మైక్రోసాఫ్ట్‌ ఆరోపణలు అర్థరహితం

ఐరోపాలోని పలు ప్రభుత్వాల ఈ మెయిళ్లను తమ దేశానికి చెందిన హ్యాకింగ్‌ గ్రూపు హ్యాక్‌ చేసిందని మైక్రోసాఫ్ట్‌ నివేదిక పేర్కొనడాన్ని చైనా తప్పుబట్టింది.

Updated : 13 Jul 2023 05:53 IST

అమెరికా సైబర్‌ కార్యకలాపాల నుంచి దృష్టి మళ్లించే చర్య: చైనా

హాంకాంగ్‌: ఐరోపాలోని పలు ప్రభుత్వాల ఈ మెయిళ్లను తమ దేశానికి చెందిన హ్యాకింగ్‌ గ్రూపు హ్యాక్‌ చేసిందని మైక్రోసాఫ్ట్‌ నివేదిక పేర్కొనడాన్ని చైనా తప్పుబట్టింది. ఇది తప్పుడు సమాచారమని, అమెరికా సైబర్‌ కార్యకలాపాల నుంచి దృష్టి మళ్లించడానికే ఆ సంస్థ ఈ ఆరోపణలు చేసిందని విమర్శించింది. స్టార్మ్‌-0558 పేరుతో ఉన్న గ్రూపు 25 ప్రభుత్వ సంస్థలకు చెందిన ఈ మెయిళ్లను హ్యాక్‌ చేసిందని, అందులో ఐరోపాలోని ప్రభుత్వాల ఈ మెయిళ్లు ఉన్నాయని మంగళవారం మైక్రోసాఫ్ట్‌ తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొంది. తమ మెయిళ్లలో అసాధారణ కార్యకలాపాలను గుర్తించి వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. ‘ఇది గూఢచర్యంలో భాగంగా చోటుచేసుకున్న పరిణామం. నిఘా వర్గాలు ఇటువంటి సమాచారాన్ని సేకరిస్తుంటాయి’ అని మైక్రోసాఫ్ట్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు చార్లీ బెల్‌ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వ ఈ మెయిళ్లనూ చైనా గ్రూపు హ్యాక్‌ చేసిందని వాషింగ్టన్‌ పోస్టు నివేదిక పేర్కొంది. ఈ ఆరోపణలను చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ ఖండించారు. ‘ఈ ఆరోపణలను ఏ సంస్థ చేసిందన్నది కాదు. అసలు ప్రపంచంలోనే అతి పెద్ద హ్యాకర్‌ అమెరికా అన్నది ఎప్పటికీ మారని వాస్తవం. ఆ దేశమే అత్యధిక సైబర్‌ చౌర్యానికి పాల్పడుతోంది’ అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ నివేదిక ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని