హిందీ మిలాప్‌ ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత

ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్‌ ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.

Published : 28 Apr 2024 03:54 IST

అబిడ్స్‌, న్యూస్‌టుడే: ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్‌ ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. దక్షిణ భారతదేశంలో హిందీ సాహిత్యం, జర్నలిజం అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతానికి చెందిన వినయ్‌ తండ్రి యుధ్‌వీర్‌, తల్లి సీతా యుధ్‌వీర్‌ స్వాతంత్య్ర సమరయోధులు. స్వాతంత్య్రానికి పూర్వం భారత్‌కు వచ్చారు. తల్లి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. తండ్రి స్వాతంత్య్రానికి పూర్వం ఉర్దూ మిలాప్‌ పత్రికను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కట్టెలమండిలో స్థిరపడ్డారు. 1962లో హిందీ మిలాప్‌ను నెలకొల్పారు. తండ్రి ప్రారంభించిన పత్రిక ద్వారా.. వినయ్‌ సీనియర్‌ జర్నలిస్టుగా దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ సాహిత్యానికి, మీడియాకు సేవలందించారు. తండ్రి పేరిట యుధ్‌వీర్‌ ఫౌండేషన్‌ ప్రారంభించారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వారికి అవార్డులు అందిస్తున్నారు. వినయ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు. వినయ్‌ వీర్‌ మృతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పత్రికా ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. భారాస అధినేత కేసీఆర్‌ కూడా సంతాపం ప్రకటించారు. దక్షిణ భారతదేశంలో హిందీ సాహిత్యం, జర్నలిజం అభివృద్ధి కోసం వినయ్‌ చేసిన కృషి గొప్పదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని