పకడ్బందీగా టీఎస్‌ఈఏపీసెట్‌

రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ ఆధ్వర్యంలో ఈఏపీసెట్‌-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు.

Published : 30 Apr 2024 06:12 IST

తొలిసారి ఫేషియల్‌ రికగ్నిషన్‌ అమలు
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
విద్యార్థుల చేతులకు గోరింటాకు, పచ్చబొట్టు ఉండొద్దు
ఏపీ విద్యార్థులకు ఈ సంవత్సరమూయథావిధిగా ప్రవేశాలు
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి

ఈనాడు,హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ ఆధ్వర్యంలో ఈఏపీసెట్‌-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు. కంప్యూటర్‌ ఆధారిత విధానం (సీబీటీ)లో వచ్చే నెల 7,8 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ..9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. అన్ని పరీక్షలకు కలిపి ఇప్పటివరకు 3,54,843 మంది దరఖాస్తు చేసుకున్నారని, అగ్రికల్చర్‌, ఫార్మసీ దరఖాస్తుదారులకు సోమవారం నుంచే హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రక్రియ ప్రారంభమైందని, ఇంజినీరింగ్‌ వారు మే 1వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. ఈఏపీసెట్‌ నిర్వహణపై సోమవారం జేఎన్‌టీయూహెచ్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వీసీ కట్టా నరసింహారెడ్డి, సెట్‌ కన్వీనర్‌ డీన్‌ కుమార్‌, కో కన్వీనర్‌ విజయ్‌కుమార్‌, అరుణకుమారి తదితరులతో కలిసి లింబాద్రి వివరాలు వెల్లడించారు.

ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించం

ఈ పరీక్షల్లో తొలిసారి ముఖ గుర్తింపు (ఫేషియల్‌ రికగ్నిషన్‌) విధానం అమలుచేస్తున్నట్టు లింబాద్రి వెల్లడించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులో జతచేసిన ఫొటోను, అభ్యర్థి ముఖంతో సరిపోల్చి లోపలికి అనుమతిస్తామన్నారు. అభ్యర్థులను 90 నిమిషాల ముందే కేంద్రంలోకి అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభమయ్యే సమయం దాటి నిమిషం ఆలస్యమయినా అనుమతించబోమని తెలిపారు. ‘‘సెల్‌ఫోన్‌ సహా ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించం. నీళ్ల సీసాల వంటివీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల చేతులపై గోరింటాకు, పచ్చబొట్లు ఉంటే అనుమతించేది లేదు. విభజన చట్టం జూన్‌ 2వ తేదీ వరకు అమలులో ఉంటుంది. అంతకంటే ముందే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ విడుదలయినందున ఈ ఏడాది కూడా ఏపీ విద్యార్థులకు ఈఏపీసెట్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని’ లింబాద్రి స్పష్టం చేశారు. రూ.5 వేల ఆలస్య రుసుంతో మే 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.

అగ్రికల్చర్‌, ఫార్మసీకి 135.. ఇంజినీరింగ్‌కు 166 కేంద్రాలు

రాష్ట్రంలో హైదరాబాద్‌, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, నర్సంపేటలో, ఏపీలో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులలో మొత్తం 135 కేంద్రాల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ, 166 కేంద్రాల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

గుర్తింపు కార్డు తప్పనిసరి

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను ముఖ గుర్తింపుతోపాటు.. బయోమెట్రిక్‌ విధానంలో ఫోటో, కుడిచేతి వేలిముద్ర ద్వారా సరిపోల్చి లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌, ఆన్‌లైన్‌ దరఖాస్తు పత్రంతోపాటు ఒక ఫోటో, బ్లాక్‌ లేదా బ్లూ పెన్‌ తెచ్చుకోవాలి. విద్యార్థి చదివిన కళాశాలకు చెందిన గుర్తింపు కార్డు లేదా ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, పాన్‌ కార్డు లేదా ఇతర ఆధారాల్లో ఒకటి తేవాలి. పరీక్ష హాలులో ఇన్విజిలేటర్‌ సమక్షంలో విద్యార్థులు హాల్‌టికెట్‌పై సంతకం చేయాలి.

హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ ఇలా..

హాల్‌టికెట్లు eapcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబరు, ఇంటర్‌ హాల్‌టికెట్‌ నంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని