Barack Obama: బరాక్‌ ఒబామా ప్రవేశంపై రష్యా నిషేధం

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (Barack Obama) సహా 500 మంది అమెరికన్లపై రష్యా నిషేధం విధించింది. ఉక్రెయిన్‌ విషయంలో మాస్కోపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడింది.

Updated : 20 May 2023 14:18 IST

మాస్కో: ఉక్రెయిన్‌ (Ukraine)పై దండయాత్ర సాగిస్తున్న రష్యా (Russia)పై మరింతగా ఆంక్షల చట్రం బిగించాలని పశ్చిమ దేశాలు నిర్ణయించారు. అయితే, దీనికి స్పందించిన మాస్కో.. ప్రతిచర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (Barack Obama), ప్రముఖ కమెడియన్‌ స్టీఫెన్‌ కోల్‌బెర్గ్‌ (Stephen Colbert) సహా 500 మంది అమెరికన్లు తమ దేశంలోకి అడుగుపెట్టకుండా రష్యా నిషేధం విధించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ జాబితా విడుదల చేసింది.

ఈ జాబితాలో 45 మంది యూఎస్‌ (USA) చట్టసభ సభ్యులు, మాజీ రాయబారులు ఉన్నారు. వ్యక్తుల పరంగా ఏయే కారణాలతో వీరిపై నిషేధం విధించారన్న విషయాన్ని మాస్కో విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. అయితే, రష్యాపై వ్యతిరేకతను వ్యాప్తి చేయడం, ఉక్రెయిన్‌ (Ukraine)కు ఆయుధాలు సరఫరా చేయడం వంటి కారణాలతో ఈ నిషేధం అమలు చేసినట్లు పేర్కొంది.

ఈ ఆంక్షలతో పాటు.. రష్యా (Russia) చెరలో ఉన్న వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఇవాన్‌ గెర్‌ష్కోవిచ్‌కు కాన్సులర్‌ యాక్సెస్‌ ఇవ్వాలని అమెరికా చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించినట్లు మాస్కో విదేశాంగ శాఖ వెల్లడించింది. గత నెల రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ అమెరికా పర్యటనకు వెళ్లగా.. ఆ పర్యటనను కవర్‌ చేసేందుకు రష్యన్‌ జర్నలిస్టులకు అగ్రరాజ్యం వీసాలను తిరస్కరించింది. ఆ చర్యకు ప్రతిస్పందనగానే.. ఇవాన్‌కు కాన్సులర్‌ యాక్సెస్‌ను తిరస్కరిస్తున్నట్లు మాస్కో తెలిపింది. గూఢచర్యం కేసులో ఇవాన్‌ను ఈ ఏడాది మార్చిలో రష్యా పోలీసులు అరెస్టు చేశారు.

రష్యాపై ఇప్పటికే విధించినవాటికి అదనంగా మరిన్ని నిషేదాజ్ఞలు అమల్లోకి తీసుకురావాలని పశ్చిమదేశాలు నిర్ణయించాయి. తాజాగా జపాన్‌లో జరుగుతున్న శక్తిమంతమైన జీ-7 (G-7) దేశాల సదస్సులో దీనిపై తీర్మానం తీసుకురానున్నాయి.  తాజా ఆంక్షల్లో భాగంగా రష్యాకు చెందిన దాదాపు 70 కంపెనీలపై అమెరికా (America) నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. జీ-7లోని ఇతర సభ్యదేశాలూ అదే బాటలోనే నడవనున్నట్లు అమెరికాకు చెందిన ఓ అధికారి చెప్పారు. రష్యాను మరింతగా ఏకాకిని చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మాస్కో ప్రతిచర్యకు దిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని