IPL 2024 - Hybrid Pitch: హైబ్రిడ్‌ పిచ్‌ల మీద ఐపీఎల్‌ మ్యాచ్‌లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?

SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్‌ మ్యాచుల్లో హైబ్రిడ్‌ పిచ్‌లను వాడనున్నారు. ఏంటా పిచ్‌లు, ఎందుకు వాడుతున్నారు?

Updated : 04 May 2024 09:57 IST

SisGrass Hybrid Pitch I ఐపీఎల్‌-17లో ఇప్పటికే నిబంధనల రూపంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమైంది. హిమచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల (Dharamshala)లో జరిగే ఓ రెండు ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌ల్లో హైబ్రిడ్‌ పిచ్‌లు ఉపయోగించబోతోంది. ఈ టోర్నీలో 200పైన స్కోర్లు తరచూ నమోదవుతున్నాయి. 200+ లక్ష్యం కూడా నిలవట్లేదు. ఈ పరిస్థితుల్లో బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించాలన్న ఉద్దేశంతో ఈ హైబ్రిడ్‌ పిచ్‌లను రూపొందిస్తున్నారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో వచ్చే ఫలితాలను బట్టి మున్ముందు మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి ట్రాక్‌లనే వాడే అవకాశాలు ఉన్నాయి.

బాదుడే బాదుడు

ఐపీఎల్‌ అంటేనే సిక్సర్లు, ఫోర్లే. ఎంత టీ20 అయితే మాత్రం పిచ్‌లు బ్యాటర్లకు మాత్రమే సహకరిస్తే ఇంకా బౌలర్లు బంతులు వేయడం ఎందుకు! ఏకపక్షంగా ఒకరి వైపే మ్యాచ్‌లు ఉంటే మజా ఏం ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్‌ 17లో మ్యాచ్‌లను చూస్తే ఎక్కువశాతం బాదుడే కనిపిస్తుంది. బౌలర్లకు అవకాశం చాలా తక్కువగా ఉంటోంది. రెండు బౌన్సర్ల నిబంధన తప్ప.. వారికి ఉపయోగపడేలా ఏదీ లేదు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 51 మ్యాచ్‌లు జరిగితే అందులో 30 ఇన్నింగ్స్‌ల్లో 200+ స్కోర్లు నమోదయ్యాయి. 12 సార్లు 190-200 మధ్య స్కోర్లు రికార్డు అయ్యాయి. బౌలర్‌ అంటే బ్యాటర్లకు లెక్కే ఉండట్లేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అయితే ఏకంగా రెండుసార్లు ఐపీఎల్‌ అత్యధిక జట్టు స్కోరు రికార్డును తుడిచిపెట్టింది. సిక్స్‌లు బాదేస్తుంటే అభిమానులకు పండగలాగే ఉంటుంది కానీ, మరీ ఏకపక్షంగా బాదుతుంటే బంతికి, బ్యాటుకి మధ్య సమతూకం లేక బోర్‌ కూడా కొడుతుంది. 

ముఖ్యంగా ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్లను సన్‌రైజర్స్‌ నాలుగు మ్యాచ్‌ల వ్యవధిలో రెండుసార్లు సాధించిందంటే బంతి ఏ స్థాయిలో తాండవం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరుతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 287 పరుగులు చేస్తే.. బెంగళూరు కూడా తానేం తక్కువ తినలేదన్నట్లు దాదాపు కొండంత లక్ష్యాన్ని ఛేదించినంత పని చేసింది. ఆ జట్టు 262 పరుగులు సాధించింది. ఇక కోల్‌కతా 223 పరుగులు చేస్తే.. రాజస్థాన్‌ ఆఖరి బంతికి ఛేదించి ఔరా అనిపించింది. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో కోల్‌కతా 222 పరుగులు సాధిస్తే.. బెంగళూరు కూడా దాదాపు కొట్టేసినంత పని చేసి ఒకేఒక్క పరుగు తేడాతో ఓడింది. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ భారీ స్కోర్ల మ్యాచ్‌ల్లో బౌలర్లు దారుణంగా తేలిపోయారు. పిచ్‌ నుంచి సహకారం ఏమాత్రం లేకపోవడంతో ఒక్క మంచి బంతిని కూడా వేయలేకపోయారు. 

సిస్‌గ్రాస్‌ సాయంతో..

బంతికి, బ్యాటుకి మధ్య సమతూకం కోసం సిస్‌గ్రాస్‌ (SisGrass) సంస్థ రూపొందిస్తున్న హైబ్రిడ్‌ పిచ్‌ (Hybrid Pitch)లు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ట్రాక్‌లలో సహజసిద్ధమైన గడ్డితో పాటు అయిదుశాతం పాలిమర్‌ కలిసి ఉంటుంది. దీనివల్ల బౌలర్లు స్థిరమైన బౌన్స్‌ రాబట్టొచ్చు. పిచ్‌ చాలాసేపు తాజాగా ఉంటుంది. దీంతో బౌలర్లు కూడా సమర్థవంతంగా బంతులు వేయగలుగుతారు. యూనివర్సల్‌ అనే యంత్రం సాయంతో ఇప్పటికే ధర్మశాల స్టేడియంలో ఈ హైబ్రిడ్‌ ట్రాక్‌ పనులు మొదలుపెట్టారు. 

ధర్మశాల స్టేడియాన్ని రెండో హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న పంజాబ్‌ కింగ్స్‌ జట్టు మే 5న చెన్నై సూపర్‌కింగ్స్‌తో.. మే 9న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఈ హైబ్రిడ్‌ పిచ్‌లపై ఆడబోతోంది. ఈ మ్యాచ్‌ల ఫలితాలను బట్టి మున్ముందు మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి పిచ్‌లు తయారుచేయడానికి బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ఐసీసీ కూడా ఇప్పటికే టీ20, వన్డేల్లో హైబ్రిడ్‌ పిచ్‌ల వాడకానికి ఆమోదం తెలపడంతో త్వరలో అంతర్జాతీయస్థాయిలోనూ ఈ పిచ్‌లపై మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్‌లో హైబ్రిడ్‌ పిచ్‌లపై టీ20, వన్డే మ్యాచ్‌లే కాదు నాలుగు రోజుల కౌంటీ మ్యాచ్‌లు కూడా ఆడుతున్నారు. ఈనేపథ్యంలో హైబ్రిడ్‌ ప్రయోగం మన ఐపీఎల్‌లో ఎలాంటి ఫలితాలు ఇస్తుందనేది ఆసక్తికరం.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని