మిల్లర్లకు 25% జరిమానా

మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్‌- కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.

Published : 28 Apr 2024 03:55 IST

సీఎంఆర్‌ బకాయిల వసూలుకు ఉత్తర్వులు
‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్‌- కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. 2022-23 వానాకాలం పంటకు సంబంధించి సీఎంఆర్‌లో 453 మంది మిల్లర్లు బకాయిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారుల్ని ఆదేశిస్తూ.. పౌరసరఫరాలశాఖ ముఖ్యకార్యదర్శి డీఎస్‌ చౌహాన్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022-23 ఖరీఫ్‌ సీజన్‌లో పౌరసరఫరాల సంస్థ మిల్లర్లకు 65.02 లక్షల టన్నుల ధాన్యం ఇచ్చింది. వారి నుంచి 43.75 లక్షల టన్నుల బియ్యం రావాల్సి ఉంది. తుది గడువు 2024 ఫిబ్రవరి 29 దాటినా ఆ మిల్లర్లు 2.49 లక్షల టన్నుల బియ్యాన్ని అప్పగించలేదు. గడువు తర్వాత మిల్లర్లపై పౌరసరఫరాల సంస్థ చర్యలకు ఉపక్రమించలేదు. ఈ విషయంపై ‘రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?’ శీర్షికన ఏప్రిల్‌ 19న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనికి పౌరసరఫరాల సంస్థ స్పందించింది. జిల్లాల వారీగా మిల్లర్ల బకాయిల వివరాలను జతచేస్తూ జరిమానాతో, వడ్డీతో బకాయిల వసూలుకు అనుమతివ్వాలని ఈ నెల 20న పౌరసరఫరాలశాఖను కోరగా.. ఆ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 453 మంది రైస్‌మిల్లర్లను బకాయిదారులు (డిఫాల్టర్లు)గా ప్రకటించింది. వారి నుంచి 25 శాతం జరిమానాతో సీఎంఆర్‌ను వసూలు చేయాలని నిర్ణయించింది. బకాయి మొత్తంపై గడువు తేదీ నుంచి 12 శాతం వడ్డీ కూడా వసూలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. 60 రోజుల్లోగా ఈ మొత్తాలను చెల్లించాల్సిందేనని, గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. జరిమానా మాఫీ కోరడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. జరిమానా, వడ్డీతో కలిపి బకాయిలు చెల్లించని మిల్లర్లపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) చట్టాన్ని ప్రయోగించడం వంటి చర్యలు కూడా తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని