Prigozhin Death: కొత్తేముందన్న బైడెన్‌.. ఇంత లేట్ అవుతుందనుకోలేదన్న మస్క్‌

వాగ్నర్ గ్రూప్‌ చీఫ్ ప్రిగోజిన్ మృతి(Prigozhin Death)పై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు, టెస్లా సీఈఓ స్పందించారు. 

Updated : 24 Aug 2023 15:00 IST

వాషింగ్టన్‌: వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్‌(62)(Wagner mercenary chief Yevgeny Prigozhin) బుధవారం విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆ విమాన ప్రయాణికులు జాబితాలో ప్రిగోజిన్‌(Prigozhin) పేరు ఉందని అధికారులు తెలిపారు. అతడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin)పై తిరుగుబాటు ప్రకటించి.. ఆ తర్వాత వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన విమాన ప్రమాదంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతడి మృతిపై ప్రపంచవ్యాప్తంగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఈ విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden) మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన వెనక వాస్తవాలు తనకు తెలియదన్నారు. ‘కానీ దీనిపై నేనేమీ ఆశ్చర్యపోలేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ ఘటన వెనక పుతిన్‌ హస్తం ఉందనేలా నర్మగర్భంగా మాట్లాడారు. గతంలో కూడా ప్రిగోజిన్‌పై విషప్రయోగం జరగొచ్చనేలా బైడెన్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ విమాన ప్రమాదంపై టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్ తనదైన శైలిలో ఓ నెటిజన్‌కు బదులిచ్చారు. ఎక్కువ సమయం పట్టలేదని ఆ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేయగా.. ‘నేను ఊహించినదానికంటే ఆలస్యమైంది. మానసిక యుద్ధ తంత్రం కూడా కావచ్చనిపిస్తోంది’ అంటూ మస్క్‌(Musk) రాసుకొచ్చారు.  

పసిఫిక్‌ సముద్రంలోకి అణుజలాలు విడుదల మొదలు..!

ప్రిగోజిన్‌ ప్రైవేటు జెట్‌ విమానం మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, విమానంలోని మొత్తం ప్రయాణికులు మరణించారని రష్యా పేర్కొంది. ప్రయాణికుల జాబితాలో ప్రిగోజిన్‌ పేరు ఉందని రష్యా అత్యవసర విభాగం అధికారులు ధ్రువీకరించారు. 

జూన్‌లో ప్రిగోజిన్ చేసిన తిరుగుబాటును పుతిన్‌.. దేశద్రోహ చర్యగా అభివర్ణించారు. బెలారస్ మధ్యవర్తిత్వంతో అతడు తిరుగుబాటు సద్దుమణిగింది. ఆ తర్వాత పుతిన్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయనపై ఉన్న కేసుల్ని ఎత్తివేశారు. ప్రస్తుతం విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని