దేశం వీడుతున్న శరణార్థుల్నీ వదలని పాక్‌.. వారిపై ఎగ్జిట్‌ ఛార్జీలు

అఫ్గానిస్థాన్‌(Afghanistan) శరణార్థుల పట్ల పాకిస్థాన్‌ వ్యవహరిస్తోన్న తీరు విమర్శలకు దారితీస్తోంది. దాయాది దేశం తీసుకుంటున్న చర్యలను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. 

Published : 25 Nov 2023 16:07 IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌(Pakistan) కొత్త ఆదాయమార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. పాక్‌ను వీడుతున్న అఫ్గానిస్థాన్‌ శరణార్థుల(Afghan Refugees) నుంచి ఎగ్జిట్ ఛార్జీల(Exit Fee)ను వసూలు చేయాలని నిర్ణయం తీసుకుందని మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. పాశ్చాత్య దేశాలు, ఐరాస పాక్‌ చర్యలను ఖండించాయి. 

2021లో అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో పౌర ప్రభుత్వాన్ని కూలదోసి, తాలిబన్లు అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. వారి మునుపటి ఆరాచక పాలనలో అనుభవించిన కష్టాలతో బెంబేలెత్తిన అఫ్గాన్‌ వాసులు పొట్ట చేతపట్టుకొని పలు దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లారు. 2023 వరకు 64.3 లక్షల మంది శరణార్థులుండగా.. వారిలో 34.3 లక్షల మంది ఇరాన్‌ను ఆశ్రయం కోరారు. 21.3 లక్షల మంది పాకిస్థాన్‌కు వెళ్లారు. 

అఫ్గానీయుల ఇంటి బాట.. 4 లక్షలమంది వెనక్కి!

అయితే పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోన్న నేపథ్యంలో.. సరైన అనుమతులు లేకుండా పాకిస్థాన్‌ (Pakistan)లో నివసిస్తోన్న అఫ్గానీయులను వారి స్వదేశానికి పంపించేస్తున్న విషయం తెలిసిందే. నవంబరు 1వ తేదీ నాటికే దేశం విడిచిపోవాలని ఆదేశించిన పాక్‌ అధికారులు.. ఇంకా ఇక్కడే ఉన్నవారిపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం గడువు ముగిసిన నేపథ్యంలో.. స్థానిక పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపడుతున్నారు. ఇంకా ఇక్కడే అక్రమంగా నివసిస్తోన్నవారిని ప్రత్యేక కేంద్రాలకు తరలిస్తున్నారు. 

ఈ క్రమంలో పాక్‌ అనూహ్య చర్యలు ప్రారంభించింది. పునరావాస పథకాల ద్వారా పాశ్చాత్య దేశాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వారు పాక్‌ను వీడేందుకు 830 డాలర్లు( సుమారుగా రూ.69వేలు) చెల్లించేలా విధానాన్ని తీసుకువచ్చింది. ఒక్కో వ్యక్తి ఈ మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. మొదట అసలు ఆ మొత్తాన్ని 10 వేల డాలర్లు అనుకున్నారట. అయితే తర్వాత దానికి 830 డాల్లకు తగ్గించారట. అయితే ఈ చర్యను పలు దేశాలు ఖండిస్తున్నాయి. పాక్‌ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. శరణార్థుల నుంచి డబ్బు వసూలు చేయడం ఎబ్బెట్టుగా ఉందని వ్యాఖ్యానించాయి. అయితే ఈ విధానాన్ని మార్చుకునే ఉద్దేశం ఏదీ లేదని పాక్‌ విదేశాంగ వెల్లడించడం గమనార్హం. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని