Canada: నిజ్జర్‌ హత్యకు సంబంధించి 90 సెకన్ల సీసీటీవీ పుటేజీ.. అమెరికా పత్రిక వెల్లడి

ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించిన సీసీటీవీ క్లిప్‌ తాము చూశామని అమెరికా పత్రిక వాషింగ్టన్‌ పోస్టు వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు సర్రేలోని గురుద్వారా వద్ద ఉగ్రవాది నిజ్జర్‌పై కాల్పులు జరిపిన దృశ్యాలు అందులో ఉన్నాయని పేర్కొంది.

Published : 26 Sep 2023 13:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడా(Canada)లోని ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి అమెరికా(USA)కు చెందిన ఓ పత్రిక సంచలన కథనం వెలువరించింది. నిజ్జర్‌ హత్యకు సంబంధించిన వీడియోను తాము చూసినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక పేర్కొంది. సమీపంలోని సీసీటీవీ నుంచి ఈ పుటేజీ లభించిందని తెలిపింది. దీనిలో దుండగులు రావడం.. నిజ్జర్‌ను తుపాకీతో కాల్చి తాపీగా వెళ్లిపోయిన దృశ్యాలు నిక్షిప్తమై ఉన్నాయని వెల్లడించింది. 

దాదాపు 90 సెకన్ల నిడివిగల వీడియోలో నిజ్జర్‌ వినియోగించే గ్రేకలర్‌ పికప్‌ ట్రక్‌, ఓ తెల్లటి సెడాన్‌ కారు పక్కపక్కనే సమాంతరంగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. అంతలోనే సెడాన్‌ వేగంగా పికప్‌ ట్రక్‌ ఎదుటకు వచ్చి ఒక్కసారిగా ఆగిపోయింది. అదే సమయంలో హుడెడ్‌ స్వెట్‌ షర్ట్‌లు వేసుకొన్న ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో నిజ్జర్‌ ఉన్న పికప్‌ ట్రక్‌ వద్దకు వచ్చారు. మరోవైపు సెడాన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ఆ వ్యక్తులు  పాయింట్‌ బ్లాంక్‌ రేంజి నుంచి డ్రైవర్‌ సీట్‌లో ఉన్న వ్యక్తిపై తూటాల వర్షం కురిపించారు. మొత్తం 50 తూటాలను కాల్చగా.. వీటిల్లో 34 నిజ్జర్‌ శరీరం లోకి దూసుకెళ్లాయి. అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు సెడాన్‌ వెళ్లిన దిశగా వేగంగా పరిగెత్తారు. ఈ ఘటన రాత్రి 8.27  సమయంలో చోటు చేసుకుంది.

సమీపంలోని ఓ మైదానంలో ఫుట్‌బాల్‌ ఆడుతున్న భూపిందర్‌జీత్‌ సింగ్‌ అనే వ్యక్తి ఘటనా స్థలానికి పరిగెత్తుకొంటూ వచ్చి చూడగా.. అప్పటికే నిజ్జర్‌ కారులో అచేతనంగా పడి ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు నాయకత్వం విషయంలో కెనడా రాయల్‌ మౌంటెడ్‌ పోలీసు, సర్రే హోమిసైడ్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం మధ్య కొద్ది సేపు వాదనలు జరిగాయి. అది కూడా తీవ్ర జాప్యానికి కారణమైందని భూపిందర్‌ సింగ్‌ వెల్లడించినట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. 

భారత్‌ కీలక భాగస్వామే.. కానీ..!

నిజ్జర్‌ హత్య భారత్‌-అమెరికా మధ్య తీవ్రమైన దౌత్య వివాదానికి దారి తీసిన సమయంలో వాషింగ్టన్‌ పోస్టు ఈ కథనం ప్రచురించడం విశేషం. అత్యవసరమైతే తప్ప భారత పర్యటన చేయొద్దని తమ దేశ పౌరులకు కెనడా సోమవారం రెండోసారి ప్రయాణ సలహాను జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో కెనడాపై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, కొందరు ఆందోళనలకూ పిలుపునిస్తున్నారని.. కాబట్టి భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని తమ దేశ పౌరులకు సూచించింది. ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని