అడవులపై గొడ్డలివేటు

ప్రపంచవ్యాప్తంగా అటవీ క్షీణత ఆగడం లేదు. అభివృద్ధి కార్యకలాపాలు, మానవ చర్యలు అడవుల విధ్వంసానికి దారితీస్తున్నాయి. ప్రస్తుతం మండుతున్న ఎండలకు అడవులు భగ్గుమంటున్నాయి. కార్చిచ్చుల బారిన పడి దహనమవుతున్నాయి. అడవులను పరిరక్షించుకోవడం మానవాళి బాధ్యత.

Published : 29 Apr 2024 00:24 IST

ప్రపంచవ్యాప్తంగా అటవీ క్షీణత ఆగడం లేదు. అభివృద్ధి కార్యకలాపాలు, మానవ చర్యలు అడవుల విధ్వంసానికి దారితీస్తున్నాయి. ప్రస్తుతం మండుతున్న ఎండలకు అడవులు భగ్గుమంటున్నాయి. కార్చిచ్చుల బారిన పడి దహనమవుతున్నాయి. అడవులను పరిరక్షించుకోవడం మానవాళి బాధ్యత.

కృత్రిమంగా మొక్కలు నాటడంద్వారా పెంచినవి కాకుండా, సహజసిద్ధంగా విత్తన వ్యాప్తి ద్వారా పెరిగిన అడవులను ప్రాథమిక అడవులుగా పరిగణిస్తారు. వందలు, వేల ఏళ్లుగా సహజ సిద్ధంగా పెరిగిన ఇలాంటి అడవులు ఎన్నో స్థానిక వృక్ష, జంతు జాతులను కలిగి ఉంటాయి. జీవ వైవిధ్యానికి ఆలవాలంగా మారతాయి. నీటి వడపోతకు, నిల్వకు, నేల సంరక్షణకు, కర్బనాలను గ్రహించడానికి దోహదపడతాయి. అంతేకాదు... వరదల నియంత్రణకు, వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రాథమిక అడవులు ఎంతగానో ఉపకరిస్తాయి. ప్రపంచ వనరుల సంస్థ ‘గ్లోబల్‌ ఫారెస్ట్‌ వాచ్‌’ ప్రాజెక్ట్‌ ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక అడవులు 91లక్షల ఎకరాల మేర నశించాయి. ఇది ప్రతి నిమిషానికి పది ఫుట్‌బాల్‌ మైదానాల పరిమాణంలో జరిగే అటవీనష్టానికి సమానం. ఫలితంగా 240కోట్ల టన్నుల మేర కార్బన్‌ డై ఆక్సైడ్‌ వాతావరణంలో మిగిలిపోయిందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అటవీ విస్తీర్ణంలో సంభవించే మార్పులను తెలుసుకోవడానికి, నివారణ చర్యలు తీసుకోవడానికి ఈ గణాంకాలు ఉపయోగపడతాయి. ఈ ప్రాజెక్టు ప్రపంచ అటవీ విస్తీర్ణాన్ని ఉపగ్రహాలు తదితర మార్గాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంది.

తరిగిపోతున్న వన సంపద

బొలీవియా, లావోస్‌, నికరాగువాలలో 2022తో పోలిస్తే 2023లో ప్రాథమిక అడవులకు నష్టతీవ్రత అధికంగా నమోదైంది. బొలీవియాలో అటవీనష్టం గతేడాదికన్నా 27శాతం పెరిగింది. ప్రధానంగా సాగు అవసరాలు, పశువుల పెంపకానికే అడవులు నాశనమయ్యాయి. లావోస్‌లో సాగు విస్తరణ ఫలితంగా అడవులు తరిగిపోతున్నాయి. లావోస్‌ నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే చైనా- అక్కడ పెడుతున్న పెట్టుబడులు వ్యవసాయ భూముల విస్తృతికి, తద్వారా అటవీ నష్టం పెరుగుదలకు కారణమవుతున్నాయి. నికరాగువా 2023లో 4.2శాతం ప్రాథమిక అడవులను కోల్పోయింది. వ్యవసాయం, పశుపెంపకం, బంగారు గనుల తవ్వకం తదితరాలు నష్టానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కాంగోలో ఏటా పన్నెండున్నర లక్షల ఎకరాలకు పైగా ప్రాథమిక అడవులు నాశనమవుతున్నాయి. వ్యవసాయం, కర్ర బొగ్గు ఉత్పత్తి, స్థానిక ప్రజలకు ఆహారం, ఇంధన అవసరాలకు అడవులే ఆధారం కావడం తదితర కారణాలు అటవీ నష్టానికి దారితీశాయి. ఇండొనేసియాలో కూడా గతేడాదితో పోలిస్తే 27శాతం అధికంగా నష్టం వాటిల్లింది. 2023లో ఎల్‌నినో కారణంగా సంభవించిన కార్చిచ్చులతోపాటు, వ్యవసాయం, పామాయిల్‌, కాగితం వంటి పరిశ్రమ ఆధారిత ప్లాంటేషన్ల పెంపకంతో అడవులు నాశనమయ్యాయి. బ్రెజిల్‌, కొలంబియాలలో 2022తో పోలిస్తే 2023లో అటవీనష్టం వరసగా 36శాతం, 49శాతం మేర తగ్గుముఖం పట్టింది. బ్రెజిల్‌లో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలతో అటవీనష్టం తగ్గింది. కొలంబియాలో పర్యావరణ సంరక్షణ చర్యలు, తదితర కారణాలతో నష్టం తగ్గింది. ప్రపంచంలో జీవవైవిధ్యానికి పేరొందిన, వాతావరణ మార్పుల తీవ్రతను తగ్గించగలిగే అమెజాన్‌ ప్రాంతంలో 39శాతం మేర అటవీనష్టం తగ్గడం శుభపరిణామమే. కెనడా, అలస్కా, రష్యా, స్కాండినేవియా తదితర దేశాల్లో వ్యాపించిన బోరియల్‌ అడవులు 2023లో 24శాతం అధికంగా నష్టపోయాయి. సుమారు ఏడుకోట్ల ఎకరాలమేర నష్టం వాటిల్లింది.

ఎలా నివారించాలంటే...

ఇటీవల భారత సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణకు సంబంధించిన ఒక కేసులో వెలువరించిన తీర్పులో అటవీ భూమి తనదేనంటూ ఒక వ్యక్తి చేసిన వాదనను తిరస్కరించింది. అది అటవీ భూమేనని స్పష్టంచేస్తూ, అడవుల ప్రాధాన్యాన్ని విశదీకరించింది. అడవుల ఆత్మ ధరిత్రిని నడిపిస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ భూమి మానవుడికి చెందదని, మానవుడే భూమికి చెందుతాడని పేర్కొంది. జీవజాలానికి మానవుడు తలపెడుతున్న కీడు, తనకు తాను చేసుకుంటున్న నష్టమేనని స్పష్టం చేసింది. ప్రకృతిలో మానవుడే మేధోజాతిగా ఉద్భవించినందువల్ల మిగతా జీవరాశి మొత్తానికి, భూమికి ధర్మకర్తగా వ్యవహరించాలని, మనిషి ప్రస్తుతం అనుసరిస్తున్న మానవ కేంద్రీకృత విధానం నుంచి పరిసరాల కేంద్రీకృత విధానం వైపు మరలాల్సిన అవసరం ఉందని సూచించింది. అడవులు జాతీయ సంపద, కాలుష్యరహిత వాతావరణంలో జీవించే హక్కును రాజ్యాంగం వ్యక్తులకు కల్పిస్తుందని, అందుకు అడవులు అవసరమని న్యాయస్థానం పేర్కొంది. ప్రకృతి వనరులకు ప్రభుత్వం ధర్మకర్త అనీ, వాటిని రక్షించే చట్టబద్ధమైన విధి ప్రభుత్వానిదేనని, ప్రైవేటు లాభాల కోసం కాకుండా, దీర్ఘకాలిక ప్రజాహక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించింది. భారత రిజర్వు బ్యాంక్‌ను ఉటంకిస్తూ, వాతావరణ మార్పుల కారణంగా పెరిగే ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో కలిగే మార్పుల వల్ల దేశ స్థూలదేశీయోత్పత్తి 2.8శాతం తగ్గుతుందని, 2050నాటికి దేశ సగం జనాభా జీవన ప్రమాణాలు తగ్గనున్నాయని, 2030 నాటికి 3.4కోట్ల మంది ఉపాధి కోల్పోనున్నారని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో అన్ని దేశాలూ అటవీ నష్టానికి దారితీసే చర్యలను నివారించాలి. అడవులను సంరక్షిస్తున్న వర్గాలను ఆర్థికంగా ప్రోత్సహించాలి. స్థానిక సమాజాలు తమ అవసరాల కోసం అడవులపై ఆధారపడటాన్ని తగ్గించేలా చర్యలను తీసుకోవాలి. అలాంటివారికి ప్రత్యామ్నాయాలను చూపాలి. అప్పుడే, 2030 నాటికి అటవీ నష్టాన్ని నిలువరించాలంటూ ‘కాప్‌-26’ సదస్సు సందర్భంగా నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా ప్రయాణించడం సాధ్యమవుతుంది.


భారత్‌లో పరిస్థితి...

భారత్‌లో 2002-23 సంవత్సరాల మధ్య పది లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ప్రాథమిక అడవులు అంతర్ధానమయ్యాయి. దేశంలో 2001-23 మధ్యకాలంలో సుమారు 58 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ, అటవీయేతర ప్రాంతాల్లోని వృక్ష సంపదకు నష్టం వాటిల్లింది. 2023లో మూడు లక్షల ఎకరాలకుపైగా అడవులు అంతరించాయి. వృక్షాల నరికివేత అడవుల తరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. అస్సామ్‌, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌ రాష్ట్రాలు అత్యధికంగా వృక్ష సంపదను కోల్పోయాయి. 2002-22 సంవత్సరాల మధ్యకాలంలో దేశంలో 89వేల ఎకరాల అడవులు కార్చిచ్చుల కారణంగా నాశనమయ్యాయి. ఒడిశాలో కార్చిచ్చులతో అత్యధిక నష్టం సంభవించగా- అరుణాచల్‌, నాగాలాండ్‌ ఆ తరవాతి స్థానాల్లో నిలిచాయి. ఇటీవలి కాలంలో తెలంగాణలో సైతం భారీ నష్టం వాటిల్లింది.


ఎం.రామ్‌మోహన్‌
(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.