Obama: మా హృదయం ముక్కలవుతోంది: అమెరికా కోర్టు తీర్పుతో ఒబామా దంపతుల ఆవేదన

విద్యార్థుల ప్రతిభను జాతి ఆధారంగా చూడొద్దంటూ అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పును ఒబామా దంపతులు (Barack Obama-Michelle Obama) వ్యతిరేకించారు. దీనిపై ట్విటర్‌లో వారు స్పందించారు. 

Updated : 30 Jun 2023 15:07 IST

వాషింగ్టన్‌: జాతి ఆధారంగా కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడాన్ని తప్పుపడుతూ అమెరికాలోని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా( Barack Obama) దంపతులు స్పందించారు. ఈ తీర్పు తమ హృదయాన్ని ముక్కలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ట్విటర్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకొన్నారు. జాతితో సంబంధం లేకుండా విద్యార్థులందరూ విజయం సాధించడానికి ఈ విధానాలు అవసరమన్నారు. 

‘సమానత్వంతో నిండిన సమాజ నిర్మాణానికి ఈ తరహా విధానం (ఒక జాతిని ఉద్దేశించి జరుగుతున్న ప్రక్రియ) ఎన్నటికీ సమాధానం కాదు. కానీ, తరాల పాటు అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో స్థానం పొందలేని విద్యార్థులకు ఈ విధానాలు అవకాశాన్ని కల్పిస్తాయి. సుప్రీంకోర్టు తీర్పుతో మా ప్రయత్నాలను రెట్టింపు చేయాల్సి ఉంది’ అని బరాక్‌ ఒబామా ( Barack Obama) రాసుకొచ్చారు. 

‘విద్యార్థుల ప్రతిభను వ్యక్తిగతంగా చూడాలి. అంతేగానీ జాతి ఆధారంగా కాదు. చాలా విశ్వవిద్యాలయాలు ఎప్పటి నుంచో ఈ వివక్షను చూపుతున్నాయి. నైపుణ్యాలను అభ్యసించడం, పాఠాలను నేర్చుకోవడం అనేవి జాతిని బట్టి ఉండవు. అది వ్యక్తిగతంగా సంపాదించే గుర్తింపు. శరీర రంగు దానిని ఇవ్వలేదు. రాజ్యాంగ చరిత్ర ఇటువంటి వాటిని క్షమించదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పుపై మిషెల్‌ ఒబామా స్పందించారు. ఇప్పుడు ఆ యువతకు ఎలాంటి అవకాశాలుంటాయో ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతోందని ఒక నోట్‌ షేర్ చేశారు. 

ఈ తీర్పును డెమొక్రాట్లు వ్యతిరేకించగా.. రిపబ్లికన్లు స్వాగతించారు. ఇప్పుడు అమెరికా మిగతా ప్రపంచంతో పోటీ పడేందుకు ఇది వీలు కల్పిస్తుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని