డిజిటలైజేషన్‌తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ

మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్‌తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే అన్నారు.

Updated : 28 Apr 2024 05:37 IST

నల్గొండ కోర్టు భవనాల ప్రారంభంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే

ఈనాడు, నల్గొండ-న్యూస్‌టుడే, నీలగిరి, నల్గొండ న్యాయవిభాగం: మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్‌తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే అన్నారు. పెండింగ్‌ కేసులను వంద శాతం పరిష్కరించే విధంగా న్యాయవ్యవస్థ ముందుకు సాగుతోందని, ఈ విషయంలో ప్రస్తుత న్యాయమూర్తులు, న్యాయవాదులు చేస్తున్న కృషిని కొనసాగించాలన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రూ.14 కోట్లతో నూతనంగా నిర్మించిన ఐదు కోర్టు భవనాల సముదాయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. భవన సముదాయం ప్రారంభానికి ముందు నల్గొండ శివారులో పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయాన్ని దర్శించుకున్నారు.

అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టుల డిజిటలైజేషన్‌లో నల్గొండ కోర్టు రెండోదని, కొంచెం ఆలస్యమైనా కోర్టుల నిర్మాణానికి కృషి చేసిన న్యాయమూర్తులను, బార్‌ అసోసియేషన్‌ సభ్యులను అభినందించారు. రాష్ట్రంలో అన్ని కోర్టులను డిజిటలైజేషన్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఏడాది కాలంలో 8500 కేసులను హైకోర్టులో పరిష్కరించామని, నల్గొండలోనూ 450కి పైగా కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. అనంతరం నూతన కోర్టు భవన సముదాయాన్ని న్యాయమూర్తులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు, నల్గొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.వెంకట్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది రావుల వెంకట్‌రెడ్డి, వివిధ కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని