Flight: విమానం గాల్లో ఉండగా.. బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్‌

విమానం గాల్లో ఉండగా ఉన్నట్టుండి పైలట్‌ (Pilot) కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. మియామీ నుంచి చిలీ వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 17 Aug 2023 12:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా (USA)లోని మియామి నుంచి చిలీ (Miami - Chile flight) బయల్దేరిన ఓ కమర్షియల్‌ విమానంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విమానం ప్రయాణిస్తుండగా పైలట్‌ (Pilot) హఠాత్తుగా కుప్పకూలారు. దీంతో అప్రమత్తమైన కో-పైలట్లు (Co-Pilot) విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ పైలట్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌ (LATAM Airlines)కు చెందిన ఓ విమానం స్థానిక కాలమానం ప్రకారం.. గత ఆదివారం రాత్రి మియామీ ఎయిర్‌పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన మూడు గంటల తర్వాత కెప్టెన్‌ ఇవాన్‌ ఆండౌర్‌ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన ఇతర సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది.

హాట్‌ చాక్లెట్‌తో చిన్నారికి గాయాలు.. విస్తారా విమానంలో ఘటన

దీంతో అప్రమత్తమైన కో-పైలట్లు విమానాన్ని సమీపంలోని పనామా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేశారు. అనంతరం ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ సిబ్బంది హుటాహుటిన ఇవాన్‌ను పరిశీలించారు. అయితే దురదృష్టవశాత్తూ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఘటన సమయంలో విమానంలో 271 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 56 ఏళ్ల ఇవాన్‌ గత 25 ఏళ్లుగా పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిపై లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ ఘటన నేపథ్యంలోనే ఆ విమానంలోని ప్రయాణికులను మరుసటి రోజు చిలీకి చేర్చినట్లు ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని