Ukraine Crisis: ఈ దారుణాన్ని పుతిన్‌కు చూపించండి

అది ఉక్రెయిన్‌లో తీరప్రాంత నగరమైన మేరియుపొల్‌. ఓ వైపు ముందుకు దూసుకొచ్చేందుకు రష్యా సేనల యత్నాలు. బాంబులు, తుపాకుల హోరు. మరోవైపు, ప్రాణాలైనా అర్పించి వారిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌ సైనికుల వీరోచిత యత్నాలు. ఈ క్షణమున్న ప్రాణం.. మరు క్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి.. సరిగ్గా అదే సమయంలో రష్యా దాడుల్లో అత్యంత తీవ్రంగా గాయపడిన

Updated : 01 Mar 2022 05:46 IST

మేరియుపొల్‌ వైద్యుడి ఆక్రోశం

అది ఉక్రెయిన్‌లో తీరప్రాంత నగరమైన మేరియుపొల్‌. ఓ వైపు ముందుకు దూసుకొచ్చేందుకు రష్యా సేనల యత్నాలు. బాంబులు, తుపాకుల హోరు. మరోవైపు, ప్రాణాలైనా అర్పించి వారిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌ సైనికుల వీరోచిత యత్నాలు. ఈ క్షణమున్న ప్రాణం.. మరు క్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి.. సరిగ్గా అదే సమయంలో రష్యా దాడుల్లో అత్యంత తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల చిన్నారిని తీసుకుని నగరంలోని ఓ ఆసుపత్రికి అంబులెన్స్‌ దూసుకొచ్చింది. అప్పటికే ఆమె ముఖం వివర్ణమైంది. రాగి రంగులోని ఆమె కేశాలను వెనక్కి కట్టి రబ్బరు బ్యాండ్‌ పెట్టారు. బాలిక దుస్తులు రక్తంతో పూర్తిగా తడిసిపోయాయి. ఆమె పక్కనే కూర్చున్న తండ్రి తలకూ తీవ్రగాయమైంది. ఆయినా ఆయన ఆందోళన అంతా తన కనుపాప పైనే. ఆసుపత్రి ఆవరణలోకి అంబులెన్స్‌ రాగానే ఒక్కసారిగా లోపలకు వెళ్లిన వైద్య బృందం.. ఆమె శ్వాసను పునరుద్ధరించడానికి ఛాతీపై బలంగా నొక్కుతోంది. అంబులెన్స్‌ వెలుపల నుంచి ఇదంతా చూస్తున్న చిన్నారి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ‘‘ఆమెను బయటకు తీసుకురండి.. మనం కాపాడగలం’’ అంటూ మరో వ్యక్తి స్ట్రెచర్‌ను అంబులెన్స్‌లోకి నెడుతూ గట్టిగా అరిచాడు. అనంతరం ఆ చిన్నారిని ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లగా వైద్యులు, నర్సులు చుట్టుముట్టారు. ఒకరు ఇంజెక్షన్‌ చేశారు. మరొకరు డీఫిబ్రిలేటర్‌తో ఛాతీకి పలుమార్లు షాక్‌ ఇచ్చారు. గాయాల కారణంగా చిన్నారి శరీరానికి అంటిన రక్తాన్ని మరో నర్సు తుడుస్తోంది. ఓ వైద్యుడు ఆక్సిజన్‌ అమర్చుతూ.. ఈ దారుణాన్ని పుతిన్‌కు చూపించండంటూ పక్కనే ఉన్న వీడియో జర్నలిస్ట్‌ను (ఆసుపత్రి లోపలకు ఆయన్ను అనుమతించారు) ఉద్దేశించి గట్టిగా అరిచారు. వైద్యులు, నర్సులు ఇలా కొద్దిసేపు సర్వశక్తులూ వెచ్చించినా.. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోయారు. చివరకు ఆ వైద్యుడే చిన్నారి ముఖంపై నెమ్మదిగా నిమురుతూ తెరిచి ఉన్న కళ్లను మూసేశారు.

-మేరియుపొల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని