పురుషాహంకార రాజకీయాలు

రాజకీయ నాయకుల వ్యవహార శైలి, హుందాతనమే ప్రజాస్వామ్య ప్రక్రియ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేస్తాయి. కొంతమంది నేతల మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై విచక్షణ మరిచి చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి.

Published : 30 Apr 2024 00:16 IST

రాజకీయ నాయకుల వ్యవహార శైలి, హుందాతనమే ప్రజాస్వామ్య ప్రక్రియ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేస్తాయి. కొంతమంది నేతల మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై విచక్షణ మరిచి చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి. తాజాగా ఏపీ సీఎం జగన్‌ తన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలపాలయ్యాయి.

రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో కొంతమంది నేతలు హద్దుమీరి వ్యవహరిస్తున్నారు. నేతల పరస్పర దూషణల పర్వం ప్రజాస్వామ్యానికి చేటుగా మారుతోంది. ప్రధానంగా మహిళా అభ్యర్థుల విషయంలో కొంతమంది నాయకులు నోటిదురుసు ప్రదర్శిస్తున్నారు. స్త్రీలను అవమానపరచేలా, వారి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగుతుండటం ఆందోళనకరం. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్‌ మహిళా నేత సుప్రియ శ్రీనేత్‌ సామాజిక మాధ్యమం వేదికగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన ఖాతాలో ఇతరులెవరో పోస్టు చేశారని సంజాయిషీ ఇచ్చుకున్నా- నష్టం జరిగిపోయింది. ఆ అభ్యంతరకర వ్యాఖ్యలు భాజపా, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. ఆ ఉదంతం మరవకముందే నటి, ఎంపీ, మధుర లోక్‌సభ భాజపా అభ్యర్థి హేమమాలినిపై కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై కంగనా రనౌత్‌ సైతం ఘాటుగా స్పందించారు. మహిళలపై నీచమైన అభిప్రాయం కలిగిన కాంగ్రెస్‌ నేతలు ఓటమి తప్పదన్న భయంతోనే దిగజారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే శివశంకరప్ప, దేవనగరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి, తన కోడలు ప్రభామల్లికార్జున్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థినిపై కించపరిచేలా వ్యాఖ్యానించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘ఆమెకు మాట్లాడటం కూడా సరిగ్గా రాదు... కిచెన్‌లో వంట ఎలా చేయాలో మాత్రమే తెలుసు’ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆక్షేపణలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసే విషయంలో భాజపా నేతలూ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీని ఉద్దేశించి కొన్నిరోజుల క్రితం ఆ రాష్ట్ర భాజపా నాయకుడు దిలీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘గోవాకు వెళ్తే గోవా కుమార్తెనని, త్రిపురకు వెళ్తే త్రిపుర కుమార్తెనని చెప్పుకొంటారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘంతో పాటు సొంతపార్టీ సైతం కన్నెర్రజేసింది. తమ మాటలను వక్రీకరించారంటూ ఆయా నేతలు కప్పిపుచ్చుకొనేందుకు యత్నిస్తున్నా- అప్పటికే ఆ నాయకులకు, పార్టీలకు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. గతంలోనూ పలువురు నాయకులు ప్రత్యర్థి పార్టీల మహిళా నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై, జయప్రదపై, హేమమాలినిపై చేసిన వ్యాఖ్యలు వివాదాలు రేపాయి. మహిళల వస్త్రధారణ, అత్యాచారాలపై పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి.

భారత్‌లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు శ్రుతి మించుతున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో 95 మంది మహిళా నేతలపై వచ్చిన ట్వీట్లను పరిశీలించింది. భారత రాజకీయాల్లో పురుషాహంకార ధోరణి మితిమీరిపోతోందని ఆ సంస్థ కుండ బద్దలుకొట్టింది. మూడు నెలల కాలంలో ఆ మహిళా నేతలకు వచ్చిన 1.14 లక్షల ట్వీట్లలో 13.8శాతం అభ్యంతరకరమైన దుర్భాషతో కూడినవేనని వివరించింది. యూకే, అమెరికాలతో పోలిస్తే భారత్‌లోని మహిళా నేతలపై లింగపరమైన దుర్విచక్షణ ఎక్కువేనని వెల్లడించింది. అన్ని పక్షాల నేతలూ సాటి మహిళా నేతలపై హుందాగా వ్యవహరించాల్సిన అవసరముంది. వ్యక్తిత్వ హననం, మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆరోపణల జోలికి వెళ్ళకుండా నిర్మాణాత్మక విమర్శలకే ప్రాధాన్యమివ్వాలి. మహిళలను అవమానించేలా మాట్లాడితే తమ వ్యక్తిగత గౌరవంతోపాటు పార్టీ ప్రతిష్ఠ మసకబారుతుందన్న విషయాన్ని గుర్తించాలి. మారుతున్న పరిస్థితుల్లో స్త్రీల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడకుండా నిరోధించాలి. వారి రక్షణ, సంక్షేమానికి తీసుకునే చర్యలను వనితలకు వివరించాలి.

 ప్రభాకర్‌రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.