Israel: 1500 మంది హమాస్‌ మిలిటెంట్లు హతం.. ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడి

Israel Hamas Conflict: తమ దేశంలోకి చొరబడిన హమాస్‌ ఉగ్రవాదులను ఇజ్రాయెల్‌ సైన్యం మట్టుబెట్టింది. తమ భూభాగంలో ఇప్పటివరకు 1500 మంది హమాస్‌ ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడించింది.

Published : 10 Oct 2023 12:50 IST

జెరూసలెం: తమ దేశంపై మెరుపు దాడికి దిగిన హమాస్‌ (Hamas) మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ సైన్యం (Israel Army) దీటుగా ప్రతిఘటించింది. దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఏరిపారేసింది. దాదాపు 1500 మంది ముష్కరులను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం మంగళవారం ప్రకటించింది. సరిహద్దులు కూడా పూర్తిగా తమ అధీనంలోకి వచ్చినట్లు తెలిపింది. (Israel - Hamas conflict)

‘‘గాజా స్ట్రిప్‌ (Gaza Strip) చుట్టూ ఉన్న ఇజ్రాయెల్‌ భూభాగంలో దాదాపు 1500 మంది హమాస్‌ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించాం. దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్‌ ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాలను తిరిగి మా అధీనంలోకి తీసుకున్నాం. సరిహద్దుల వెంబడి కూడా పరిస్థితి పూర్తిగా మా నియంత్రణలోకి వచ్చింది’’ అని ఇజ్రాయెల్‌ ఆర్మీ అధికార ప్రతినిధి రిచర్డ్‌ హెచ్‌ మీడియాకు వెల్లడించారు. అంతేగాక, గత రాత్రి నుంచి ఒక్క హమాస్‌ ఉగ్రవాది కూడా సరిహద్దులు దాటలేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ చొరబాట్లు జరిగే అవకాశముందని తెలిపారు.

రంగులు మార్చి.. ఏమార్చి.. ఇజ్రాయెల్‌పై దాడికి హమాస్‌ వ్యూహం..!

ఇజ్రాయెల్‌లో హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన అత్యంత పాశవిక మారణహోమంలో మృతుల సంఖ్య 900కు చేరుకుంది. అటు గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో మరణించిన వారి సంఖ్య 680కు పెరిగినట్లు పాలస్తీనా అధికారులు వెల్లడించారు. మరోవైపు, సరిహద్దుల్లో హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య నాలుగో రోజు పోరు కొనసాగుతోంది.

ఇజ్రాయెల్‌కు అమెరికా మందుగుండు..

ఇదిలా ఉండగా.. హమాస్‌ దాడిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా (USA) ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు కీలకమైన మందుగుండు, మిలిటరీ పరికరాల డెలివరీని ప్రారంభించింది. ఇప్పటికే, విమాన వాహకనౌక, యుద్ధ నౌకలను అమెరికా ఇజ్రాయెల్ తీరానికి పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధంలో నేరుగా కాలుపెట్టే (అమెరికా సైన్యాన్ని పంపడంపై స్పందిస్తూ) ఉద్దేశం తమకు లేదని అమెరికా జాతీయ భధ్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు