Telangana Formation Day 2023: ‘దశ’దిశలా కీర్తిని చాటేలా
తెలంగాణ దశాబ్ది ప్రారంభ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం అవతరించాక అభివృద్ధి, సంక్షేమంతో సహా వివిధ రంగాల్లో అమలు చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారి భాగస్వామ్యంతో ఉత్సవాలను 21 రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది.
21 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సంబురాలు
తొమ్మిదేళ్ల పాలన ప్రస్ఫుటించేలా దశాబ్ది వేడుకలు
ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణ దశాబ్ది ప్రారంభ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం అవతరించాక అభివృద్ధి, సంక్షేమంతో సహా వివిధ రంగాల్లో అమలు చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారి భాగస్వామ్యంతో ఉత్సవాలను 21 రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం ఈ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ ఉద్యమం ద్వారా స్వరాష్ట్రం సిద్ధించాక తన ముద్రను చాటుకొనేలా చేపట్టిన కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని చెబుతున్న ప్రభుత్వం ఒక్కో రోజు ఒక్కో రంగంలో సాధించిన అభివృద్ధిని కళ్లకు కట్టేలా ఉత్సవాలను నిర్వహించనుంది. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం నుంచి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం సాగు, తాగు, పారిశ్రామిక, వైద్య తదితర రంగాల్లో చేసిన అభివృద్ధి, రైతుబంధు, రైతు బీమా, పరిపాలన వికేంద్రీకరణ ఇలా అనేక రంగాల్లో సాధించిన కృషిని వివిధ రూపాల్లో ప్రజలకు చెప్పనుంది. ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం... దీని ద్వారా తెలంగాణలోకి అత్యధిక ప్రాంతానికి సాగు నీరు అందించడం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు, వైద్య కళాశాలలు, ఆసుపత్రుల విస్తరణ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో సాధించిన పెట్టుబడులు, వచ్చిన ఉద్యోగాలు, నూతన సచివాలయం, యాదాద్రి ఆలయ నిర్మాణం, 125 అడుగుల డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, సమీకృత కలెక్టరేట్ భవనాలు, హరితహారం... ఇలా అనేక అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు. వరి సాగు, దిగుబడిలో తెలంగాణ అతి తక్కువ కాలంలో అనూహ్య ప్రగతి సాధించిన తీరునూ ఆవిష్కరించనుంది. అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేశామంటూ దశాబ్ది ఉత్సవాల్లో చాటిచెప్పనుంది. వీటితోపాటు ఇలాంటి అనేక కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లనుంది. వాటిలో కొన్ని ప్రధానమైనవి ఇలా ఉన్నాయి...
సంక్షేమ పంథా
సంక్షేమ రంగంలో అన్ని వర్గాల ప్రజలకు జీవన భద్రత, భరోసా, అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బర్రెలు, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, ఆత్మగౌరవ భవనాలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా, గిరిజన తండాలకు గ్రామ పంచాయతీల హోదా, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బ్రాహ్మణులకు విదేశీ విద్యానిధి, ఇంటింటికీ రక్షిత నీటిని ఇచ్చే మిషన్ భగీరథ, చిన్న నీటి వనరులకు జీవం పోస్తూ మిషన్ కాకతీయ... వంటి పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి. వీటికి ప్రతి సంవత్సరం రూ.50 వేల కోట్లకుపైగా వెచ్చిస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేయూత
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల విద్య, సామాజిక వికాసంతోపాటు ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. దళితులను వ్యాపార వర్గంగా మార్చేందుకు దళితబంధును ప్రవేశపెట్టి రూ.10 లక్షలను ఇస్తోంది. ఇప్పటికే 38,323 మందిని గుర్తించి వారికి రూ.3,832.30 కోట్లను అందించింది.
మహిళాభివృద్ధి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే మహిళలకు తగిన ఆర్థిక సహాయం అందించడంతోపాటు తల్లీబిడ్డలకు అవసరమైన వస్తువులను ఉచితంగా అందించే కేసీఆర్ కిట్ పథకాన్ని 2017 జూన్ రెండు నుంచి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. గర్భిణుల్లో రక్తహీనత, పోషకార లోపాలను నియంత్రించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పథకానికి రూపకల్పన చేసింది. దవాఖానాలకు పరీక్షల కోసం వెళ్లే గర్భిణులు, శిశువులకు అమ్మ ఒడి రవాణా సేవలు అందించేందుకు 300 వాహనాలను సమకూర్చింది. ఆరోగ్యలక్ష్మి ద్వారా అంగన్‌వాడీల్లో గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని వేడివేడిగా అందిస్తోంది. ఆరు నెలల నుంచి 5 సంవత్సరాలలోపు పేద పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడకుండా బాలామృతం ప్లస్ పేరిట బలవర్ధక ఆహారాన్ని ఇస్తోంది.
వ్యవసాయం, అన్నదాతలకు అండదండలు
వ్యవసాయరంగ అభివృద్ధి, రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధు, రైతు బీమా, పంట రుణాలు మాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత విద్యుత్తు, గోదాముల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వంటి ఎన్నో చర్యలు తీసుకుంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను వ్యవసాయశాఖ ఎండాకాలంలోనే తెప్పించి, గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచుతోంది. వాటిని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతు ముంగిటకే రాయితీపై అందజేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. 2018 నుంచి మే 2023 నాటికి 10 విడతల్లో 65,00,588 మంది రైతులకు రూ.65,910.32 కోట్లను అందజేసింది. రైతులు మృతిచెందితే రైతుబీమా అమలు చేస్తోంది. ఇప్పటివరకు లక్ష రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల బీమా సాయం అందింది. వ్యవసాయానికి తొమ్మిదేళ్లుగా 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తోంది.
నీటి పారుదల
ప్రపంచంలోనే ఎత్తైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది. దీని కింద పాత ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్త ఆయకట్టుకు నీరిస్తోంది. ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయడం, సింగూరు వెనకతట్టులో రెండు ఎత్తిపోతల పథకాలను చేపట్టి వెనకబడిన ప్రాంతాలకు నీరందించడం, హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా... ఇలా అనేక లక్ష్యాలను ఈ పథకం ద్వారా సాధించింది. సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్ బ్యారేజి పనులు చివరి దశకు వచ్చాయి. తుపాకుల గూడెం బ్యారేజి నిర్మాణం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ పనులను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించింది. దాంతో చెరువుల్లో నీటితోపాటు భూగర్భ జలమట్టమూ గణనీయంగా పెరిగింది.
వైద్యం, ఆరోగ్యం
ప్రజల ఆరోగ్య సంరక్షణ, వైద్యారోగ్యరంగాల అభివృద్ధి లక్ష్యంగా నగరాల్లో బస్తీ, గ్రామాల్లో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. కంటివెలుగు ద్వారా కంటిచూపు సమస్యల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఉచిత కంటి పరీక్షలు చేయించి, కళ్లద్దాలను అందించింది. రాష్ట్రవ్యాస్తంగా 20 తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌ల ద్వారా 60 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తోంది. తెలంగాణలో 2014 నాటికి 700 ఎంబీబీఎస్ సీట్లతో కేవలం అయిదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి (ఉస్మానియా, గాంధీ, వరంగల్ కాకతీయ, ఆదిలాబాద్ రిమ్స్). రాష్ట్రం ఏర్పడ్డాక సిద్దిపేట, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండం, నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌లలో కళాశాలలు మంజూరయ్యాయి. ప్రస్తుతం 26 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 4,440 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
పారిశ్రామిక, ఐటీ రంగాలు
పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తెలంగాణ పురోగమించింది. టీఎస్ ఐపాస్ ద్వారా తొమ్మిదేళ్లలో రూ.2,61,732 కోట్ల పెట్టుడులతో 23,065 పరిశ్రమలు రాగా 15.74 లక్షల మందికి ఉపాధి కలిగింది. ఐటీ రంగంలోనూ ఎగుమతులు రూ. 1,83,569 కోట్లకు చేరగా... 7.78 లక్షల మందికి ఉపాధి లభించింది. ఇందులో 26.14% వృద్ధిరేటును సాధించింది. టీహబ్, టీవర్క్స్, టీఎస్‌ఐసీ వంటి వాటి ద్వారా పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతమిచ్చింది. వీటితోపాటు పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, రోడ్ల అభివృద్ధి ఇలా అన్ని రంగాల్లో చేసిన ప్రగతి పనుల గురించి ప్రజలకు వివరించనుంది.
దశాబ్ది వేడుక.. ‘నవ’ధాన్యాల కానుక!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కళాకారులు నవధాన్యాలతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ పార్థసారథిరెడ్డి చిత్రాలను తీర్చిదిద్దారు. మొదట ప్లైవుడ్ షీట్లపై పెన్సిల్‌తో ఆర్ట్ వేసిన కళాకారులు జి.బాలకృష్ణ, ఆయన కుమార్తెలు నిర్మలాసాయిశ్రీ, సౌజన్య తదితరులు నవధాన్యాలను వినియోగించి వారి చిత్రాలకు చూడచక్కని రూపం కల్పించారు.
ఈనాడు, ఖమ్మం
త్రివర్ణ సాగరం
రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా త్రివర్ణ కాంతులతో వెలుగులీనుతున్న నాగార్జునసాగర్ డ్యాం
న్యూస్‌టుడే, నాగార్జునసాగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.