రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదంపై నిర్లక్ష్యమొద్దు

రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదం, ఉగ్రవాదం అణచివేత బాధ్యతలను విస్మరించవద్దని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలకు భారత్‌ సూచించింది.

Published : 27 Sep 2023 05:08 IST

ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి
అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదు
కెనడాకు భారత్‌ పరోక్ష చురకలు
భద్రతా మండలిని విస్తరించాల్సిందే
ఐరాస సాధారణ అసెంబ్లీలో  ప్రసంగించిన మంత్రి జైశంకర్‌

ఐక్యరాజ్య సమితి: రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదం, ఉగ్రవాదం అణచివేత బాధ్యతలను విస్మరించవద్దని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలకు భారత్‌ సూచించింది. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. కెనడాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఐరాస వేదికగా భారత్‌ తన వాణిని గట్టిగా వినిపించింది. మంగళవారం ఐరాస 78వ సాధారణ అసెంబ్లీనుద్దేశించి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జై శంకర్‌ ప్రసంగించారు. ‘కొన్ని దేశాలు ఎజెండా నిర్ణయించి దానిని అందరూ అనుసరించాలన్న రోజులు పోయాయి. వర్ణ వివక్ష ఆధారంగా టీకాల్లో అన్యాయం చేసే విధానానికి చరమగీతం పాడాలి. వాతావరణ మార్పులపైనా చరిత్రాత్మక బాధ్యతల నుంచి తప్పించుకోకూడదు. మార్కెట్‌ శక్తిని ఆహారం, ఇంధనాలను పేదలను కాదని పెద్దలకు అందేలా వినియోగించకూడదు’ అని జైశంకర్‌ పేర్కొన్నారు.

జీ20లాగే భద్రతా మండలిని విస్తరించాలి

ఆఫ్రికన్‌ యూనియన్‌ను జీ20లో చేర్చేందుకు భారత్‌ చేసిన కృషిని స్ఫూర్తిగా ఐరాస భద్రతా మండలిని విస్తరించాలని జైశంకర్‌ సూచించారు. ‘భారత్‌ తీసుకున్న చొరవవల్ల మొత్తం ఆఫ్రికా తన వాణిని జీ20లో వినిపించేందుకు అవకాశం దక్కింది. ఇలాంటి కీలక ముందడుగే స్ఫూర్తిగా పురాతన ఐరాసను సంస్కరించాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిని విస్తరించాలి. సమర్థంగా పనిచేయడానికి, విశ్వసనీయతను సాధించడానికి మరింత మంది సభ్యులను మండలిలో చేర్చుకోవాలి. ఇతర దేశాల వాణిని వినడం, వారి అభిప్రాయాలను ఆలకించడం ఐరాసకు బలహీన అంశం కాదు. అది మూల సహకారానికి సంబంధించినది. కలిసి పని చేసినప్పుడే అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇప్పటికీ కొన్ని దేశాలే ఎజెండాను నిర్ణయిస్తున్నాయి. వాటిని అన్ని దేశాలపై రుద్దుతున్నాయి. ఇది నిరంతరం కొనసాగడానికి వీల్లేదు. సవాలు చేయకుండా అదే విధానాన్ని కొనసాగించడమూ సరికాదు. పారదర్శక, సమానత్వ, ప్రజాస్వామ్య విధానాలు రావాలి. విధానాల నిర్ణయంలో అందరికీ భాగస్వామ్యం ఉన్నప్పుడే అంతటా అమలవుతాయి. భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాలని భారత్‌ ఎప్పటి నుంచో పోరాడుతోంది. ఇప్పుడు మేం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించాం. ప్రస్తుతమున్న భద్రతా మండలి 21వ శతాబ్దానికి ఏ మాత్రం సరిపోదు’ అని జైశంకర్‌ పేర్కొన్నారు.


‘భారత్‌ నుంచి నమస్తే’

రాస సభలో ‘భారత్‌ నుంచి నమస్తే’ అంటూ చేతులు జోడించి మంత్రి జైశంకర్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐరాస సాధారణ అసెంబ్లీ హాలులో 17 నిమిషాలపాటు ఆయన ప్రసంగించారు. ‘ఆధునిక మూలాల్లోకి చొచ్చుకుపోయిన పురాతన సంప్రదాయ ప్రజాస్వామ్యం నుంచి ప్రస్తుత సమాజం కోసం మాట్లాడుతున్నా. అందుకే మా ఆలోచన, ఆచరణ, చర్యలు మరింత అథీకృతంగా, క్షేత్రస్థాయిలో ఫలితమిచ్చేవిగా ఉంటాయి. సంప్రదాయాలను, సాంకేతికతను మేళవించి మేం పని చేస్తున్నాం. ఇదే ప్రస్తుత ఇండియాను నిర్వచిస్తోంది. దటీజ్‌ భారత్‌’ అని జైశంకర్‌ పేర్కొన్నారు. దేశం అమృత కాలంలో ఉన్న వేళ చంద్రయాన్‌-3 విజయం ద్వారా దేశం ఏం చేయగలదో ప్రపంచానికి చాటామని చెప్పారు.


వారధిగా నిలుస్తున్నాం

ప్రపంచంలో ఉత్తర, దక్షిణాల మధ్య విభజనను రూపుమాపడానికి వారధిగా పని చేస్తున్నామని, తూర్పు, పశ్చిమాలను ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జైశంకర్‌ తెలిపారు. ప్రస్తుత మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు బలమైన దేశాలనూ ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నామని చెప్పారు. న్యూయార్క్‌లో ఉన్న ఆయన మంగళవారం దిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనివర్సిటీ కనెక్ట్‌ కార్యక్రమంలో వీడియో మాధ్యమంద్వారా మాట్లాడారు. దేశంలోని పరివర్తనను అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు అనుసరించడానికి ముందుకొచ్చాయని తెలిపారు. ఒకే ప్రపంచం.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు అన్న భారత్‌ నినాదాన్ని ప్రపంచం విశ్వసించిందని, మన దేశాన్ని పరిష్కర్తగా చూస్తోందని పేర్కొన్నారు.


30 కల్లా నిధులు విడుదల కాకుంటే అమెరికాలో ఆర్థిక సంక్షోభమే!

వాషింగ్టన్‌: అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వ నిర్వహణకు కావలసిన నిధులను కాంగ్రెస్‌ (పార్లమెంటు) అయిదు రోజుల్లో, అంటే ఈ నెల 30 కల్లా విడుదల చేయకపోతే యావత్‌ ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. లక్షలాది ప్రభుత్వోద్యోగులకు జీతాలు, పౌర సేవలకు నిధులు లభ్యం కాకపోవడమే దీనికి కారణం. అమెరికా ప్రభుత్వంపై ఇప్పటికే 33 లక్షల కోట్ల డాలర్ల రుణభారం ఉండటంతో ప్రతిపక్ష రిపబ్లికన్లు ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. పాలక డెమోక్రాట్లకు ఆధిక్యత ఉన్న ఎగువ సభ సెనెట్‌లో రిపబ్లికన్ల మద్దతుతో తాత్కాలిక నిధుల విడుదల బిల్లును ఆమోదింపజేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. సకాలంలో ప్రభుత్వానికి నిర్వహణ నిధులు అందకపోతే అమెరికా రుణ పరపతి రేటింగ్‌ పడిపోతుందని మూడీస్‌ హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు