Ivanka Trump: ఆ లెక్కలేవీ నాకు తెలియదు

ట్రంప్‌ కంపెనీలపై న్యూయార్క్‌లో దాఖలైన సివిల్‌ మోసం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా బుధవారం న్యూయార్క్‌ కోర్టులో వాంగ్మూలమిచ్చారు.

Updated : 09 Nov 2023 07:28 IST

ట్రంప్‌ కేసులో ఇవాంకా వాంగ్మూలం

న్యూయార్క్‌: ట్రంప్‌ కంపెనీలపై న్యూయార్క్‌లో దాఖలైన సివిల్‌ మోసం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా బుధవారం న్యూయార్క్‌ కోర్టులో వాంగ్మూలమిచ్చారు. కంపెనీ తయారు చేసిన స్టేట్‌మెంట్లను తాను వ్యక్తిగతంగా చూడలేదని, వాటితో తనకు సంబంధం లేదని తెలిపారు. ‘ట్రంప్‌ కోసం ఏ పత్రాలను తయారుచేశారో ప్రత్యేకించి నేను చూడలేదు. నేను వాటికి దూరంగానే ఉన్నా. ఆస్తుల గురించీ పట్టించుకోలేదు. కంపెనీ తప్పుడు స్టేట్‌మెంట్లను ఎవరు తయారు చేశారో నాకు తెలియదు. ఎలా తయారయ్యాయో తెలియదు’ అని ఇవాంకా వాంగ్మూలమిచ్చారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కార్యాలయంలో సీనియర్‌ సలహాదారుగా నియమితులయ్యే వరకూ ఇవాంకా ట్రంప్‌ కంపెనీలో కార్యనిర్వాహక వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2017లో ఆమె కంపెనీని వీడారు. అయితే అప్పటికే కంపెనీ తరఫున రుణం తీసుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారని అటార్నీ జనరల్‌ కార్యాలయం ఆరోపించింది. ఆమెకు ఇన్సూరెన్సును, ఇంటి అద్దెను, ఖర్చులను, సిబ్బంది వ్యయాన్ని, క్రెడిట్‌ కార్డు బిల్లులను కంపెనీయే చెల్లించిందని పేర్కొంది. చివరకు ఆమె లీగల్‌ ఫీజులనూ కంపెనీ భరించిందని వెల్లడించింది. ఈ కేసులో గత వారమే ట్రంప్‌ కుమారుల వాంగ్మూలాలను కోర్టు తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని