హాట్‌ చాక్లెట్‌తో చిన్నారికి గాయాలు.. విస్తారా విమానంలో ఘటన

విమాన సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఓ ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వెల్లడించారు. (Vistara)

Published : 17 Aug 2023 10:47 IST

దిల్లీ: విమాన ప్రయాణంలో వేడి పానీయం(hot beverage) చిందడంతో ఓ చిన్నారి గాయపడింది. ఈ విషయంలో విస్తారా(Vistara) సంస్థ వ్యవహరించిన తీరుపై ఆ చిన్నారి తల్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై ఆ సంస్థ స్పందించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

ఇటీవల రచనా గుప్తా అనే మహిళ తన కుమార్తెతో కలిసి దిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌( Delhi to Frankfurt) వెళ్లే విస్తారా విమానం ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత ఆమె తన కుమార్తె కోసం హాట్‌ చాక్లెట్‌ను ఆర్డర్ చేశారు. అయితే, ఆ వేడి పానీయం పొరపాటున ఆ పాపపై పడింది. ఆ వేడికి ఆ చిన్నారి చర్మం ఎర్రగా కందిపోయింది. దీనిపై రచన ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ‘ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న విమానంలో ఒక ఎయిర్‌హోస్టెస్‌ వల్ల మా పదేళ్ల పాపకు కాలిన గాయాలయ్యాయి. ఆ తర్వాత వారి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఆ ఎయిర్‌ హోస్టెస్, సిబ్బంది మాకు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు’ అని వెల్లడించారు. 

నేపాల్‌లో హోటల్‌.. యూపీలో గెస్ట్‌హౌస్‌.. ఈ దొంగ మామూలోడు కాదు

‘ప్రథమ చికిత్స అందించి,  ఆ కొత్త ప్రదేశంలో మమ్మల్ని అంబులెన్స్‌లో పంపించేశారు. మా లగేజ్‌ను తరలించే విషయంలో ఎలాంటి సాయం అందలేదు. వైద్య ఖర్చులు మొత్తం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన వల్ల మేం తర్వాత ఎక్కాల్సిన విమానం మిస్‌ అయ్యాం. ఆ విషయంలో కూడా వారు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు’ అని తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వెల్లడించారు. ఈ పోస్టు తర్వాత విమానయాన సంస్థ మమ్మల్ని సంప్రదించిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విస్తారా(Vistara) వివరణ ఇచ్చింది. 

‘ఆ దురదృష్టకర ఘటనను మేం ధ్రువీకరిస్తున్నాం. ఆ చిన్నారి తల్లిదండ్రుల కోరిక మేరకు మేం ఆ వేడి పానీయాన్ని అందించాం. సిబ్బంది దానిని సర్వ్ చేసే సమయంలో చిన్నారి కదలడంతో అనుకోకుండా అది చేజారింది. వెంటనే ఆ పాపకు ప్రథమ చికిత్స అందించాం. విమానం ఫ్రాంక్‌ఫర్ట్‌లో దిగేవరకు మా వైద్య సిబ్బంది వెంటే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. వెంటనే అంబులెన్స్ సిద్ధం చేసి, వారిని ఆసుపత్రికి తరలించాం. అప్పటి నుంచి ప్రతిదశలో వారిని సంప్రదిస్తూనే ఉన్నాం. అవసరమైన ఏర్పాట్లు చేశాం. వైద్య ఖర్చులు చెల్లిస్తామని వారికి వెల్లడించాం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మా సేవలను మెరుగుపర్చుకుంటాం. వినియోగదారుల భద్రతకే మా తొలి ప్రాధాన్యత’ అని పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు