కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..

అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్‌ టైసన్‌ (53) అనే ఆఫ్రో-అమెరికన్‌ ప్రాణాలు కోల్పోయాడు.

Published : 28 Apr 2024 06:15 IST

అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి మరో ఆఫ్రో-అమెరికన్‌ బలి

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్‌ టైసన్‌ (53) అనే ఆఫ్రో-అమెరికన్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించి ఒహాయో పోలీసుల బాడీకామ్‌ దృశ్యాలు వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏప్రిల్‌ 18న కారులో వెళుతున్న టైసన్‌ తూర్పు కాంటన్‌లో ఓ యుటిలిటీ స్తంభాన్ని ఢీ కొట్టాడు. అనంతరం బార్‌లోకి పారిపోయినట్లు గస్తీ అధికారులు గుర్తించారు. ఫ్రాంక్‌ను అదుపులోకి తీసుకొనే క్రమంలో అతడికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులు తనను చంపడానికి వస్తున్నారంటూ టైసన్‌ కేకలు వేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఆ తర్వాత పోలీసులు అతడిని కిందపడేసి, చేతికి బేడీలు వేశారు. ఒక అధికారి ఫ్రాంక్‌ మెడపై మోకాలితో అదిమిపట్టాడు. ‘నాకు ఊపిరాడడం లేదు’ అని అతడు మొత్తుకుంటున్నా వినిపించుకోకపోగా.. అరవొద్దు అంటూ గదమాయించాడు. కొద్దిసేపటికి టైసన్‌లో ఎలాంటి చలనం లేనట్లు వారికి అర్థమైంది. దాంతో పోలీసులు అతడికున్న బేడీలు తీసి, సీపీఆర్‌ చేశారు. తర్వాత స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ టైసన్‌ ప్రాణాలు విడిచాడు. గతంలో జార్జి ఫ్లాయిడ్‌ అనే వ్యక్తి ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని