Drone Attack: 75 డ్రోన్లతో దండయాత్ర.. ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడి!

ఉక్రెయిన్‌పై రష్యా ఏకంగా 75 డ్రోన్లతో విరుచుకుపడింది. సైనిక చర్య మొదలు ఉక్రెయిన్‌పై ఇదే అతిపెద్ద డ్రోన్‌ దాడి.

Updated : 25 Nov 2023 17:18 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా విరుచుకుపడింది. ఏకంగా 75 డ్రోన్లు ప్రయోగించింది. 2022 ఫిబ్రవరిలో సైనిక చర్య మొదలు మాస్కో జరిపిన అతిపెద్ద డ్రోన్‌ దాడి (Drone Attack) ఇదేనని ఉక్రెయిన్‌ బలగాలు వెల్లడించాయి. దేశ రాజధాని ‘కీవ్‌’ ప్రధాన లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ఉక్రెయిన్‌ వాయుసేన కమాండర్ మైకోలా ఒలేష్‌చుక్ తెలిపారు. మొత్తం 75 ఇరానీయన్‌ ఆత్మాహుతి డ్రోన్లలో 71 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసినట్లు చెప్పారు. కీవ్‌తోపాటు సుమీ, ద్నిప్రోపెట్రోవ్స్క్, జపోరిజియా, మైకోలైవ్ తదితర ప్రాంతాలపైనా రష్యా సేనలు డ్రోన్‌ దాడులు జరిపాయన్నారు.

కీవ్‌పైకి ప్రయోగించిన 60కిపైగా డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసినట్లు నగర పాలనాయంత్రాంగం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 వరకు ఈ డ్రోన్లు వెల్లువెత్తినట్లు అధికారులు చెప్పారు. ఫలితంగా 77 నివాస భవనాలు, 120 కార్యాలయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు. డ్రోన్ల ద్వారా కీవ్‌పై రష్యా జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని పేర్కొన్నారు. ఈ దాడుల్లో దాదాపు ఐదుగురు పౌరులు గాయపడినట్లు కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో చెప్పారు. బాధితుల్లో 11 ఏళ్ల బాలిక కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు.

దేశం వీడుతున్న శరణార్థుల్నీ వదలని పాక్‌.. వారిపై ఎగ్జిట్‌ ఛార్జీలు

1932- 33లో ఉక్రెయిన్‌లో లక్షలాది మంది మరణానికి కారణమైన కరవు విషాదాన్ని గుర్తుచేసుకునే ‘హోలోదోమోర్ సంస్మరణ దినం’ రోజునే ఈ దాడి జరిగింది. ‘మన సైనికులు చాలావరకు డ్రోన్లను కూల్చివేశారు. కానీ, కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి’ అని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. గగనతల రక్షణను మరింత పటిష్ఠం చేసి, మరిన్ని లక్ష్యాలను నేలకూల్చుతామని చెప్పారు. అంతకుముందు రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పంపై ఉక్రెయిన్‌ సైతం డ్రోన్లతో దాడి చేసింది. గత 21 నెలల్లో ఉక్రెయిన్‌ చేపట్టిన అతిపెద్ద డ్రోన్‌ దాడుల్లో ఇదొకటని మాస్కో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని