ఇమ్రాన్‌కు శిక్ష విధింపులో పొరపాటు

తోషాఖానా అవినీతి కేసులో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌(70)ను అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడంలో పొరపాటు చోటుచేసుకుందని ఇస్లామాబాద్‌ హైకోర్టు శుక్రవారం పేర్కొంది.

Published : 26 Aug 2023 05:30 IST

ఇస్లామాబాద్‌ హైకోర్టు వెల్లడి
మాజీ ప్రధాని బెయిలు అభ్యర్థనపై విచారణ సోమవారానికి వాయిదా

ఇస్లామాబాద్‌: తోషాఖానా అవినీతి కేసులో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌(70)ను అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించడంలో పొరపాటు చోటుచేసుకుందని ఇస్లామాబాద్‌ హైకోర్టు శుక్రవారం పేర్కొంది. పాకిస్థాన్‌ ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది అనారోగ్యాన్ని కారణంగా చూపి విచారణకు హాజరు కాకపోవడంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దానికి ఇమ్రాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) న్యాయవాది అభ్యంతరం తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు ఇప్పటికి 20 రోజుల నుంచి జైలులో ఉన్నారని, ఆయన్ను మరో మూడు రోజులు జైలులోనే ఉంచుతారా అని ప్రశ్నించారు. ఇమ్రాన్‌కు విధించిన శిక్షను వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరారు. సోమవారం తాము కోర్టుకు హాజరుకాబోమనీ, కావాలంటే ఇమ్రాన్‌ను మళ్లీ జైలుకు పంపండని వ్యాఖ్యానించారు. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్‌కు అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించారు. ప్రస్తుతం ఆయన అటోక్‌ జైలులో ఉన్నారు. పాక్‌ ఎన్నికల సంఘం ఇమ్రాన్‌ను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని ప్రకటించి క్రిమినల్‌ కేసు పెట్టింది. ఆయన్ను అయిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడని ప్రకటించింది. ఇమ్రాన్‌కు సెషన్స్‌ కోర్టు శిక్ష విధించడంలో పొరపాటు చోటుచేసుకుందని బుధవారం సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. జైలు శిక్ష సస్పెన్షన్‌ కోసం ఇమ్రాన్‌ పెట్టుకున్న పిటిషన్‌పై ఇస్లామాబాద్‌ హైకోర్టు నిర్ణయం వెలువడేంత వరకు వేచిచూస్తామని తెలిపింది. మరోవైపు, ఇమ్రాన్‌ కేసు విచారణను సాగదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పార్టీ విమర్శించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని