Donald Trump: యూఎస్‌ క్యాపిటల్‌పై దాడి ఘటన: తాను నిర్దోషినని కోర్టులో పేర్కొన్న ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని నేరాభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాను నిర్దోషినని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థిని వేధించడం కోసమే ఈ అభియోగాలు నమోదు చేశారని తెలిపారు. వాషింగ్టన్‌ ఫెడరల్‌ కోర్టుకు ట్రంప్‌ గురువారం హాజరయ్యారు.

Updated : 04 Aug 2023 12:43 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని నేరాభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాను నిర్దోషినని పేర్కొన్నారు. తనపై మోపిన అభియోగాలను ఆయన అంగీకరించలేదు. ఈ కేసు రాజకీయ ప్రత్యర్థినైన తనని వేధించడం కోసమేనని అన్నారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకు 2021 జనవరిలో క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని వాషింగ్టన్‌ ఫెడరల్‌ కోర్టులో అభియోగాలు నమోదు అయ్యాయి. విచారణలో భాగంగా ట్రంప్‌ గురువారం కోర్టుకు హాజరయ్యారు. 

భారీ భద్రత నడుమ కోర్టుహాల్‌ వెనక డోర్‌ నుంచి ట్రంప్‌ ప్రవేశించారు. విచారణలో భాగంగా ట్రంప్‌ తొలుత ఎదుట తనపేరు, వయసు చెప్పారు. అనంతరం తనపై నమోదైన అభియోగాలను మెజిస్ట్రేట్‌ జడ్జి మోక్సిలా ఉపాధ్యాయ్‌ చదివి వినిపించారు. ఈ సందర్భంగా తాను నిర్దోషినని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇక ఇదే కేసులో యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై దాడి చేసిన నిందితులు 1000 మంది సైతం కోర్టులో హాజరయ్యారు. విచారణ అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా వేధించడం కోసమే తనపై అభియోగాలు మోపారన్నారు. ఈ ఘటన అమెరికా చరిత్రలోనే చాలా విచారకరమని అన్నారు. ‘‘వాషింగ్టన్‌ అంతటా అపరిశుభ్రత, విరిగిన భవనాలు, గోడలు ఉన్నాయి. ఇది నేను విడిచిపెట్టిన స్థలం కాదు. వాషింగ్టన్‌ను ఇలా చూస్తున్నందుకు చాలా బాధగా ఉంది’’ అని అన్నారు. కోర్టుకు హాజరుకావడానికి ముందుకు ట్రంప్‌ ప్రైవేట్‌ విమానంలో న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్నారు. తను బయలుదేరే కొన్ని గంటల ముందు తన సోషల్‌ మీడియా ట్రూత్‌ ప్లాట్‌ఫాంపై తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. తనపై మోపిన అభియోగాలను ఎదుర్కొనబోతున్నట్లు చెప్పారు. ఇక ఈకేసుకు సంబంధించి తదుపరి విచారణ ఆగస్టు 28న ఉంది. 

2021 జనవరి 26న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్‌ క్యాపిటల్‌ భవనంలో కాంగ్రెస్‌ సమావేశమైంది. అయితే ఈ సమావేశం జరగడానికి కొద్దిగంటల ముందు ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. దీంతో ట్రంప్‌ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. దీంతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున రేసులో ఉన్న ట్రంప్‌పై ఇప్పటికే రెండు నేరాభియోగాలు ఉన్నాయి. గత నాలుగు నెలల్లో ట్రంప్‌ కోర్టుకు హాజరుకావడం ఇది మూడోసారి. రహస్య దస్త్రాలను తన ఇంట్లో దాచిన కేసులో ఒకసారి, పోర్న్‌ స్టార్‌కు డబ్బు చెల్లింపుల కేసులో ట్రంప్‌ కోర్టుకు హాజరయ్యారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని