముడుపుల కేసులో ఏసీబీ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ వరంగల్‌ జిల్లా పరిధిలోని ఆర్‌అండ్‌బీ అసిస్టెంట్‌ ఇంజినీరు ఎస్‌.రాఘవేందర్‌ దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు కొట్టివేసింది. అరెస్ట్‌ సమయంలో రిమాండ్‌లో ఉన్న కాలాన్ని మినహాయించి మిగిలిన శిక్షను అనుభవించాలని తీర్పులో పేర్కొంది. ఆ వివరాలివీ.. రామగూడెం నుంచి పండవారిగూడేనికి ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణ పనిని కాంట్రాక్టర్‌ గడువులోగా పూర్తిచేశారు. ఆర్‌అండ్‌బీ ఏఈగా ఉన్న రాఘవేందర్‌ పని పూర్తయినట్లు ఎంబుక్‌లో నమోదు చేశారు. చేసిన పనికి.. రూ.2 లక్షల నగదు, 34 టన్నుల బియ్యాన్ని కాంట్రాక్టరుకు అప్పగించాలి. అయితే రూ.లక్ష నగదు, 19 టన్నుల బియ్యం పెండింగ్‌లో ఉండటంతో ఏఈ రాఘవేందర్‌ను కాంట్రాక్టర్‌ సంప్రదించారు.

ఆ మొత్తం విడుదలకు రూ.30 వేలు డిమాండ్‌ చేసి చివరికి రూ.20 వేలకు ఏఈ అంగీకరించారు. దీనిపై కాంట్రాక్టరు ఏసీబీకి ఫిర్యాదు చేయగా 2003 ఆగస్టులో ట్రాప్‌ చేసి రాఘవేందర్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరిపి నిందితుడైన రాఘవేందర్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. దీన్ని సవాలు చేస్తూ రాఘవేందర్‌ హైకోర్టులో అప్పీలు దాఖలుచేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ కె.సురేందర్‌ ఇటీవల తీర్పు వెలువరించారు. ఆ మొత్తాన్ని రుణంగా తీసుకున్నానని, ప్రభుత్వ భూమిలో కాంట్రాక్టరు ఆక్రమణలను తొలగించినందుకు కక్షతో ఫిర్యాదు చేశారన్న అప్పీలుదారు వాదనతో న్యాయమూర్తి విభేదించారు. ఆక్రమణలు తొలగించారని కక్ష పెట్టుకున్న వ్యక్తి నుంచి రుణం తీసుకుంటున్నానన్న వాదన అసంబద్ధంగా ఉందని పేర్కొన్నారు. రుణంగా తీసుకున్నట్లు ప్రామిసరీ నోటుగానీ, రసీదుగానీ చూపలేదని, అప్పీలును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని