నావల్నీ మృతదేహం ఎట్టకేలకు అప్పగింత

రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని ఎట్టకేలకు ఆయన తల్లికి అప్పగించారు. ఈ విషయాన్ని ఆయన అనుచరుడొకరు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. మృతదేహం అప్పగింతకు రష్యాపై ఒత్తిడి తెచ్చినవారికి కృతజ్ఞతలు తెలిపారు.

Published : 25 Feb 2024 06:41 IST

చనిపోయిన తర్వాతా చిత్రహింసే

మాస్కో: రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని ఎట్టకేలకు ఆయన తల్లికి అప్పగించారు. ఈ విషయాన్ని ఆయన అనుచరుడొకరు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. మృతదేహం అప్పగింతకు రష్యాపై ఒత్తిడి తెచ్చినవారికి కృతజ్ఞతలు తెలిపారు. తొమ్మిది రోజుల క్రితం ఆర్కిటిక్‌ ప్రాంతంలోని ఒక జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో నావల్నీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని అక్కడే రహస్యంగా సమాధి చేయడానికి ఒప్పుకోవాల్సిందిగా ఆయన తల్లిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఒత్తిడి తెస్తున్నారని నావల్నీ భార్య యూలియా నావల్నయా తొలుత ఆరోపించారు. పుతిన్‌ తన చర్యలతో క్రైస్తవ మతాన్ని కించపరుస్తున్నారని ఓ వీడియోలో యూలియా విమర్శించారు. నావల్నీ మృతదేహం ఇప్పటికే కుళ్లిపోవడం ఆరంభించినందున వెంటనే ఖననం చేయడానికి ఒప్పుకోవాలని ఆయన తల్లిని అధికారులు వేధిస్తున్నారని ఆమె వెల్లడించారు. తన భర్త నావల్నీని బతికుండానే కాకుండా చనిపోయిన తరవాత కూడా చిత్రవధ చేస్తున్నారనీ, ఆయన మృతదేహాన్ని అవహేళన చేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. నావల్నీ మృతదేహాన్ని వెంటనే అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత కాసేపటికే మృతదేహం అప్పగింత సమాచారం వెలుగుచూసింది. అంత్యక్రియలు జరగాల్సి ఉంది. నావల్నీ మృతికి పుతిన్‌ కారకుడన్న ఆరోపణల్ని రష్యా అధ్యక్ష భవనం ఖండించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని