China: భారత్‌ పర్యటనకు చైనా రక్షణ మంత్రి

గల్వాన్‌ ఘర్షణ తర్వాత తొలిసారి చైనా రక్షణశాఖ మంత్రి భారత్‌ పర్యటనకు రానున్నారు. వచ్చేవారం జరగనున్న ఎస్‌సీవో భేటీ కోసం ఆయన న్యూదిల్లీకి వస్తున్నారు. 

Published : 23 Apr 2023 14:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China) రక్షణ మంత్రి లీషాంగ్‌ఫూ, రష్యా(Russia) డిఫెన్స్‌ మినిస్టర్‌ సెర్గీ షోయగులు భారత్‌లో పర్యటించనున్నారు. వీరు వచ్చే వారం న్యూదిల్లీలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌(SCO) మీటింగ్‌లో పాల్గొనున్నారు. ఈ విషయాన్ని ఆయా దేశాలు ధ్రువీకరించాయి. ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశం ఏప్రిల్‌ 27, 28 తేదీల్లో భారత్‌లో జరగనుంది. ఈ సమావేశానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించనున్నారు. ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, ఆఫ్గానిస్థాన్‌లోని భద్రతా పరిస్థితి వంటి అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసీఫ్‌ను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించారు. కానీ, ఇప్పటి వరకు పాక్‌ మంత్రి హాజరుపై ఎటువంటి ధ్రువీకరణ రాలేదు.

2020లో గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా రక్షణ మంత్రి భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. ఓ వైపు సరిహద్దుల్లో కొన్ని పాయింట్ల వద్ద ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్న సమయంలో  లీషాంగ్‌ పర్యటన జరగనుంది. మరోవైపు గతేడాది కూడా తవాంగ్‌ సెక్టార్‌లో యాంగత్సే వద్ద భారత్‌-చైనా దళాలు ఘర్షణపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లీషాంగ్‌ఫూ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది. మరోవైపు రష్యా రక్షణ మంత్రి షోయిగు కూడా ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక తొలిసారి భారత్‌లో పర్యటించనున్నారు. భారత్‌-రష్యాల మధ్య ఉన్నత స్థాయిలో జరుగుతున్న సమావేశాల్లో ఇది కూడా భాగంగా నిలవనుంది.  

మే 5వ తేదీ నుంచి గోవాలో జరగనున్న ఎస్‌సీవో విదేశాంగ మంత్రుల సమావేశానికి మాత్రం పాక్‌మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ హాజరుకానున్నారు. ఈ మేరకు ఇప్పటికే పాక్‌ నుంచి అధికారిక ధ్రువీకరణ వచ్చింది. కానీ, అదే సమయంలో పూంచ్‌లో సైనిక వాహనంపై దాడి జరిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దర్యాప్తులో పాక్‌ పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభ్యమైతే పరిస్థితి ఇబ్బందికరంగా మారవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని